Begin typing your search above and press return to search.

పబ్లిసిటీకి దూరంగా స్టార్ కమెడియన్.. రీజన్ అదేనా?

అయితే ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   24 Dec 2024 10:40 AM GMT
పబ్లిసిటీకి దూరంగా స్టార్ కమెడియన్.. రీజన్ అదేనా?
X

2024 ఏడాది చివరి వారాంతంలో ప్రేక్షకులకు వినోదాల విందును అందించడానికి పలు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. క్రిస్మస్ హాలిడేస్ ని క్యాష్ చేసుకోవాలని బాక్సాఫీస్ బరిలో దిగుతున్న చిత్రాలలో ''శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'' కూడా ఒకటి. డిసెంబర్ 25వ విడుదల కాబోతోంది. అంతకంటే ముందుగా మంగళవారం సాయంత్రమే కొన్ని ఏరియాలలో ఎర్లీ బర్డ్స్ షోస్ పేరుతో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. అయితే ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

''శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'' సినిమా ప్రమోషనల్ కంటెంట్ లో వెన్నెల కిషోర్ ను హైలైట్ చేస్తూ వచ్చారు మేకర్స్. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, ఇతర పోస్టర్స్.. ఇలా అన్నిట్లో అతన్నే ప్రధానంగా చూపించారు. దీంతో ఈ సినిమాలో హీరో కిషోర్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ప్రచార కార్యక్రమాల్లో మాత్రం వెన్నెల కిశోర్ ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలో సినిమా ప్రచారానికి సహకరించడం లేదంటూ పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కిషోర్.. ఇప్పటికే దీనిపై వివరణ ఇచ్చారు. తాను సినిమాలో హీరో కాదని స్పష్టం చేసారు. అయితే హీరో పాత్ర అయినా కాకపోయినా మూవీ ప్రమోషన్స్ కు సహకరించాలి కదా అనే వాదన వినిపిస్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హాస్యనటులలో వెన్నెల కిషోర్ ఒకరు. తన మార్క్ కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించే కిషోర్.. చేతినిండా సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా ఉండే క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. వర్క్ విషయంలో చాలా ప్రొఫెషనల్ గా ఉంటాడు. వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతాడు. తన పనేదే తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. ప్రమోషన్స్, ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో చాలా అరుదుగా కనిపిస్తాడు కిషోర్. సహజంగానే ఇంట్రావర్ట్ కావడంతో ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. అప్పుడప్పుడు ఆయన ప్రధాన పాత్ర పోషించిన కొన్ని సినిమాలకు మాత్రం రికార్డెడ్ ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రెస్ మీట్ లను అవైడ్ చేస్తారనే టాక్ ఉంది.

ఈ ఏడాది ప్రారంభంలో వెన్నెల కిషోర్ హీరోగా నటించిన 'చారి 111' అనే సినిమా వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్ లోనూ అతను ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ప్రచారానికి కూడా రాలేదు. అయితే ప్రమోషన్స్ కు రమ్మని వెన్నెల కిషోర్ ను ఒకటీ రెండు సార్లు రిక్వెస్ట్ చేసినా, సాధ్యపడలేదని నిర్మాత వంశీ నందిపాటి తెలిపారు. ఇంటర్వూలకి, ఈవెంట్స్ కి తనని దూరంగా ఉంచమని ముందుగానే చాలా జెంటిల్ గా సాఫ్ట్ గా చెబుతాడని అన్నారు. ఒక కామన్ ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చాడని చెప్పారు. సినిమాలో హీరో వెన్నెల కిషోర్ కాదని, ఒక ప్రధాన పాత్ర పోషించాడని, ఈ సినిమాకి కథే హీరో అని తెలిపారు.

అయితే వెన్నెల కిషోర్ మూవీ ప్రమోషన్లకు దూరంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. రెమ్యూనరేషన్ తీసుకున్నప్పుడు, అవసరమైనప్పుడు సినిమాను ప్రమోట్ చేయడం నటీనటుల బాధ్యత అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' సినిమా హిట్ అయితే ముందుగా పేరొచ్చేది.. మరికొన్ని ప్రాజెక్ట్స్ చేతికి వచ్చేది వెన్నెల కిషోర్ కే. కాబట్టి ఆయన కూడా ప్రచారంలో పాల్గొంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం ఏడు రోజుల కాల్షీట్స్ చాలని చెప్పి, 10 రోజులు తీసుకున్నారని వెన్నెల కిషోర్ చెబుతున్నారు. స్క్రీన్ ప్లే మార్పించి మళ్లీ కొత్తగా డబ్బింగ్ చెప్పించారని తెలిపారు. పబ్లిసిటీకి రావడం లేదని అంటున్నారు కానీ, తాను యుఎస్ కు వెళ్తున్నాని ముందే యూనిట్ కు తెలుసని చెప్పారు. 'సారంగపాణి జాతకం' సినిమా ప్రమోషన్స్ కి నాలుగు రోజులు ఇస్తానని చెప్పానని, చెప్పినట్లే పబ్లిసిటీ చేసానని తెలిపారు.