#SSMB29 కోసమే కుస్తీలు.. డేట్ ఫిక్సయిందిగా..
సూపర్ స్టార్ మహేష్ బాబు- ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీకి ముహూర్తం పెట్టేదెప్పుడు? అంటూ అభిమానులు చాలా ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు.
By: Tupaki Desk | 16 Dec 2024 9:10 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు- ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీకి ముహూర్తం పెట్టేదెప్పుడు? అంటూ అభిమానులు చాలా ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఇటీవలి సమాచారం మేరకు ఈ సినిమాని జనవరి 2025లో లాంఛనంగా ప్రారంభించి, ఏప్రిల్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళతారని తెలుస్తోంది. ఎస్.ఎస్.ఎం.బి 29 ని రెండు భాగాలుగా రాజమౌళి తెరకెక్కించనున్నారు. దీనికోసం ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ ని వెచ్చిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతకుముందే కాస్టింగ్ గురించి చర్చ సాగింది. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఇండోనేషియాకు చెందిన నటి చెల్సియా నటిస్తారని మీడియాలో కథనాలొచ్చాయి. థోర్ నటుడు క్రిస్ హేమ్స్ వర్త్ తో పాటు పలువురు హాలీవుడ్ నటీనటులను రాజమౌళి ఎంపిక చేస్తున్నారని కూడా గుసగుస వినిపించింది. అయితే వీటన్నిటి గురించి రాజమౌళి స్వయంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి, వివరాల్ని అందిస్తారని అంతా భావిస్తున్నారు. ఇప్పటివరకూ మహేష్ మినహా ఇతరుల ఎంపిక గురించి చిత్రబృందం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో జక్కన్న మీడియాతో లాంచింగ్ సమయంలో సమావేశమవుతారని కూడా భావిస్తున్నారు.
మరోవైపు ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారులో అలాగే రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్స్ వేసారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ ని ఈ సెట్స్ లోనే జక్కన్న తెరకెక్కిస్తారు. వీటిలో ఇంట్రో సీన్స్ తెరకెక్కిస్తారని సమాచారం. అలాగే ప్రపంచదేశాల్లో దట్టమైన అడవులను జల్లెడ పట్టారు. దక్షిణాఫ్రికా , అమెజాన్, బ్యాంకాక్, థాయ్ లాండ్ అడవుల్లోను ఈ సినిమాని తెరకెక్కిస్తారని గతంలో ప్రచారమైంది. కొత్త వాతావరణం అలవాటు పడేందుకు మహేష్ కొన్నాళ్ల పాటు అడవులు, కొండల్లో స్పెండ్ చేయగా, ఆయనతో పాటు ఫిట్ నెస్ కోచ్ జాన్ సెనా కూడా విజిట్ చేసిన ఫోటోలు వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి.
దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ రచనల ఆధారంగా ఈ సినిమాకి స్క్రిప్టును రచించామని విజయేంద్ర ప్రసాద్ గతంలో వెల్లడించారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ కం థ్రిల్లర్ కోసం మహేష్ ఇప్పటికే రూపురేఖలను మార్చుకున్నారు. పొడవాటి హెయిర్ స్టైల్, గడ్డంతో ఫిట్ బాడీతో స్టైలిష్ గా కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన గాసిప్స్ నిజ నిర్ధారణ లేకుండా వైరల్ గా మారుతున్న క్రమంలో చిత్రబృందం వివరాల్ని అధికారికంగా వెల్లడిస్తే బావుంటుందని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.