థాంక్యూ బాస్ కి గుడ్ బై చెప్పేస్తా!
తాజాగా ఈ పిలుపుకు తాను సైతం సై అంటూ నటుడు సుదీప్ ముందుకొస్తున్నాడు. పోన్ పేకి ఆ రాష్ట్రానికి సంబంధించి సుదీప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
By: Tupaki Desk | 22 July 2024 2:43 AM GMTఫోన్ పే లో పేమెంట్ సక్సెస్ అయితే థాంక్యూ బాస్ అంటూ మహేష్ వాయిస్ అంతా వింటుంటాం. అలాగే కన్నడలో అయితే సుదీప్ వాయిస్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడా సుదీప్ పోన్ పేతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి రెడీ అవుతున్నాడా? కన్నడిగుల మద్దతకు సై అంటూ కోట్ల రూపాయాల డీల్ ని వదులుకోవడానికి సిద్దపడుతున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే అసలి సంగతేంటి? అన్నది తెలుస్తుంది.
కర్ణాటకలో ని ప్రయివేట్ సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ప్రాముఖ్యత ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం తీసుకొస్తుంది. అయితే ఈ నిబంధనని పోన్ పే సీఈవో సమీర్ నిగమ్ తోసిపుచ్చారు. దీంతో అక్కడి ప్రజలు పోన్ పేని బ్యాన్ చేయాలనే నినాదాన్ని ఎత్తుకున్నారు. పోన్ పే వినియోగాన్ని రాష్ట్ర ప్రజలంతా వదిలేయాలని బహిష్కరణకు పిలుపునిచ్చారు.
తాజాగా ఈ పిలుపుకు తాను సైతం సై అంటూ నటుడు సుదీప్ ముందుకొస్తున్నాడు. పోన్ పేకి ఆ రాష్ట్రానికి సంబంధించి సుదీప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అక్కడి ప్రజలు తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని... ఫోన్ పేతో తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలకంటే తనకు ఏదీ ఎక్కువ కాదని, స్థానికలకు ఉద్యోగాల కల్పన అన్నది అత్యంత ముఖ్యంగా సుదీప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కన్నడిగులు పోన్ పే సంస్థ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారుట. దీనికి సంబంధించి సుదీప్ సోమవారం నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తానికి కన్నడ నాట పోన్ పే వివాదం పెద్ద రచ్చగానే మారింది. ఇంకా చాలా మంది నటీనటులు ప్రభుత్వం నిర్ణయం పట్ల కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు.