శ్రీకాంత్ ఒదెలా.. బ్లాస్ట్ చేసేలా ఉన్నాడు
దసరా కంటే ది ప్యారడైజ్ సినిమా అంతకుమించి అనేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క సినిమాతోను యువ దర్శకుడిలో ఉన్న కాన్ఫిడెన్స్ టాలీవుడ్‌ని అబ్బురపరుస్తోంది.
By: Tupaki Desk | 5 March 2025 1:22 PM ISTతెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ తీసుకురావడంలో కొందరు దర్శకులు ఆలోచిస్తున్న విధానం హాట్ టాపిక్ గా మారుతుంది . అలా తన టేకింగ్‌తో, కథనంతో అందరినీ షాక్‌కు గురి చేస్తున్న దర్శకుడు శ్రీకాంత్ ఒదెలా. సుకుమార్ రంగస్థలం సినిమాకు సహాయక దర్శకుడిగా పని చేసిన మనోడు గురువు కంటే వైల్డ్ గా దూసుకుపోతున్న విధానం ఆశ్చర్యంగా ఉంది. తొలి సినిమాతోనే బాక్సాఫీస్‌ని దుమ్ములేపి, అటు సినీ వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ నమ్మకం సాధించాడు.
దసరా కంటే ది ప్యారడైజ్ సినిమా అంతకుమించి అనేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క సినిమాతోను యువ దర్శకుడిలో ఉన్న కాన్ఫిడెన్స్ టాలీవుడ్‌ని అబ్బురపరుస్తోంది. ఇక రెండో సినిమా ఫస్ట్ అప్డేట్ తోనే ఇండస్ట్రీలో అలజడి క్రియేట్ చేశాడు. ఒక మాస్ యాక్షన్ సినిమాను ఎలా నడిపించాలో, అందులోని నేటివిటీని ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఎలా చూపించాలో తెలిసిన దర్శకుల జాబితాలోకి రెండో సినిమాతోనే చేరిపోయాడని అనిపిస్తోంది.
సాధారణంగా మాస్ హీరోలను భారీగా ఎలివేట్ చేయడంలో చాలా మంది దర్శకులు రెగ్యులర్ ట్రెండ్ లో వెళ్లిపోతారు. కానీ శ్రీకాంత్ మాత్రం హీరోలను సింపుల్‌గా మాస్ క్యారెక్టర్‌లా చూపించకూడదని, హై వోల్టేజ్ రా యాక్షన్‌తో, ఫుల్ ఇంటెన్సిటీతో, విభిన్నమైన శైలిలో చూపించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ‘దసరా’ లో నల్లని మట్టితో హీరో నానిని ‘ధరణి’ క్యారెక్టర్ లో చూపించిన విధానం ఎంత పవర్ఫుల్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆ మూవీ ఇచ్చిన కిక్‌తో నేడు ది ప్యారడైజ్ ను హై లెవెల్ లో సెట్ చేస్తున్నాడు. ఇక అతని మొదటి గ్లింప్స్ తోనే నేషనల్ వైడ్‌గా హైలైట్ అవుతున్నాడు. కేవలం టీజర్‌కే ఇంత రియాక్షన్ వస్తే, ఫుల్ మూవీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ‘ది ప్యారడైజ్’ టైటిల్‌కి పూర్తి విరుద్ధంగా నాని క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు చూస్తే, అతని కథల ఎంపిక ఎంత విభిన్నంగా ఉంటుందో అర్థమవుతుంది.
టాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలను రూపొందించే దర్శకులే చాలా మంది ఉన్నా, ఓ మాస్ క్యారెక్టర్‌ను రా, ఇంటెన్స్, ఎమోషనల్ అటాచ్‌మెంట్‌తో ప్రజెంట్ చేయగల నైపుణ్యం చాలా తక్కువ మందికి ఉంది. అందులో శ్రీకాంత్ ఒదెలా ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ ఏర్పరచుకున్నాడు. సినిమా రెండో చిత్రం అనిపించకుండా అతని మేకింగ్, విజువల్స్, నేటివిటీ హోల్డింగ్ ఉండటంతో శ్రీకాంత్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.
ఇప్పటికే చిరంజీవి కోసం ఒక మాస్ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన ఈ దర్శకుడు, ఆ సినిమాతో టాలీవుడ్‌లో తన స్థాయిని మరింత పెంచుకునే అవకాశాలున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ డైరెక్టర్లే ఈ తరహా ఇంటెన్సిటీతో మాస్ హీరోలను ప్రెజెంట్ చేయడంలో భయపడతారు. కానీ ఈ కుర్రాడికి మాత్రం అలాంటి బెరుకు లేదు. కథ బలంగా ఉంటే ఎలాంటి హీరో అయినా నమ్మొచ్చని తన టేకింగ్‌తో నిరూపిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే.. తెలుగు ఇండస్ట్రీలో మరో మాస్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ దర్శకుడు అవ్వడానికి శ్రీకాంత్ ఒదెలా సిద్ధమయ్యాడని చెప్పొచ్చు.