Begin typing your search above and press return to search.

నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌పై ఫిర్యాదు!

నటుడిపై తగిన చర్యలు తీసుకోవాలని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణును కోరారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 1:45 PM GMT
నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌పై ఫిర్యాదు!
X

'పొట్టేల్‌' సినిమా సక్సెస్‌ మీట్‌లో రివ్యూ రైటర్స్ పై సినీ నటుడు శ్రీ‌కాంత్ అయ్యంగార్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దరిద్రానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారంటూ, చెప్పలేని భాషలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ జర్నలిస్టులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. శ్రీ‌కాంత్ మాటలను తీవ్రంగా పరిగణించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్.. తాజాగా ఆయనపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసారు. నటుడిపై తగిన చర్యలు తీసుకోవాలని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణును కోరారు.

‘‘ప్రసాద్‌ ల్యాబ్‌లో శనివారం నాడు జరిగిన ‘పొట్టేల్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మీడియా గురించి అత్యంత దారుణంగా మాట్లాడారు. మీడియా పట్ల, సినిమా రివ్యూలు రాసే వారిపై తీవ్రమైన పదజాలంతో, మీడియాలో మాట్లాడలేని పదాలను ఉపయోగించారు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మాట్లాడిన తీరుని మీడియా సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆయన మాటలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. కావున ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకి ఫిల్మ్‌ క్రిటిక్స్ అసోసియేషన్‌ రాసిన కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దీనికి శ్రీకాంత్‌ మాట్లాడిన వీడియో లింక్ ని జత చేసినట్లు తెలిపారు.

యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో సాహిత్‌ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘పొట్టేల్‌’. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సినిమాలో నటించిన శ్రీకాంత్‌ అయ్యంగార్ సహా చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ పరుష పదజాలం వాడుతూ.. షార్ట్ ఫిలిం తీయని వాళ్ళు రివ్యూలు ఇస్తున్నారని, వాళ్ళందరూ పారసైట్స్ అని అన్నారు. నీచమైన కామెంట్స్ చేస్తూ.. సినిమా రివ్యూలను ఆపేయాలని పేర్కొన్నారు.

సినిమాకి సమీక్షలు రాసే రివ్యూవర్స్‌ ను విమర్శించడానికి శ్రీకాంత్‌ అయ్యంగార్ ఉపయోగించిన అసభ్య పదజాలంపై అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. శ్రీకాంత్‌ వాడిన భాషకు క్షమాపణలు చెప్పేవరకు, ఆయన నటించే సినిమాల మీడియా కార్యక్రమాలకు హాజరుకాకూడదని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ల సంఘం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆయనపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. మరి దీనిపై ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.