Begin typing your search above and press return to search.

మ‌తాంత‌ర వివాహం కోసం పేరు మార్చుకున్న స్టార్

గౌరీతో ఆర్యసమాజ్ వివాహం చేసుకోవడానికి SRK తన పేరును మార్చుకున్నాడనేది కొంద‌రికే తెలిసిన నిజం.

By:  Tupaki Desk   |   28 July 2023 3:03 PM GMT
మ‌తాంత‌ర వివాహం కోసం పేరు మార్చుకున్న స్టార్
X

షారూఖ్ ఖాన్ - గౌరీ జంట రియ‌ల్ ల‌వ్‌స్టోరి ఎంతో స్ఫూర్తిదాయ‌క‌మైన‌ది. ఈ జంట‌ ప్రేమ కథలో ఊహించ‌ని ఎన్నో సినిమాటిక్ మ‌లుపులు ట్విస్టులు ఉన్నాయి. అత్యంత శృంగారభరితమైన ప్రేమక‌థ వీరిది. SRK మొదటి క్రష్ గౌరీ. ఈ జోడీ 1991లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి అన్యోన్య దాంప‌త్యానికి మారుపేరు గా నిలిచారు. త‌మ అభిమానుల‌కు ఈ జంట నిజ‌మైన‌ ప్రేరణ.

వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా తన భార్య పై ప్రశంసల వర్షం కురిపించడం లో షారూఖ్‌ ఎప్పుడూ విఫలం కాడు. అతను సాధించిన ఘనత ను భార్య గౌరీ తో షేర్ చేసుకుంటాడు. అత‌డి విజ‌యం వెన‌క ఆమె ఉంది. ఇరువురు ఒక‌రికోసం ఒక‌రుగా క‌లిసి దాంప‌త్య జీవ‌నం సాగిస్తూ ఆద‌ర్శంగా నిలిచారు. నిజానికి SRK గౌరీ మతాంతర వివాహం లో బోలెడ‌న్ని ట్విస్టులు ఉన్నాయన్న‌ది అంద‌రికీ తెలియ‌దు. త‌న ప్రేయ‌సి గౌరీ ని పెళ్లి చేసుకునేందుకు షారూఖ్ తన పేరునే మార్చుకున్నాడనేది ఎంద‌రికి తెలుసు? గౌరీతో ఆర్యసమాజ్ వివాహం చేసుకోవడానికి SRK తన పేరును మార్చుకున్నాడనేది కొంద‌రికే తెలిసిన నిజం. అంతేకాదు షారూఖ్ కోసం గౌరీ కూడా తన పేరును మార్చుకున్నారు.

ముస్తాక్ షేక్ అనే ర‌చ‌యిత‌ తన 'షారూఖ్ కెన్' అనే పుస్తకం లో ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆ పుస్తకం లో పేర్కొన్నట్లుగా షారుఖ్ తన పేరును జీతేందర్ కుమార్ తుల్లిగా మార్చుకున్నాడు. అంతేకాదు.. ఇది పెళ్లి కోసం SRK ఎంచుకున్న యాధృచ్ఛిక పేరు మాత్రమే కాదు. ఇద్దరు వెట‌ర‌న్ నటుల కు నివాళిగా ఆయన ఈ పేరును ఎంపిక చేసుకున్నారు. ఒక క‌థ‌నం ప్రకారం.. SRK అమ్మమ్మ అతడు బాలీవుడ్ స్టార్ జీతేంద్రను పోలి ఉన్నాడని భావించారు.

అందుకే ఖాన్ జీతేంద్ర‌ను తన మొదటి పేరుగా ఎంచుకున్నాడు. నటుడు రాజేంద్ర కుమార్ ఇంటిపేరు తుల్లిని త‌న ఇంటి పేరుగా మార్చుకున్నాడు. రాజేంద్ర‌కుమార్ ధూల్ కా ఫూల్ నటుడిగా సుప‌రిచితం. ఆయ‌న‌ పూర్తి పేరు రాజేంద్ర కుమార్ తుల్లి. ఇద్దరు దిగ్గజ నటుల పేర్ల‌ను కలిపి ఆర్య సమాజ్ సంప్రదాయాల ప్రకారం.. SRK తన వివాహానికి జీతేంద్ర కుమార్ తుల్లి అనే కొత్త పేరును పొందారు. కేవలం SRK మాత్ర‌మే పెళ్లి కోసం తన పేరు ను మార్చుకోలేదు. షారుఖ్‌తో 'నికాహ్' కోసం గౌరీ తన పేరును అయేషాగా మార్చుకుంది.