కిచ్చా సుదీప్ BRB.. హై రేంజ్ లోనే..
విక్రాంత్ రోణ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మంచి కలెక్షన్లు అందుకున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 2 Sep 2024 6:49 AM GMTవిక్రాంత్ రోణ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మంచి కలెక్షన్లు అందుకున్న విషయం తెలిసిందే. ఇక అలాంటి సినిమా తర్వాత, సూపర్‌స్టార్ కిచ్చ సుదీప్, డైరెక్టర్ అనూప్ భండారీ మరోసారి డిఫరెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరి న్యూ ప్రాజెక్ట్ "బిల్లా రంగ బాషా," అంటూ ఒక స్పెషల్ అప్డేట్ అయితే ఇచ్చారు. హనుమాన్ ఫేమ్ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిల ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోంది.
సుదీప్ పుట్టినరోజు సందర్భంగా "బిల్లా రంగ బాషా" చిత్రానికి సంబంధించిన "అఫీషియల్ లోగో"తో పాటు ఒక సరికొత్త కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో భవిష్యత్తులో జరిగే కథను పరిచయం చేస్తూ, 2209 సంవత్సరంలో వివిధ ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులు, భవిష్య సమాజం ఎలా ఉంటుందో చూపించారు. ఈ వీడియోలో ప్రఖ్యాత కట్టడాలు, లాంటి ఈఫిల్ టవర్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, తాజ్ మహల్, వీటన్నింటిని ధ్వంసమైనట్లు చూపించడం, ఒక వ్యక్తి ప్రపంచాన్ని జయించినట్లు పరిచయం చేయడం విశేషం.
ఈ ప్రాజెక్ట్ గురించి అనూప్ భండారీ మాట్లాడుతూ, "విక్రాంత్ రోణ" తర్వాత కె. నిరంజన్ రెడ్డి నా తో పని చేయాలని భావించారు. "హనుమాన్" చిత్ర నిర్మాణ సమయంలో మాతో చర్చలు జరిపారు. "బిల్లా రంగ బాషా" కథని వినగానే, వారు ఈ ప్రాజెక్ట్ పట్ల అత్యంత ఆసక్తి చూపించారు. కిచ్చ సుదీప్ గారితో పని చేయడం ప్రతి సారీ అద్భుతమైన అనుభవమే. "విక్రాంత్ రోణ"ను ప్రేక్షకులు ఎంతగా ప్రేమించారో, ఈ చిత్రాన్ని కూడా అంతే ఆసక్తితో చూస్తారని నమ్మకం ఉంది" అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ, "కిచ్చ సుదీప్, అనూప్ భండారీ కలయికలో రాబోయే సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. "విక్రాంత్ రోణ" మంచి విజయం సాధించినందున, ఈ ప్రాజెక్ట్ కూడా పెద్ద స్థాయిలో ఉండబోతుందన్న నమ్మకం ఉంది. బిల్లా రంగ బాషా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఫ్యూచర్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించబోతున్నాం" అని పేర్కొన్నారు.
"బిల్లా రంగ బాషా" పాన్-ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో హీరో సుదీప్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనోతున్నాడు. సినిమా కోసం ఇదివరకే వర్క్ షాప్ నిర్వహించారు. దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా ఎక్కువ సమయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా లెవెల్ లో బిగ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. మరి సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.