Begin typing your search above and press return to search.

స్త్రీ2 వెయ్యి కోట్లు.. ఛాన్స్ లేనట్లే?

ఇండియన్ సినిమాకి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ క్రియేట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   27 Aug 2024 7:13 AM GMT
స్త్రీ2 వెయ్యి కోట్లు.. ఛాన్స్ లేనట్లే?
X

ఇండియన్ సినిమాకి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా యూఎస్ లో ఇండియన్ స్టార్ హీరోల సినిమాలకి మంచి ఆదాయం వస్తోంది. కంటెంట్ ఏ మాత్రం బాగున్న అక్కడ ఇండియన్స్ మాత్రమే కాకుండా ఫారిన్ ఆడియన్స్ కూడా భారతీయ సినిమాలని చూడటానికి రెడీ అవుతున్నారు. మంచి కథలకి భాష అడ్డంకి కాదని ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ నిరూపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఆగష్టు 15న హిందీలో స్త్రీ2 ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్త్రీ మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ కీలక పాత్రలలో కనిపించారు. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం లాంటి స్టార్స్ కి పోటీగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. మూవీ 11 రోజుల్లోనే ఏకంగా 400 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. వీకెండ్ తో పాటు ఫెస్టివల్ హాలిడేస్ కూడా కలిసి రావడంతో ఈ సినిమాకి అద్భుతమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది.

గత ఏడు నెలల కాలంలో బాలీవుడ్ నుంచి బ్లాక్ బస్టర్ అనిపించుకునే సినిమా ఒకటి కూడా రాలేదు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ముంజ్య హిట్ టాక్ సొంతం చేసుకొని 100 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన కల్కి 2898ఏడీ అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా హిందీలో మొన్నటి వరకు ఉంది. దీనిని బట్టి ఈ ఏడాది ప్రథమార్ధం బాలీవుడ్ కి ఎలాంటి గడ్డు పరిస్థితి ఉందో చెప్పొచ్చు.

స్త్రీ2 సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. సెలవు దొరికితే ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి థియేటర్స్ కి వెళ్తున్నారు. దీంతో కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. గత ఏడాది షారుఖ్ ఖాన్ జవాన్, రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలకి కూడా మొదటి 11 రోజుల్లోనే ఇదే స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. షారుఖ్ ఖాన్ కి ఓవర్సేస్ లో కూడా మంచి మార్కెట్ ఉండటంతో 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ ని ఈజీగా అందుకున్నారు.

యానిమల్ కూడా ఓవర్సీస్ లో మంచి వసూళ్లని సాధించింది. అయిన 900 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. ఇక స్త్రీ2 సినిమా ఇండియన్ మార్కెట్ లో సాలిడ్ గా పెర్ఫార్మ్ చేస్తున్న అంతర్జాతీయంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకోలేదు. కల్కి మూవీకి కూడా 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ రావడానికి ఓవర్సీస్ మార్కెట్ ఒక కారణం. స్త్రీ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ లేకపోవడం వలన ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం లేదనే మాట వినిపిస్తోంది. లాంగ్ రన్ లో ఈ మూవీ 600 నుంచి 700 కోట్ల వరకు కలెక్షన్స్ ని అందుకోవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.