టాలీవుడ్ లో శ్రీరాముడి మార్క్ ఇలా!
1963 లో స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన `లవకుశ` రిలీజ్ అయింది. ఈ సినిమా అప్పట్లోనే సంచలన విజయాన్ని నమోదుచేసింది.
By: Tupaki Desk | 22 Jan 2024 6:32 AM GMTఅయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున సినీ నటులు..దర్శకులు..నిర్మాతలు అన్ని పరిశ్రమల నుంచి హాజరవుతోన్న సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ నుంచి చిరంజీవి.. పవన్ కళ్యాణ్...రామ్ చరణ్.. సురేఖ తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. మరికొంత మందికి ఆహ్వానాలు అందిన వ్యక్తిగత కారణాలతో వెళ్లలేకపోతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ లో శ్రీరాముడు కథని ఆధారంగా ఇప్పటివరకూ తెరకెక్కించిన చిత్రాల గురించి చూస్తే..చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే ఉన్నాయని తెలుస్తోంది.
1963 లో స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన `లవకుశ` రిలీజ్ అయింది. ఈ సినిమా అప్పట్లోనే సంచలన విజయాన్ని నమోదుచేసింది. అప్పట్లోనే కోటి రూపాయలకు పైగా వసూళ్లని సాధించింది. సి.పుల్లయ్య.. ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకులుగా తెరకెక్కించిన చిత్రమిది. లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకరరెడ్డి నిర్మించారు. ఎన్.టి.రామారావు.. అంజలీదేవి.. మాస్టర్ నాగరాజు..మాస్టర్ సుబ్రహ్మణ్యం ..కాంతారావు.. చిత్తూరు నాగయ్య లాంటి లెజెండ్స్ నటించిన చిత్రమిది.
1963లో విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రమిది. `లవకుశ` ని ఉత్తర రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. సీతారాములు పట్టాభిషిక్తులు అయ్యాకా చాకలి తిప్పడు నిందవేశాడని రాజారాముడు గర్భవతియైన సీతాదేవిని అడవుల్లో వదలివేయడంతో ప్రారంభయ్యే ఈ కథలో లవకుశుల జననం.. వారు రామాయణ గానం చేయడం.. రామ అశ్వమేథయాగం.. అశ్వాన్ని లవకుశులు బంధించి ఏకంగా రామునితోనే యుద్ధం చేయడం వంటి సన్నివేశాలు ఉంటాయి.
ఆ తర్వాత 1972 లో రఘురాముడిగా శోభన్ నటించిన `సంపూర్ణ రామాయణం `మరో సంచలనం సృష్టించిన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. బాపు కమనీయ దృశ్య కావ్యాల్లో ఇదొకటి. ఇక 2011 లో నటసింహ బాలకృష్ణ `శ్రీరామరాజ్యం` కొత్త తరానికి రామాయణం గొప్పతనం వివరించే ప్రయత్నం చేసారు. బాపు-రమణల నుంచి రిలీజ్ అయిన మరో గొప్ప చిత్రమిది. అలాగే 1996 లో `బాల రామాయణం` రిలీజ్ అయింది.
బాలలతో గుణేశేఖర్ చేసిన గొప్ప సాహసమిది. ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్ర పోషించి తాతకు తగ్గ మనవడు అనిపించాడు. ఈ సినిమా అప్పట్లో ఎన్నో అవార్డులు..రివార్డులు సొంతం చేసు కుంది. ఇక 2006 లో నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రిలీజ్ అయిన `శ్రీరామదాసు` ఎంత గొప్ప విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. రామభక్తి నేపథ్యంలో తెరకెక్కిన సినిమా గొప్ప కళాఖండంగా నిలిచింది. ఇక గతేడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ `ఆదిపురుష్` తో రాముడిగా మెప్పించే ప్రయత్నం తెలిసిందే.