ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్.. ట్రిపుల్ ధమాకా
టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించడంలో పేరు పొందిన ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: Tupaki Desk | 2 Nov 2024 9:59 AM GMTటాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించడంలో పేరు పొందిన ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈమధ్య ఈ సంస్థ స్పీడ్ పెంచింది. ఈ నవంబరులో మూడు చిత్రాలు విడుదల చేయడానికి సిద్దమైంది. భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ స్థాయిలో సినిమాలు నిర్మిస్తూ, బలమైన కంటెంట్ కలిగిన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రత్యేకతను చాటుకుంటోంది.
రామ్ తల్లూరి, రాజని తల్లూరి ఈ చిత్రాల నిర్మాతలు. ఈ నెలలో ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వరుణ్ తేజ్ నటించిన ‘మట్కా,’ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ‘మెకానిక్ రాకీ,’ నరేశ్ అగస్త్య నటించిన ‘విక్కటకవి’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు వేర్వేరు జానర్లలో ఉండడం విశేషం. ఈ ఏడాదికి ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూడు చిత్రాల విడుదల ద్వారా బాక్సాఫీస్ వద్ద బలమైన పునాది వేయబోతోంది.
కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మట్కా’ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రంలో 1970ల కాలం నేపథ్యంలో కథను నిర్మించారు. ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్ కూడా విడుదలైంది.
ఇక మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ‘మెకానిక్ రాకీ’ నవంబర్ 22న విడుదల కానుంది. సక్సెస్ ఫుల్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రవితేజ ముల్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఆయనకు తొలి డైరెక్షన్ కావడం విశేషం. కథలో యాక్షన్, కామెడీ అంశాలను మిళితం చేసి రూపొందిన ఈ చిత్రం వినోదాత్మకంగా సాగుతుందని టీజర్ ద్వారా అర్థమవుతోంది.
‘విక్కటకవి’ చిత్రం మాత్రం మిస్టరీ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. ప్రదీప్ మద్దాళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 28న జీ5లో ప్రీమియర్ కానుంది. కథలో రహస్యాలను మలుపులు తిప్పుతూ నరేశ్ అగస్త్య నటనతో ఆకట్టుకుంటారని చిత్ర బృందం చెబుతోంది. ఈ మూడు చిత్రాలకు సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే విడుదల అవుతూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ప్రతి సినిమాను కంటెంట్ కు తగ్గట్టుగా అధిక బడ్జెట్‌తో నిర్మించడం ద్వారా ప్రొడక్షన్ హౌస్ ఉత్పత్తి ప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో అర్ధమవుతుంది. ఈ మూడు చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకుని, ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థను మరింత పైస్థాయికి తీసుకెళుతాయని భావిస్తున్నారు. తదుపరి ప్రాజెక్టులపై కూడా త్వరలోనే ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారిక ప్రకటన చేయనుంది.