SSMB29 లీకులు.. రాజమౌళి అంత జాగ్రత్తగా ఉండి ఏం లాభం..?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, మాస్టర్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29 సినిమాపై రోజుకో అప్డేట్ బయటికి వస్తూనే ఉంది.
By: Tupaki Desk | 6 March 2025 3:27 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, మాస్టర్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29 సినిమాపై రోజుకో అప్డేట్ బయటికి వస్తూనే ఉంది. కానీ ఇవన్నీ మేకర్స్ రిలీజ్ చేసినవి కాదు.. ఏదో విధంగా లీకైన వార్తలే. ఈ ప్రాజెక్ట్‌ను రాజమౌళి అత్యంత రహస్యంగా ప్లాన్ చేస్తున్నా, షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి వరుసగా అన్ఆఫీషియల్ అప్డేట్లు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా, చిత్రంలోని విలన్ రోల్ గురించి మరోసారి ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటి వరకు ఈ సినిమా హీరోయిన్ గురించి అఫీషియల్ గా స్పష్టత రాలేదు. కానీ ప్రియాంక చోప్రా రాజమౌళి మహేష్ ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పుడు కామెంట్ చేయడం, ఆమె తల్లి కూడా ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇవ్వడంతో క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు, కేరళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆయన కూడా కాస్త ఇన్ డైరెక్ట్ గా స్పందిస్తూ, ఇంకా ఫైనల్ కాలేదని చెప్పడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
అయితే లేటెస్ట్ లీకైన ఫోటోల ద్వారా నిజంగా ఆయన ఇందులో ఉన్నట్లు కన్ఫర్మ్ అయిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల జరిగిన ఓ షెడ్యూల్ కోసం మహేష్ బాబు, రాజమౌళి, పృథ్వీరాజ్ సుకుమారన్ ఎయిర్‌పోర్టులో కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. మహేష్ లుక్ కూడా కాస్త లీక్ అయిపోయింది. గత కొన్ని రోజులుగా రాజమౌళి తన బృందంతో కలిసి హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పని చేస్తూ, షూటింగ్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నాడు.
అక్కడ భద్రంగా ఉన్న టీం ఇప్పుడు ఒడిశాలో షూటింగ్ జరుపుతుండటంతో మరిన్ని అన్ఆఫీషియల్ అప్డేట్లు బయటకు రావడం కష్టమే అనుకున్నా, ఎయిర్‌పోర్ట్‌లో తారలు కెమెరాల్లో పడిపోవడంతో అసలు విషయాలు లీక్ అయ్యాయి. రాజమౌళి మిగతా సినిమాలను పోల్చుకుంటే ఈసారి మరింత గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికీ ప్రాజెక్ట్ గురించి అధికారిక సమాచారం తక్కువే.
టాలీవుడ్‌లో రాజమౌళి సినిమాలకు క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే చిన్న అప్డేట్ అయినా వైరల్ అవుతుంది. కానీ ఈ రేంజ్ లీకులు రావడం అనేది మరింత ఆసక్తిని పెంచుతోంది. కాస్తంత ఓపిక పట్టి సరైన సమయానికి ఆఫీషియల్‌గా విడుదల చేస్తే బాగుండేదని కొందరు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక మహేష్ బాబు SSMB29 కోసం ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతలా స్ట్రాంగ్ గా రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో పాటు ఫైట్ స్టంట్స్‌కు కూడా ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నారట. ఇదంతా చూస్తుంటే, ఈ సినిమా మరో బాహుబలి, RRR లాంటి విజువల్ వండర్‌గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికి షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇంతగా లీకులు బయటకు రావడం నిజంగా ప్రొడక్షన్ టీమ్‌కు తలనొప్పిగా మారింది. ఈ లీకుల కారణంగా రాజమౌళి ఇప్పుడు మరింత జాగ్రత్తగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. సినిమా గురించి సరైన సమయంలో అప్‌డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రాజమౌళి, మహేష్ బాబు టీం నుంచి ఈ విషయంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.