గ్రేట్ వారియర్: 10,000 ఫ్యాన్ గ్రూపులతో స్టార్ హీరో ప్రజల్లోకి
టాలీవుడ్ పవర్ స్టార్ లా అతడు కోలీవుడ్ పవర్‌స్టార్ గా గొప్ప పాపులారిటీని అందుకున్నారు. ఇంతకీ ఎవరా హీరో...?
By: Tupaki Desk | 1 Sep 2023 11:30 PM GMTటాలీవుడ్‌లో స్టార్ హీరోలకు సోషల్ మీడియా గ్రూప్‌లు, వాట్సాప్ గ్రూప్ లు విస్త్రత స్తాయిలో మనుగడలో ఉన్నాయి. తెలుగు చిత్రసీమకు నాలుగు మూల స్థంబాలు అయిన మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలకు ప్రత్యేకించి ఫ్యాన్ గ్రూపులు ఉన్నాయి. తమ ఫేవరెట్ హీరో సినిమాలను, ఇతర కార్యకలాపాలను విస్త్రతంగా ప్రచారం చేసేందుకు ఈ గ్రూపులు ఇతోధికంగా కృషి చేస్తున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాలు సహా దేశ విదేశాల్లో హీరోల ఫ్యాన్ గ్రూపుల సందడి అంతా ఇంతా కాదు. అయితే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నటసింహా బాలకృష్ణకు రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాల నేపథ్యంలో వారి కోసం లైవ్ గ్రూపులు నిరంతరం ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐబ్యాంక్ నిర్వహణ సహా క్రైసిస్ సమయాల్లో ఆదుకునేందుకు చిరంజీవి అభిమానులు ప్రత్యేకించి కొన్ని గ్రూపులను యాక్టివ్ గా ఉంచారు.
రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ సహా చాలా మంది తెలుగు హీరోలకు ఫ్యాన్ గ్రూపులు విస్త్రతంగా పని చేస్తున్నాయి. సోషల్ మీడియాల్లోను పలువురు హీరోలు చురుగ్గా ఉండడంతో నిరంతరం అభిమానులు వారితో కనెక్టయి ఉంటున్నారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులు ఇందుకు ఇతోధికంగా సహకరిస్తున్నాయి. అయితే వాట్సాప్ గ్రూపులు సామాజిక మాధ్యమాలను ఇప్పుడు రాజకీయ సామాజిక కార్యకలాపాలకు వేదికగా మార్చేందుకు ఒక ప్రముఖ తమిళ హీరో తపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ పవర్ స్టార్ లా అతడు కోలీవుడ్ పవర్‌స్టార్ గా గొప్ప పాపులారిటీని అందుకున్నారు. ఇంతకీ ఎవరా హీరో...?
స్టార్ హీరోకు 1600 వాట్సాప్ గ్రూపుల:
కోలీవుడ్ నటుడు, దళపతి విజయ్ తమిళనాడులో పవర్ స్టార్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. అతడికి రాజకీయాలతో విడదీయరాని అనుబంధం ఉందన్నది విధితమే. అతడి తండ్రి గారు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. అదే క్రమంలో విజయ్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. సినీరంగంలో అగ్ర హీరోగా గొప్ప స్థాయిలో ఉన్నప్పుడే ప్రజల్లోకి వెళ్లాలనేది అభిమానుల అభిమతం. అదే క్రమంలో విజయ్ సైతం తన ప్రణాళికల్ని ప్రత్యక్ష రాజకీయాల వైపు విస్తరిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో బలమైన ప్రభావవంతమైన నాయకుడు ఎవరూ లేకపోవడంతో రంగంలోకి దూకేందుకు ఇదే సరైన సమయమని విజయ్ భావిస్తున్నాడు. దళపతి విజయ్ తన పరిధిని విస్తరించడానికి, విస్తృతంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు సోషల్ మీడియాను చురుకుగా ఉపయోగిస్తున్నాడు. విజయ్ ప్రజా సంఘం కార్యదర్శి బుస్సి ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన సంఘం కార్యకర్తలు సమావేశమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరంతా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వారు వాట్సాప్ గ్రూపుల ద్వారా సాంకేతికతను ఉపయోగించుకోవాలని, కమ్యూనికేషన్‌ను మెరుగుపరచాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే దాదాపు 1600 వాట్సాప్ గ్రూపులను రూపొందించారని తెలిసింది.
విజయ్ కి కేవలం తమిళనాడులోనే కాకుండా దేశ విదేశాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. దానికి తగ్గట్టుగా ఫాలోవర్స్ అందరినీ సమీకరించేందుకు, సమర్థవంతమైన విస్తరణను సులభతరం చేయడానికి 10వేల వాట్సాప్ సమూహాలను సృష్టించాలనేది తాజా ప్రణాళిక. ప్రజాప్రతినిధులతో కనెక్ట్ అయ్యేందుకు, వారి సమస్యలను పరిష్కరించడానికి వాట్సాప్ గ్రూపులను ఉపయోగించే ఈ వ్యూహాన్ని గతంలో ఎండిఎంకే నాయకుడు విజయకాంత్ అనుసరించారు. దానిని ఇప్పుడు విజయ్ కూడా ఉపయోగిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్న విజయ్ తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా లేదా? అన్నది ఇప్పుడే తెలియదు.
ఇక సినీకెరీర్ ని పరిశీలిస్తే, త్వరలో విజయ్ నటించిన లియో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తదుపరి వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమాలో కనిపించనున్నాడు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారిస్తారని టాక్ వినిపిస్తోంది.