కుమార్తెలు కోసం స్టార్ హీరోలు మెట్టు దిగుతున్నారే!
సాధారణంగా వారసులు అంటే కుమారులే గుర్తొస్తారు. తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టేదు కుమారేలే అంటూ ఎప్పటికప్పుడు చర్చకు దారి తీస్తుంది
By: Tupaki Desk | 11 Feb 2024 11:30 AM GMTసాధారణంగా వారసులు అంటే కుమారులే గుర్తొస్తారు. తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టేదు కుమారేలే అంటూ ఎప్పటికప్పుడు చర్చకు దారి తీస్తుంది. కానీ వారసురాళ్ల విషయంలో అంత హైప్ చోటు చేసు కోదు. ఇండస్ట్రీలో హీరోయిన్లకు లాంగ్ లైఫ్ ఉండదనే భావన కూడా వారసురాళ్ల విషయంలో కాస్త మింగు పడని అంశమే. వచ్చారు అంటే వచ్చారు..చేసారు అంటే చేసారు..వెళ్లారు అంటే వెళ్లారు? అన్నట్లే ఉంటుంది వారసురాళ్ల విషయంలో. ఆ ఫేజ్ ని దాటి బయటకు రావడం అంత ఈజీ కాదు.
మరి ఈ రకమైన ఫేజ్ని దాటడంలో తండ్రులు కూడా వారసురాళ్ల కోసం ఓ మెట్టు దిగుతున్నారా? కుమార్తెల కోసం బ్యాకెండ్ లో పప్పాలు కూడా శ్రమిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఆయన ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య...సౌందర్య రంజనీకాంత్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రాఫిక్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించిన సౌందర్య నిర్మాత గానూ సుపరిచితమే.
అటుపై రజనీకాంత్ నటించిన 'కొచ్చాడియన్' తో దర్శకురాలిగా తెరంగేట్రం చేసింది. ఇది రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద సాహసంతో కూడిన సినిమా. ఇదొక యానిమేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ అన్న సంగతి తెలిసిందే. దర్శకురాలిగా అనుభవం లేని సౌందర్య కోసం రజనీకాంత్ చేసిన చిత్రమిది. 125 కోట్లతో నిర్మించిన సినిమా 42 కోట్లు తెచ్చింది. ఆ సినిమా ప్లాప్ తర్వాత సౌందర్య మరో సినిమా చేయడానికి మూడేళ్లు పట్టింది.
'కొచ్చాడయాన్' కోసం రజనీకాంత్ పాన్ వరల్డ్ ఇమేజ్ ని పక్కనబెట్టి చేసిన చిత్రమిది. తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్' ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. విష్ణు విశాల్ ..విక్రాంత్ మెయిన్ రోల్స్ లో తెరకెక్కిన చిత్రమిది. కానీ కుమార్తె కోసం రజనీకాంత్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలోనే రజనీ ఇలాంటి పాత్రలు పోషించారు. మళ్లీ కుమార్తె కోసం రెండు మెట్లు దిగాల్సి వచ్చింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. చిరు ఏ సినిమా చేసినా ఆ చిత్రానికి సుస్మిత డిజైనర్ గా పనిచేస్తూ వచ్చారు. దీంతో సుస్మితని ఇంకా గొప్ప స్థానంలో చిరు చూడాలనుకున్నారా? సుస్మిత కోరిక కాదనలేక సీన్ లోకి వచ్చారా? అన్నది తెలియదు గానీ... చిరంజీవి 157వ చిత్రంతో సుస్మిత నిర్మాతగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి బ్యాకెండ్ వర్క్ అంతా మెగాస్టార్ చూస్తున్నట్లు సమాచారం. కుమార్తెని ఇండస్ట్రీలో నిర్మాతగా నిలబెట్టాలని చూస్తున్నారు. అందుకే ఈ సినిమా విషయంలో చిరు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రాజెక్ట్ ని ప్రకటించినా ఇంతవరకూ మొదలు పెట్టలేదంటే? తండ్రీ-కుమార్తెలు ఎంత శ్రద్ద తీసుకుంటున్నారో కనిపిస్తూనే ఉంది. ఎంతో మంది సీనియర్ నిర్మాతలతో పనిచేసిన చిరంజీవి ఇప్పుడు కుమార్తె కోసం హీరో అవుతున్నారు. అలాగే నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి అఖండ-2ని ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
'అఖండ' భారీ విజయం సాధించడంతో 'అఖండ-2' తో బాలయ్య తన చిన్నకుమార్తె తేజస్వీని నిర్మాతగా పరిచయం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ నందమూరి ఫ్యామిలీ మహిళలంతా సినిమాలకు దూరంగానే ఉన్నారు. తొలిసారి తేజస్వీని పేరు నిర్మాతగా తెరపైకి రావడం విశేషం. కుమార్తె కోరిక మేరకు బాలయ్య ఈ ఛాన్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. 'అఖండ-2' తర్వాత తేజస్వీని పేరు మారు మ్రోగిపో వడం ఖాయం.
అలాగే మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక ఇండస్ట్రీతో చాలా కాలంగా పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. నటిగా..నిర్మాతగా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటుంది. కానీ నిహారిక పేరు మారు మ్రోగింది లేదు. దీంతో సెకెండ్ ఇన్నింగ్స్ ని నిహారిక ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భర్తతో విడాకుల తర్వాత కెరీర్ లో ఇష్టమైన రంగంలో సుస్థిరంగా స్థిరపడాలి అన్న ఆలోచనతో ముందుకు కదులుతుంది. అందుకు కుటుంబం నుంచి అన్నిరకాలుగా సహకారం లభిస్తుంది.