స్టార్ డైరెక్టర్ నోరు అదుపు తప్పుతోందా?
రంగుల ప్రపంచంలో నోరు ఎంతగా అదుపులో ఉంటే అంతా మంచిది! అని అనుభవజ్ఞులు చెబుతుంటారు
By: Tupaki Desk | 7 Feb 2024 2:59 AM GMTరంగుల ప్రపంచంలో నోరు ఎంతగా అదుపులో ఉంటే అంతా మంచిది! అని అనుభవజ్ఞులు చెబుతుంటారు. మాట జారితే ఇక్కడ పరిణామాలు వేరుగా ఉంటాయి. సక్సెస్ లో ఉన్నంత వరకూ ఓకే కానీ ఎక్కడ ఫ్లాపులతో సన్నివేశం బెడిసికొట్టినా ఆ తర్వాత ఇండస్ట్రీ ఆడేసుకుంటుంది. అలాంటి సంపులో పడి తిరిగి లేవలేకపోయిన ఎందరినో చూస్తున్నాం. మెగాస్టార్ తో సమానంగా తెలుగు చిత్రసీమను ఏలిన ఒకరిద్దరు మేటి అగ్ర హీరోల కెరీర్ వివాదాలతో బ్యాక్ బెంచీకి పరిమితమైంది. చివరికి అవకాశాల్లేని స్థితికి దిగజారారు. పలు వివాదాల్లో వారి పేర్లు ప్రముఖంగా హైలైట్ అవ్వడమే దీనికి కారణం.
నిజానికి వివాదాలు కొరివి లాంటివి. అందుకే చాలా మంది తెలిసీ కొరివితో తల గోక్కోరు. ఇక్కడ గుంబనగా ఉండడం, తెలివిగా నటించడం తెలిసి ఉండాలి. అవకాశం ఇప్పుడు చేతిలో ఉంది కదా అని నోరు జారితే లేదా తొందర పడితే దాని పర్యవసానం ఘోరంగా ఉంటుంది. పెద్దలు ఒకరిని టార్గెట్ చేయడం మొదలు పెడితే ఎంత ధైన్యంగా ఉంటుందో కూడా చాలా మందికి ఈ రంగంలో అనుభవం.
అందుకే వరుస విజయాలతో దూకుడు మీదున్న ప్రముఖ తెలుగు దర్శకుడు ఇలాంటి సన్నివేశానికి దూరంగా ఉండాలని అభిమానులు సలహాలు సూచనలు ఇస్తున్నారు. తనని విమర్శించిన వారందరినీ తిరిగి ఎటాక్ చేయాలనే నైజం అంత మంచిది కాదని సూచిస్తున్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ భార్య తన సినిమా గురించి చేసిన కామెంట్ కి ప్రతిస్పందిస్తూ వెంటనే కౌంటర్ వేసారు సదరు దర్శకుడు. అమీర్ పాత సినిమా గురించి ఉదహరిస్తూ సదరు తెలుగు దర్శకుడు ఘాటైన కామెంట్ చేసారు. దీనికి ఆమె మనసు నొచ్చుకుంది. దీంతో సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చారు.
అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరికి ఉండదు. దానిని కాపాడుకుంటూనే వివాదాల జోలికి వెళ్లకుండా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలనేది కొందరి సూచన. ఇప్పటికి ఇది అయిపోయింది. కానీ మునుముందు పరిశ్రమ పెద్దలు, దిగ్గజాలతో అనవసర లొల్లి పెట్టుకోకపోతేనే మంచిదని కూడా కొందరు సెలవిస్తున్నారు. అతడికి తెలుగు సినీరంగంతో పాటు హిందీ చలనచిత్ర రంగంలోను ధేధీప్యమానమైన కెరీర్ ఉంది. వివాదాలతో పలుచన కాకుండా అతడు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని తెలుగు సినీ క్రిటిక్స్ ఆశిస్తున్నారు. మాటకు మాట సమాధానం కష్టమైనది కాదు.. కానీ దాని పర్యవసానాలు ఆలోచించాలి. ఇది కేవలం అభిమానంతో సూచన మాత్రమే.