సెట్లో రాజమౌళి కొత్త రూల్‌కి మైండ్ బ్లాక్
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి భారీ పాన్ ఇండియన్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 19 March 2025 8:32 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి భారీ పాన్ ఇండియన్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా( SSMB29) సెట్స్ నుంచి లీకులు కలవరపెడుతున్నాయి. వాటిని ఆపేందుకు జక్కన్న చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఏదో ఒక మూల నుంచి లీకుల బెడద తప్పడం లేదు. ఇటీవల ఒరిస్సా కోరాపూట్ లో షూట్ లొకేషన్ నుంచి కొన్ని లీక్డ్ ఫోటోలు, వీడియో రిలీజవ్వడం కలవరపాటుకు గురి చేసింది. మహేష్ లుక్ ఎలా ఉందో లీకవ్వడంతో ఈ ఘటనపై రాజమౌళి టీమ్ ఆందోళన చెందింది.
ఇలాంటి కనికరం లేని లీకుల తర్వాత సెట్స్ లో సిబ్బందిపై జక్కన్న ఆంక్షలు మరింత తీవ్రతరమయ్యాయి. సహజంగానే కఠినంగా ఉండే రాజమౌళి ఇప్పుడు మరింత సీరియస్ గా మారారట. సెట్ నుంచి ఎలాంటి లీకులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నటీనటులు, సిబ్బంది నుంచి సెల్ ఫోన్లు లాక్కున్న తర్వాతే వారిని సెట్లోకి పంపుతున్నారు. అంతేకాదు ఇప్పుడు జక్కన్న మరో కొత్త రూల్ ని పాస్ చేసాడు. దాని ప్రకారం నటీనటుల వ్యక్తిగత స్టాఫ్ ఒకరిద్దరికి మించి సెట్లోకి ప్రవేశం లేదు.
నిజానికి మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్లకు ఒక్కొక్కరికి 8-10 మంది స్టాఫ్ నిరంతరం అందుబాటులో ఉండి పని చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తిగత సిబ్బందికి మాత్రమే అనుమతి లభిస్తోందట. వందశాతం కంఫర్ట్ కోసం లక్షల్లో జీతాలిచ్చి సిబ్బందిని నియమించుకునే ఇలాంటి పెద్ద స్టార్లకు నిజంగా జక్కన్న కొత్త రూల్ చాలా ఇబ్బందికరంగా మారిందని గుసగుస వినిపిస్తోంది. కానీ ఈసారికి తప్పదు. అలాగే సెట్స్ లో ప్లాస్టిక్ ని నిషేధించి పర్యావరణ సహితంగా షూటింగులు పూర్తి చేయాలనే ఆదర్శవంతమైన ఆలోచనతోను జక్కన్న అందరి మెప్పును పొందుతున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలోని ఈ భారీ చిత్రాన్ని ఇండియానా జోన్స్ లైన్ లో రూపొందిస్తున్నట్టు రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దట్టమైన అడవుల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.