'కంగువ' రివ్యూ.. జ్యోతికపై సింగర్ షాకింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ''కంగువ''. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ పాన్ ఇండియా ఫాంటసీ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది
By: Tupaki Desk | 18 Nov 2024 5:13 PM GMTకోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ''కంగువ''. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ పాన్ ఇండియా ఫాంటసీ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీకి నెగెటివ్ రివ్యూలు రావడంపై సూర్య సతీమణి, నటి జ్యోతిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. సూర్య భార్యగా కాకుండా ఒక మూవీ లవర్‌గా ఈ రివ్యూ ఇస్తున్నట్లు చెబుతూ.. సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. దీనిపై తాజాగా సింగర్ సుచిత్ర స్పందిస్తూ.. జ్యోతిక మీద ఫైర్ అయింది.
'కంగువ' అద్భుతమైన చిత్రమని, సూర్య నటన విషయంలో ఎంతో గర్వంగా ఉన్నానని జ్యోతిక పేర్కొంది. మొదటి 30 నిమిషాలు మాత్రం అనుకున్న స్థాయిలో లేదనే మాట వాస్తవమే అని, ఇలాంటి ప్రయోగత్మక చిత్రాల్లో అలాంటి చిన్న లోపాలు ఉండటం సహజమే అని తెలిపింది. జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై ప్లేబ్యాక్ సింగర్ సుచిత్ర రియాక్ట్ అయింది. 'కంగువ' చిత్రానికి జ్యోతిక ఇచ్చిన రివ్యూ.. ఆమె పబ్లిసిటీకి తప్ప మరొకటి కాదని కామెంట్స్ చేసింది. అయితే తాను సూర్యకు మద్దతు ఇవ్వడానికి మాత్రమే ఇన్స్టా లైవ్ కి వచ్చినట్లు సుచిత్ర పేర్కొంది.
జ్యోతిక కేవలం అప్రిసియేషన్ నోట్ ని మాత్రమే పోస్ట్ చేయలేదని, తనను తాను క్రిటిక్ గా మార్చుకుంటూ ప్రేక్షకుల కంటే ఎక్కువగా 'కంగువ' సినిమాను ట్రోల్ చేసిందని సుచిత్ర వ్యాఖ్యానించింది. సినిమాలో మొదటి అర్థ గంట బాగాలేదని జ్యోతిక చెబుతోంది.. అంటే మరి ఆడియన్స్ 30 నిమిషాల తర్వాతే సినిమాకి రావాలి కదా? అని సెటైర్లు వేసింది. ఇతర భారీ బడ్జెట్ సినిమాల్లో మహిళల మీద డబుల్ మీనింగ్ డైలాగ్స్, కించపరిచే సీన్స్ ఉంటాయని.. కానీ ఈ సినిమాలో సెకండాఫ్ లో విమెన్ యాక్షన్ సీక్వెన్స్ ఉందంటూ 'కంగువ'ను సపోర్ట్ చేసేందుకు తనకు తాను ఫెమినిస్ట్ కవర్-అప్ వేసుకొని వచ్చిందని జ్యోతికను సుచిత్ర ట్రోల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
గ్రీన్ స్టూడియోస్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో 'కంగువ' చిత్రాన్ని నిర్మించారు. 1000 ఏళ్ళ క్రితం కథకి, వర్తమానానికి ముడిపెడుతూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో కంగువా, ఫ్రాన్సిస్ అనే రెండు పాత్రల్లో సూర్య నటించారు. దిశా పటానీ పెద్దగా ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్రలో నటించగా.. బాబీ డియోల్ విలన్ పాత్రను పోషించారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. పాటలు బాగున్నప్పటికీ, కొన్ని చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ లౌడ్ గా ఉందనే విమర్శలు వచ్చాయి. దీంతో థియేటర్లలో వాల్యూమ్ ను నార్మల్ కంటే రెండు పాయింట్స్ ను తగ్గిస్తున్నట్లుగా నిర్మాత తెలిపారు.
ఇక ఈ సినిమా గురించి జ్యోతిక పోస్ట్ పెడుతూ.. ''కంగువ.. అద్భుతమైన చిత్రం. సూర్య నటన విషయంలో ఎంతో గర్వంగా ఉన్నాను. నిజమే మొదటి అరగంట అనుకున్న స్థాయిలో లేదు. అలాగే సౌండ్ చాలా ఎక్కువగా ఉంది. ఎన్నో సినిమాల్లో లోపాలు ఉంటాయి. ఇలాంటి ప్రయోగత్మక చిత్రాల్లో అలాంటి చిన్న లోపాలు ఉండటంలో తప్పులేదు. కానీ మూడు గంటల సినిమాలో కేవలం మొదటి అరగంట మాత్రమే కదా సరిగా లేనిది. నిజం చెబుతున్నా.. ఇదొక అద్భుత సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించింది. ఇలాంటి కెమెరా వర్క్ మునుపెన్నడూ చూడలేదు''
''ఈ మూవీకి వస్తోన్న నెగెటివ్ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయాను. గతంలో రిలీజైన కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్లో మహిళలను తక్కువ చేసేలా డైలాగ్స్ ఉన్నా, సీన్స్ బాగోకపోయినా ఇలాంటి రివ్యూలు చూడలేదు. భారీ యాక్షన్ సన్నివేశాలు, సెకండాఫ్‌లో మహిళలపై చిత్రీకరించిన ఫైట్ సీన్స్, కంగువాపై చిన్నారి ప్రేమ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నాకు తెలిసి రివ్యూ చేసేప్పుడు పాజిటివ్స్ అన్నీ మరిచిపోయినట్లు ఉన్నారు. ఫస్ట్ డే నుంచే ఇంత నెగెటివిటీని చూడటం బాధగా ఉంది. అద్భుతమైన దృశ్యాన్ని రూపొందించడానికి చిత్ర బృందం ఎంచుకున్న కాన్సెప్ట్, ఆ ప్రయత్నానికి తప్పకుండా ప్రశంసలు దక్కాలి'' అని రాసుకొచ్చింది. ఓ సినిమా అభిమానిగా ఈ రివ్యూ ఇస్తున్నట్లు జ్యోతిక పేర్కొంది.