శతాధిక చిత్రాల హీరో.. గేమ్ ఛేంజింగ్ విలనీ
కెరీర్ ఆరంభంలో విలన్ గా దడ పుట్టించే పాత్రలో కనిపించాడు.
By: Tupaki Desk | 9 March 2025 9:00 AM ISTశతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. కెరీర్ ఆరంభం విలన్ గా నటించిన శ్రీకాంత్, కాలక్రమంలో కథానాయకుడు అయ్యాడు. ఏకంగా వంద సినిమాల హీరోగా ఓ వెలుగు వెలిగాడు. కానీ కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక సతమతమయ్యాడు. ఇటీవల అతడు నటనకు ఆస్కారం ఉన్న సహాయక పాత్రల్లోను నటిస్తున్నాడు. విలన్ గాను మెప్పించేందుకు తిరిగి పాత రూట్ లోకే వెళ్లాడు. కెరీర్ ఆరంభంలో విలన్ గా దడ పుట్టించే పాత్రలో కనిపించాడు. ఇప్పుడు మళ్లీ అదే పంథాను అనుసరించనున్నాడు.
నందమూరి కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ డ్రామాలో శ్రీకాంత్ విలన్ గా కనిపిస్తారని తెలిసింది. అఖండ తర్వాత మళ్లీ అతడు విలన్ గా నటిస్తున్నాడు. ఇది తన కెరీర్ కి గేమ్ ఛేంజర్ గా మారుతుందని చెబుతున్నారు. ఇందులో విజయశాంతి ఐపీఎస్ అధికారిగా కీలక పాత్ర పోషించారు. గతంలో రాజా చెయ్యి వేస్తే అనే సినిమా తీసిన ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. NKR21 కి టైటిల్ ఫిక్సయిందని తెలిసింది. `అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి` అనే టైటిల్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తల్లీ కొడుకుల సెంటిమెంట్ పై తెరకెక్కుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు టైటిల్ ని ప్రకటించారు. అలాగే కళ్యాణ్ రామ్ - విజయశాంతి సాలిడ్ అవతారాలలో కనిపించే పోస్టర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. మేకర్స్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఇలా ఉంది. ప్రతి స్త్రీ ఒక కొడుకును పెంచుతుంది. వైజయంతి ఐపీఎస్ అర్జున్ అనే సైన్యాన్ని పోషిస్తుంది అని ట్యాగ్ లైన్ ఇచ్చారు.
విజయశాంతి ఇటీవల సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమాలో తన పాత్ర పవర్ ఫుల్ గా ఉండనుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. పృథ్వీరాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రీకరణ పూర్తయిన తర్వాత నిర్మాతలు విడుదల తేదీని ప్రకటిస్తారు.