Begin typing your search above and press return to search.

'నవ దళపతి' ట్యాగ్‌పై సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి బాగానే కష్టపడుతూ వచ్చారు.

By:  Tupaki Desk   |   8 Oct 2024 6:00 AM GMT
నవ దళపతి ట్యాగ్‌పై సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపుగా అందరు హీరోలకు ఓ 'స్టార్' ట్యాగ్‌ ఉంటుంది. మన టాలీవుడ్ లో అయితే ఇది సర్వ సాధారణం. అగ్ర హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకూ.. ప్రతీ ఒక్కరికీ ఏదొక స్టార్ ట్యాగ్ ఉంది. దర్శక నిర్మాతల సూచన మేరకు లేదా అభిమానుల కోరిక మీద హీరోలు తమ పేరు ముందు ప్రీఫిక్స్ ను యాడ్ చేసుకుంటుంటారు. ఫ్యాన్స్ సైతం తమ ఫేవరేట్ హీరోలను అసలు పేర్లతో కంటే ఆ ట్యాగ్స్ తోనే ఎక్కువగా పిలుచుకుంటూ ఉంటారు. కొందరు హీరోలు మాత్రం ట్రెండ్ కు తగ్గట్టుగా తమ స్టార్ ట్యాగ్స్ ను మార్చుకుంటూ ఉంటారు. తాజాగా హీరో సుధీర్ బాబు తన కొత్త నేమ్ ట్యాగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి బాగానే కష్టపడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆయన్ను ‘నైట్రో స్టార్’ అని పిలుచుకోవడం ప్రారంభించారు. అయితే ‘హరోం హర’ సినిమాకి సుధీర్ ట్యాగ్ లైన్ మారింది. ‘నవ దళపతి’ అనే కొత్త స్టార్ ట్యాగ్ వచ్చింది. 'మా నాన్న సూపర్ హీరో' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్టుగా ఓ ఇంటర్వూలో సుధీర్ దీనిపై స్పందించారు. తన నేమ్ ట్యాగ్ వెనకున్న కథను వివరించారు.

"హరోం హర డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకకు నా స్టార్ ట్యాగ్ నచ్చలేదు. నేను ఒక మంచి సినిమా తీస్తాను. లాస్ట్ లో 'నవ దళపతి' అనే కొత్త పేరు వేస్తున్నానని నాకు ముందే చెప్పాడు. మీరు కంటిన్యూ చేస్తానంటే చేయండి సార్ అని అన్నాడు. నేనైతే ఆ ట్యాగ్ కంటిన్యూ చెయ్యండని ఆపేయండి అని నేనెప్పుడూ చెప్పలేదు. కానీ నాకు దానిపై అభ్యంతరం లేదు. మనల్ని ఇంట్లో అందరూ ఇష్టంగా రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. ఇప్పుడు అందరూ నన్ను ఈ పేరుతోనే పిలవండని నేను అడగడం లేదు. నన్ను ఇష్టపడే వారు పిలుస్తారు. పిలవకపోయినా నాకు ప్రాబ్లం లేదు. సుధీర్ అని పిలిచినా నాకు హ్యాపీ. అసలు పేరుతో కాకుండా నా సినిమాలో క్యారక్టర్ నేమ్ తో పిలిస్తే ఇంకా హ్యాపీ" అని సుధీర్ బాబు అన్నారు.

మరో ఇంటర్వూలో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఫస్ట్ సినిమా నుంచే తనకు ఏదొక ట్యాగ్ పెడదామని చెబుతూనే వస్తున్నారని అన్నారు. కెరీర్ ప్రారంభంలో ఒక ప్రొడ్యూసర్ 'ప్రైమ్ స్టార్' అనే పేరు పెట్టారని, కానీ తాను వద్దని చెప్పానని వెల్లడించారు. ప్రేమతో తనను 'నవ దళపతి' అని పిలుచుకుంటున్నప్పుడు తనకు అభ్యంతరం ఏమీ లేదని, ఎందుకంటే నచ్చినవారు పిలుస్తారు నచ్చనివారు పిలవరని అన్నారు. "హరోం హర లాంటి యాక్షన్ మూవీని మోయడం అంత ఈజీ కాదు. అది ఎంత హిట్టయింది అనేది పక్కన పెడితే, ఆడియన్స్ నన్ను ఆ యాక్షన్ రోల్ లో యాక్సెప్ట్ చేశారు. సమ్మోహనం, భలే మంచి రోజు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాల్లో యాక్సెప్ట్ చేశారు" అని సుధీర్ అన్నారు.

"నాకు 'నవ దళపతి' ట్యాగ్ లైన్ పెట్టినాయన నాతో మాట్లాడుతూ 'ఇలాంటి వర్సటైల్ రోల్స్ చేశారు. నువ్వు సరిగా చెయ్యలేదని, సూట్ కాలేదని ఎవరూ అనలేదు. కమర్షియల్ గా 100 కోట్లు 200 కోట్లు చేస్తేనే ట్యాగ్స్ పెట్టాలా? యాక్టర్ గా బాగా పెర్ఫామ్ చేసి ప్రూవ్ చేసుకున్నప్పుడు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు పెట్టుకోవాలా? మీకు ఈ ట్యాగ్ ఇవ్వాలని నాకు అనిపించింది. ప్రేమతో పెడుతున్నాను. మీకు కంటిన్యూ చెయ్యాలనిపిస్తే చేయండి' అని అన్నారు. నాకు తప్పేమీ అనిపించలేదు. మీకు నచ్చింది నిజాయితీగా ప్రేమతో పెట్టండి అన్నాను" అని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. అయితే 'మా నాన్న సూపర్ హీరో' సినిమాలో మాత్రం తన పేరుకు 'నవ దళపతి' ట్యాగ్ పెట్టకపోవచ్చని అన్నారు.

ఇదిలా ఉంటే సుధీర్ బాబు హీరోగా నటించిన 'మా నాన్న సూపర్ హీరో' సినిమా దసరా సందర్భంగా థియేటర్లలోకి రాబోతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది.