Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: ముంబైకి పోయిస్తున్నారు!

అట్నుంచి ఆ ఫోటోల‌న్నీ ఇక్క‌డ టాలీవుడ్ స‌ర్కిల్స్ లోకి వ‌స్తున్నాయి. దీంతో అస‌లు మ‌న స్టార్లు అంతా ముంబైకే ఎందుకు వెళుతున్నారు? అన్న ఆరాలు ఎక్కువయ్యాయి.

By:  Tupaki Desk   |   28 Dec 2023 12:30 PM GMT
టాప్ స్టోరి: ముంబైకి పోయిస్తున్నారు!
X

ఈ ముంబైకి ఉ* పోయించ‌డానికి వ‌చ్చాను! అని చెబుతాడు 'బిజినెస్ మేన్'లో మ‌హేష్ బాబు. ఇటీవ‌లి కాలంలో మ‌న స్టార్ హీరోల తీరుతెన్నులు చూస్తుంటే ముంబైకి పోయించ‌డానికే వెళుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌న స్టార్లు చీటికి మాటికి ముంబై విమానాశ్ర‌యంలో స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల కెమెరాల‌కు చిక్కుతున్నారు. అట్నుంచి ఆ ఫోటోల‌న్నీ ఇక్క‌డ టాలీవుడ్ స‌ర్కిల్స్ లోకి వ‌స్తున్నాయి. దీంతో అస‌లు మ‌న స్టార్లు అంతా ముంబైకే ఎందుకు వెళుతున్నారు? అన్న ఆరాలు ఎక్కువయ్యాయి.

ముఖ్యంగా ఇటీవ‌లి కాలంలో రెగ్యుల‌ర్ గా ముంబైకి వెళుతున్న స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్‌. అత‌డు అక్క‌డే సొంతంగా ఒక ఇంటిని కొనుగోలు చేసి, సొంత వ్యాపారాల‌కు ప్లాన్ చేసాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇటీవ‌ల త‌మ కుమార్తె కిన్ క్లారా, భార్య ఉపాస‌న స‌హా చ‌ర‌ణ్ ముంబైలో చ‌క్క‌ర్లు కొట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే చ‌ర‌ణ్ ఇటీవ‌ల ముంబై నుంచి త‌న వ్యాపార కార్య‌కలాపాల‌ను చ‌క్క‌దిద్దుతున్నాడు. ప‌నిలో ప‌నిగా ముంబై సినీప‌రిశ్ర‌మ‌లో త‌న ఎదుగుద‌ల‌కు సంబంధించిన పూర్తి ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకెళుతున్నాడు. ఆర్.ఆర్.ఆర్ హిందీ బెల్ట్ లోను పెద్ద విజ‌యం సాధించింది. ఆస్కార్ - గోల్డెన్ గ్లోబ్ స‌హా ప‌లు అవార్డులు ఈ సినిమాకి ద‌క్కాయి. ఇదే అద‌నుగా స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ స్పీడ్ పెంచాడు. అత‌డు న‌టిస్తున్న గేమ్ ఛేంజ‌ర్ స‌హా మునుముందు న‌టించ‌బోయే పాన్ ఇండియా చిత్రాల‌కు మంచి బిజినెస్ ద‌క్కేందుకు ప్ర‌తిదీ సుగ‌మం చేస్తున్నాడ‌ని స‌మాచారం.

మ‌రోవైపు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఇటీవ‌ల ముంబైకి త‌ర‌చుగా వెళుతున్నారు. అత‌డికి ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు ద‌క్కింది. ఆ వెంట‌నే కొర‌టాల నేతృత్వంలోని దేవ‌ర కాన్వాస్ అమాంతం మారిపోయింది. ఈ సినిమా బిజినెస్ స‌హా త‌దుప‌రి ప్ర‌శాంత్ నీల్ తో సినిమా, ఇతర పెద్ద సినిమాల విష‌య‌మై ఎన్టీఆర్ హిందీ మార్కెట్లో గ్రిప్ పెంచుకునే ప‌నిలో ఉన్నాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ న‌టిస్తున్న దేవ‌రను రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ బిజినెస్ తెచ్చేందుకు ఎన్టీఆర్ మంత్రాంగం న‌డిపిస్తున్నారు.

మ‌రోవైపు ద‌గ్గు బాటి రానా బాహుబ‌లి రిలీజ్ కి ముందు నుంచి కూడా హిందీ చిత్ర‌సీమ‌కు సుప‌రిచితుడు. ముంబైకి రెగ్యుల‌ర్ గానే వెళుతుంటాడు. ఇటీవ‌ల మ‌రింత ఫ్రీక్వెంట్ గా ముంబైకి వెళుతున్నాడు. రానా తదుప‌రి హిర‌ణ్య క‌శిప స‌హా ప‌లు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తున్నాడు.

ల‌క్ష్మీ మంచు చాలా కాలంగా బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో స‌త్సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నారు. మారుతున్న సినారియోలో బాలీవుడ్ వెబ్ సిరీస్ ల‌లోను ల‌క్ష్మీ మంచు న‌టించేందుకు ఆస్కారం లేక‌పోలేదు. నిర్మాత‌గాను ఇత‌రుల‌తో భాగ‌స్వామ్యంలో ఏదైనా ప్ర‌య‌త్నం చేస్తున్నారేమో చూడాల్సి ఉంది. త‌మ‌న్నా, ర‌కుల్ ప్రీత్, పూజా హెగ్డేల‌కు ముంబై ప‌రిశ్ర‌మ‌లో నిరంత‌రం అవ‌కాశాలొస్తున్నాయి. ఆ ముగ్గురూ హిందీ చిత్ర‌సీమ‌లో కెరీర్ విస్త‌ర‌ణ‌పై దృష్టి సారించారు.

స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ - ఛార్మి చాలా కాలంగా ముంబై ప‌రిశ్ర‌మ‌తో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. దానివ‌ల్ల ముంబైకి త‌ర‌చుగా వెళ్లి వ‌స్తున్నారు. ఇటీవ‌ల లైగ‌ర్ చిత్రం కోసం ముంబైలో ఆఫీస్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. లైగ‌ర్ డిజాస్ట‌ర్ అవ్వ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. అయినా త‌దుప‌రి పాన్ ఇండియా బిజినెస్ ని త‌మ‌వైపు తిప్పుకునేందుకు ముంబైలో స‌త్సంబంధాల‌ను కొన‌సాగిస్తున్న‌రు. అలాగే కోలీవుడ్ నుంచి సూర్య‌- జ్యోతిక జోడీ కూడా ఉత్త‌రాది మార్కెట్ పై క‌న్నేశారు. సూర్య 2డి నిర్మాణ సంస్థ‌ను అక్క‌డా విస్త‌రించ‌డం ద్వారా పాన్ ఇండియా మార్కెట్ల‌ను గుప్పిట ప‌ట్టాల‌న్న‌ది ప్లాన్. కంగువ తో పాన్ ఇండియాలో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్న సూర్య ఇక త‌న చిత్రాల‌కు ఉత్త‌రాదినా భారీ ప్ర‌మోష‌న్ చేయ‌నున్నారు.

సౌత్ స్టార్లకు హైద‌రాబాద్ లో మొద‌టి ఇల్లు ఉన్నా కానీ, ముంబైని రెండో ఇంటిగా మార్చుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఇటీవ‌లి కాలంలో ప్రాంతీయ అస‌మాన‌త‌లు వైదొల‌గిపోయాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే మ‌న స్టార్లు, డైరెక్ట‌ర్ల‌కు హిందీ చిత్ర‌సీమ‌లో ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఉత్త‌రాది ఆడియెన్ ద‌క్షిణాది హీరోల చిత్రాల‌ను బంప‌ర్ హిట్లు చేసేందుకు స‌హ‌క‌రిస్తున్నారు. అలాగే హిందీ డ‌బ్బింగ్ రైట్స్, రీమేక్ రౌట్స్ , ఓటీటీ బిజినెస్ లు కూడా ముంబైలో మ‌న స్టార్లు స్టే చేసేందుకు కార‌ణ‌మ‌వుతున్నాయి. ఓవ‌రాల్ గా మ‌నోళ్లు ముంబైకి పోయిస్తున్నారు!