Begin typing your search above and press return to search.

గేమ్‌ ఛేంజర్‌... ఆడియన్స్‌ షాక్‌ అవుతారు

రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.

By:  Tupaki Desk   |   2 Dec 2024 12:30 PM GMT
గేమ్‌ ఛేంజర్‌... ఆడియన్స్‌ షాక్‌ అవుతారు
X

రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. వచ్చే నెలలో సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో సీనియర్‌ నటుడు, ఫ్యామిలీ హీరోగా గుర్తింపు దక్కించుకుని ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీకాంత్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. చిరంజీవితో గతంలో నటించిన శ్రీకాంత్‌ మొదటి సారి రామ్‌ చరణ్ తో నటించారు. చరణ్ తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం పట్ల శ్రీకాంత్‌ చాలా సంతోషం వ్యక్తం చేశారు. చరణ్ పై ప్రశంసలు కురిపించడంతో పాటు తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గేమ్‌ ఛేంజర్ సినిమాలో తన పాత్ర ఓల్డ్‌ గెటప్‌లో ఉంటుందని పేర్కొన్నాడు. అంతే కాకుండా తన పాత్ర నెగటివ్‌ షేడ్స్‌ ను కలిగి ఉంటుందని, ఈ స్థాయిలో డార్క్‌ షేడ్‌ పాత్రలో తాను ఎప్పుడూ నటించలేదు అంటూ శ్రీకాంత్‌ అన్నాడు. ఈ సినిమాలో తనను చూసి ఆడియన్స్‌ షాక్ అవుతారు అన్నాడు. దర్శకుడు శంకర్‌ తనను పూర్తిగా కొత్తగా చూపించారని, తన పాత్ర విషయంలో చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు, సినిమాపై సోషల్‌ మీడియాతో పాటు, అన్ని చోట్ల చర్చ జరిగేలా చేయడం జరిగింది. సినిమాపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి.

శంకర్‌ మొదటి సారి తెలుగులో సినిమా చేస్తున్న నేపథ్యంలో మొదట్లో అంచనాలు భారీగా పెరిగాయి. మధ్యలో ఇండియన్ 2 ఫలితం కారణంగా మొత్తం నీరుగారిపోయారు. కానీ టీజర్‌ విడుదల తర్వాత గేమ్‌ ఛేంజర్‌ మామూలుగా ఉండదని అంతా అనుకుంటున్నారు. తప్పకుండా భారీ వసూళ్లు సాధించడంతో పాటు చరణ్ కెరీర్‌లో నిలిచి పోయే సినిమాగా గేమ్‌ ఛేంజర్‌ ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఈ వారంలో విడుదల కాబోతున్న పుష్ప 2 ను మించి గేమ్‌ ఛేంజర్‌ ఉంటుంది అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తూ తమ నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ మాత్రమే కాకుండా పలువురు ప్రముఖ నటీ నటులు నటించారు. రామ్‌ చరణ్ డ్యూయల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. తండ్రి పాత్రకు జోడీగా అంజలి హీరోయిన్‌గా నటించగా, కొడుకు పాత్రకు పోటీగా కియారా అద్వానీ నటించిన విషయం తెల్సిందే. మొత్తానికి గేమ్‌ ఛేంజర్‌ లో భారీ తారాగణం ఉంటుంది. ప్రతి పాత్ర సినిమాకు అత్యంత కీలకంగా ఉంటుంది. ఈ సినిమా కోసం యూఎస్‌లో చేయబోతున్న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వార్తల్లో నిలుస్తోంది. ఈనెలలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూఎస్‌లో నిర్వహించబోతున్నాం అంటూ దిల్‌ రాజు ప్రకటించాడు.