Begin typing your search above and press return to search.

సుధీర్ బాబుకు కొత్త ట్యాగ్.. ఇకపై ఇలానే పిలవాలట

అయితే కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఘట్టమనేని అల్లుడు.

By:  Tupaki Desk   |   14 Jun 2024 5:51 AM GMT
సుధీర్ బాబుకు కొత్త ట్యాగ్.. ఇకపై ఇలానే పిలవాలట
X

దివంగత సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ స్పెషల్ ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు. మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఘట్టమనేని అల్లుడు.

తాజాగా సుధీర్ బాబు హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కుప్పం బ్యాక్ డ్రాప్ లో 1980sలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డైరెక్టర్ జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కించారు. సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుమంత్ జి.నాయుడు గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. సునీల్, జయ ప్రకాష్, అక్షర, రవి కాలే, అర్జున్ గౌడ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

గురువారం రాత్రి ఈ సినిమా ప్రీమియర్ షో మేకర్స్ వేయగా.. డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. అయితే టాలీవుడ్ లో అందరి హీరోస్ కు ఉన్నట్టుగానే సుధీర్ బాబుకు కూడా నైట్రో స్టార్ అనే ట్యాగ్ ఉంది. గత కొన్ని సినిమాల్లో ఆయన పేరు ముందు అదే ట్యాగ్ పడుతుంది. కానీ హరోం హర మూవీ ప్రమోషన్స్ టైమ్ లో.. ఆ సినిమా డైరెక్టర్ జ్ఞాన సాగర్ ద్వారక.. సుధీర్ బాబుకు కొత్త ట్యాగ్ ఇస్తున్నామని, రిలీజ్ అయ్యాక అదేంటో చూడాలని చెప్పారు.

ఇప్పుడు హరోం హర మూవీ రిలీజ్ అయ్యాక.. సిల్వర్ స్క్రీన్ పై టైటిల్స్ వచ్చే సమయంలో 'నవ దళపతి' సుధీర్ బాబు అని పడింది. అంటే ఇక నుంచి సుధీర్ బాబు పేరు ముందు నవ దళపతి ట్యాగ్ ఉండనుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నైట్రో స్టార్ ట్యాగ్ తనకు ఇష్టం లేదని ఇన్ డైరెక్ట్ గా తెలిపారు సుధీర్ బాబు. అందుకే హరోం హర మేకర్స్ సుధీర్ బాబు ట్యాగ్ మార్చి ఉంటారని నెటిజన్లు చెబుతున్నారు.

ఇక టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోలకు ట్యాగ్ లు ఉన్న విషయం తెలిసిందే. అయితే కొందరి హీరోల ట్యాగ్స్ ఈ మధ్య మారుతున్నాయి. కొన్ని మేకర్స్ ఇస్తుంటే.. మరికొన్ని అభిమానులు మార్చేస్తున్నారు. ఇటీవల యంగ్ హీరో శర్వానంద్ కు ఛార్మింగ్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు మనమే మూవీ మేకర్స్. ఇప్పుడు సుధీర్ బాబుకు నవ దళపతి ట్యాగ్ ఇచ్చారు హరోం హర మేకర్స్. మరి ఈ ట్యాగ్ ఆయనకు ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాలి.