'గేమ్ ఛేంజర్' థియేటర్ల వద్ద 'పుష్ప 2' ఘటన ఎఫెక్ట్
సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By: Tupaki Desk | 10 Jan 2025 4:23 AM GMTఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమా విడుదల సమయంలో జరిగిన విషాద ఘటన తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. సినిమా ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్‌లో తొక్కిసలాట జరిగి వివాహిత మృతి చెందగా నెల రోజులుగా బాలుడు చికిత్స పొందుతున్నాడు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా థియేటర్ల వద్ద సెక్యూరిటీ కట్టుదిట్టం చేసింది. థియేటర్ల వద్ద భారీ ఎత్తున జనాలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా థియేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.
సంధ్య థియేటర్ ఘటన ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాలపై బలంగా ఉంటుందని అంతా అనుకున్నారు. ముఖ్యంగా నైజాం ఏరియాలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతించక పోవచ్చు అనుకున్నారు. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ సైలెంట్‌గా టికెట్ల రేట్ల అనుమతికి జీవో ఇచ్చింది. కానీ థియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాటు చేయడంతో పాటు, థియేటర్ల యాజమాన్యాలు స్వీయ భద్రత ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్ల వద్ద సెక్యూరిటీ మరింత టైట్ చేశారు.
టికెట్లు ఉన్న వారి వరకు థియేటర్ లోనికి వెళ్తే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ టికెట్లు లేని వారు సైతం థియేటర్‌లోకి వెళ్తేనే అసలైన గందరగోళం క్రియేట్ అవుతుంది. అందుకే క్రాస్ రోడ్స్ థియేటర్ వద్ద టికెట్ ఉంటేనే థియేటర్‌లోకి అనుమతి అంటూ బోర్డులు కనిపించాయి. టికెట్ లేని వారిని కనీసం థియేటర్ గేటు లోపల కూడా అడుగు పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. దాంతో ఎలాంటి హంగామా లేకుండానే గేమ్ ఛేంజర్ సినిమా వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్స్ వద్ద పెద్ద ఎత్తున హడావుడి చేయాలి అనుకున్న మెగా ఫ్యాన్స్‌కి ముందస్తుగానే పోలీసుల ఆదేశాలు అందడంతో తమ వేడుకలను క్యాన్సల్ చేసుకున్నారు.
రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటించారు. తెలంగాణలో ఈ సినిమాకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ రేట్ల పెంపుకు ఓకే చెప్పడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందే ఏపీలోనూ టికెట్ రేట్ల పెంపుకు అనుమతి లభించింది. అందుకే గేమ్ ఛేంజర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అయ్యింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఎక్కడా గతంలో మాదిరిగా డీజే సౌండ్ సిస్టమ్స్ తో హంగామా కనిపించడం లేదు.