Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్టర్స్.. స్పీడ్ పెంచాల్సిన టైమొచ్చిందా?

ఇప్పుడు రెండు మూడేళ్లు ఒకే ప్రాజెక్ట్ మీద ఉంటున్నారు. అయితే దీనికి మెయిన్ రీజన్ దర్శకులే అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   17 July 2024 11:30 PM GMT
స్టార్ డైరెక్టర్స్.. స్పీడ్ పెంచాల్సిన టైమొచ్చిందా?
X

పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత ఫిలిం మేకర్స్ అందరూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని భాషలను దృష్టిలో పెట్టుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీని కారణంగా స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఒక్క ప్రభాస్ మినహా ఏ హీరో కూడా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేయడం లేదు. ఒకప్పుడు ఏడాదికో మూవీ చేసే హీరోలు.. ఇప్పుడు రెండు మూడేళ్లు ఒకే ప్రాజెక్ట్ మీద ఉంటున్నారు. అయితే దీనికి మెయిన్ రీజన్ దర్శకులే అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

గత రెండు రోజులుగా డైరెక్టర్ సుకుమార్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. 'పుష్ప 2' లేట్ అవడానికి ఆయనే ప్రధాన కారణమని, దర్శకుడి తీరుతో హీరో అల్లు అర్జున్‌ విసిగిపోయారని టాక్ నడుస్తోంది. బన్నీ షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చి విదేశాలకు వెళ్లిపోయారని, ఇన్నాళ్లు పెంచిన గడ్డాన్ని కూడా తీసేసారని ప్రచారం సాగుతోంది. మరోవైపు సుక్కు సైతం హాలిడేకి వెళ్తున్నారని, దర్శక హీరోల మధ్య నెలకొన్న అసంతృప్తి పరిస్థితి కారణంగా సినిమా షూటింగ్ మరింత ఆలస్యం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నిజానికి సుకుమార్ మాత్రమే కాదు, టాలీవుడ్ లో మిగతా అగ్ర దర్శకులందరూ స్పీడ్ పెంచాల్సిన అవసరముంది. 'పుష్ప 2' సినిమా చేయడానికి సుక్కు దాదాపు మూడేళ్ళ సమయం తీసుకుంటే.. మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ 'దేవర' పార్ట్-1 కోసం రెండు సంవత్సరాల కంటే ఎక్కువ టైం తీసుకుంటున్నారు. 2022 ఏప్రిల్ లో 'ఆచార్య' చిత్రం విడుదలైతే, ఇంత వరకూ షూటింగ్ పూర్తి చేయలేకపోయారు. దీంతో ముందుగా అనుకున్న తేదీ నుంచి 2024 సెప్టెంబర్ 27కి వాయిదా వేశారు.

'దేవర' ప్రచారం కూడా పెద్దగా జరగడం లేదు. ఇప్పటి వరకూ ఒక గ్లింప్స్, ఒక సాంగ్ మాత్రమే బయటకి వదిలారు. సినిమా విడుదలకు సరిగ్గా 70 రోజులు మాత్రమే ఉన్నా.. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై ఎటువంటి అప్‌డేట్ లేదు. మిగతా ప్రమోషనల్ కంటెంట్ ఎప్పుడు వస్తుందనే విషయంలో క్లారిటీ లేదు. RRR తో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇది. జనాల్లో ఆసక్తి తగ్గకుండా హైప్ క్రియేట్ అయ్యేలా చెయ్యాలంటే.. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి, ప్రమోషన్స్ స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది.

తారక్ ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. కానీ కొరటాల శివ 'దేవర' సినిమా పూర్తి చేసే వరకూ ఇంకో చిత్రాన్ని సెట్స్ మీదకు మీదకు తీసుకెళ్లే అవకాశం లేదు. మరో ట్రిపుల్ ఆర్ హీరో రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. శంకర్ దర్శకత్వంలో 2021 ఫిబ్రవరిలో అనౌన్స్ చేయబడిన 'గేమ్ ఛేంజర్' సినిమా ఇంకా సెట్స్ మీదనే వుంది. అంటే మూడేళ్ళకు పైగానే మెగా హీరో ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు.

ఇప్పటికైతే చరణ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశారు కానీ, మిగతా పెండింగ్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో, పోస్ట్ ప్రొడక్షన్ సంగతేంటో తెలియదు. ఇక 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్ సంగతి సరే సరి. ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ మాత్రమే రిలీజ్ చేశారు. తర్వాతి అప్డేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సినిమా విడుదల తేదీపై స్పష్టత రావడం లేదు. 'ఇండియన్ 2' డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న తర్వాత శంకర్ ప్లానింగ్స్ ఎలా ఉంటాయో తెలియడం లేదు.

అలా అగ్ర దర్శకులందరూ ఒక్కో సినిమాని నెమ్మదిగా చెక్కుకుంటూ పోవడం వల్ల స్టార్ హీరోల విలువైన సమయం వృధా అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు దీని కారణంగా సినిమా బడ్జెట్ పెరిగి, నిర్మాతల మీద అధిక భారం పడే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచైనా మన డైరెక్టర్స్ వర్క్ విషయంలో స్పీడ్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.