మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి మరో స్టార్ హీరో
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి సుదర్శన్ థియేటర్ లో చాలా రికార్డులు ఉన్నాయి.
By: Tupaki Desk | 9 April 2024 4:06 PM GMTహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సుదర్శన్ థియేటర్ కి చాలా చరిత్ర ఉంది. ఈ థియేటర్ లో మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఇండస్ట్రీ స్టార్స్ కి ఉంది. అలాగే ఒకప్పుడు స్టార్స్ అందరూ కూడా సుదర్శన్ థియేటర్ కి వెళ్లి అభిమానులతో కలిసి సినిమాలు చూసేవారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి సుదర్శన్ థియేటర్ లో చాలా రికార్డులు ఉన్నాయి.
అయితే ఈ థియేటర్ 2010లో మూతబడింది. అప్పటి నుంచి అందుబాటులో లేదు. ఈ థియేటర్స్ స్థానంలో మల్టీప్లెక్స్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం నడిచింది. ఇన్నేళ్లకి మల్టీప్లెక్స్ కార్యరూపం దాల్చబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ఏషియన్ సునీల్ కలిసి సుదర్శన్ థియేటర్ ని సొంతం చేసుకున్నారంట. ఈ ప్లేస్ లో 7 స్క్రీన్స్ తో పెద్ద మల్టీ ప్లెక్స్ థియేటర్స్ అండ్ కంప్లెక్స్ ని నిర్మించబోతున్నారు.
మల్టీప్లెక్స్ నిర్మాణానికి సంబందించిన పూజా కార్యక్రమాలు త్వరలో జరగబోతున్నాయంట. ఇక ఈ మల్టీప్లెక్స్ కి ఏఎంబి విక్టరీ అనే పేరుని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఏఎంబి మాల్ గచ్చిబౌలిలో నడుస్తోంది. సిటీలో అత్యంత ఎక్కువ టికెట్ ధరలు ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ లోనే ఉన్నాయి.
ఇప్పుడు సుందర్శన్ థియేటర్ స్థానంలో నిర్మించబోయే మల్టీప్లెక్స్ కోసం మహేష్ బాబుకి విక్టరీ వెంకటేష్ కూడా భాగస్వామి కాబోతుండటం విశేషం. విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. సురేష్ ప్రొడక్షన్ కి తెలుగు రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ చాలా ఉన్నాయి. అయితే వాటి బాధ్యతలని సురేష్ బాబు చూసుకుంటున్నారు.
విక్టరీ వెంకటేష్ మొదటిసారిగా సొంతంగా మల్టీప్లెక్స్ థియేటర్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏఎంబి విక్టరీ మల్టీప్లెక్స్ ని ఎప్పటికి అందుబాటులోకి తీసుకొస్తారు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి స్టార్ హీరోలు అందరూ కూడా సినిమాపైన సంపాదించిన డబ్బుని తిరిగి సినిమా ప్రొడక్షన్ లో, థియేటర్స్ వ్యాపారంలో పెట్టుబడులుగా పెడుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఏషియన్ సినిమాస్ టాలీవుడ్ ప్రముఖ హీరోలతో కలిసి పాత థియేటర్స్ ను మళ్ళీ కొత్తగా మారుస్తోంది. అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ, నాని కూడా ఈ రంగంలో ఏషియన్ వారితో చేతులు కలిపారు.