Begin typing your search above and press return to search.

సర్టిఫికెట్స్ కాల్చేసిన నాని డైరెక్టర్.. రీజన్ తెలిస్తే షాకే!

నేచురల్ స్టార్ నాని దసరా సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా శ్రీకాంత్ ఓదెల అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Aug 2024 5:27 PM GMT
సర్టిఫికెట్స్ కాల్చేసిన నాని డైరెక్టర్.. రీజన్ తెలిస్తే షాకే!
X

'ఉద్యోగం చేయాలనే ఆలోచన అస్సలు రాకుండా ఉండేందుకు కసితో సర్టిఫికెట్లు కాల్చేశా'.. ఈ డైలాగ్ గుర్తుందా? దర్శకుడు వివేక్ ఆత్రేయ తీసిన బ్రోచేవారెవరురా సినిమాలో సత్యదేవ్ చెబుతాడు. అయితే అది రీల్ డైలాగ్ అయినా.. అలాంటి ఘటనే ఓ టాలీవుడ్ డైరెక్టర్ రియల్ లైఫ్ లో జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ప్రస్తుతం ఆ డైరెక్టర్ చెప్పిన మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయనెవరో కాదు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.

నేచురల్ స్టార్ నాని దసరా సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా శ్రీకాంత్ ఓదెల అడుగు పెట్టిన విషయం తెలిసిందే. డెబ్యూ మూవీతో భారీ హిట్ అందుకున్న ఆయన.. నానికి పెద్ద విజయాన్ని అందించారు. ఇప్పుడు మరోసారి నానితో వర్క్ చేయనున్నారు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అయితే నాని సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఆయన.. సినిమాల కోసం తన అకడమిక్ సర్టిఫికెట్లను కాల్చేశానని చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.

సినిమాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే అలా చేశానని తెలిపారు శ్రీకాంత్ ఓదెల. "నేను కావాలనే ఇంటర్ ఫెయిల్ అయ్యాను. ఒకవేళ నేను పాస్ అయితే మా నాన్న నన్ను బీటెక్ చదివిద్దామనుకున్నారు. అందుకనే ముందే ఫిక్స్ అయ్యి ఒక స‌బ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాను. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అవ్వాలంటే ఇంటర్ పాస్ అవ్వాలట. అందుకే ఇంటర్ పాస్ అయ్యాకే వెళ్లి స్కూల్ లో చేరాను. కానీ అక్కడ కూడా ఫెయిల్ అయిపోయా" అని తెలిపారు.

"దీంతో బీటెక్ చేయమని మ‌ళ్లీ మా నాన్న, బాబాయి గట్టిగా ప‌ట్టుబట్టారు. బీటెక్ కాకపోయినా డిగ్రీ అయినా చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఓపెన్ డిగ్రీ చేయొచ్చుగా అన్నారు. అప్పుడు నా ద‌గ్గ‌ర ఇంట‌ర్ సర్టిఫికెట్ ఉందిగా. అందుకే బీటెక్, డిగ్రీ చేయమని అడుగుతున్నారని ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆ తర్వాత ఓ రోజు నా ఇంట‌ర్, టెన్త్, 7వ త‌ర‌గ‌తి సర్టిఫికెట్లను త‌గ‌ల‌బెట్టేశాను" అని శ్రీకాంత్ తెలిపారు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకుని సినీ ప్రియులు షాక్ అయిపోతున్నారు.

అయితే బ్రోచేవారెవరురా మూవీలో సర్టిఫికెట్లు కాల్చేసినట్లు చెప్పిన డైలాగ్ విని.. వీడేవాడురా బాబు సేమ్ నా సీనే రాశారని అనుకున్నట్లు తెలిపారు శ్రీకాంత్. సినిమాలోని ఆ సీన్ తనకు బాగా కనెక్ట్ అయినట్లు చెప్పారు. చెప్పాలంటే.. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది డైరెక్టర్లు సినిమాల ద్వారా ప్రేక్షకులతో మాట్లాడుతుంటారని.. అలా వివేక్ తనకు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పారు. మరి సర్టిఫికెట్లు కాల్చి మరీ సినిమాల్లోకి వచ్చిన శ్రీకాంత్.. ఫ్యూచర్ లో ఎలాంటి హిట్స్ కొడతారో చూడాలి.