Begin typing your search above and press return to search.

మాలీవుడ్ ప‌ని వాతావ‌ర‌ణంపై సుహాసిని మ‌ణిర‌త్నం వ్యాఖ్య‌లు!

గోవాలోని 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)-2024 ఉత్స‌వాలు ర‌క్తి క‌ట్టిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   24 Nov 2024 3:00 AM GMT
మాలీవుడ్ ప‌ని వాతావ‌ర‌ణంపై సుహాసిని మ‌ణిర‌త్నం వ్యాఖ్య‌లు!
X

గోవాలోని 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)-2024 ఉత్స‌వాలు ర‌క్తి క‌ట్టిస్తున్నాయి. ఈ వేదిక‌పై దిగ్గ‌జాలు త‌మ అమూల్య‌మైన అనుభ‌వాల‌ను ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ కోసం షేర్ చేస్తుంటే అవ‌న్నీ అబ్బ‌రుప‌రుస్తున్నాయి. ఇక ఇఫీలో మొదటి ప్యానెల్ చర్చ మహిళల భద్రత అనే టాపిక్ తో ప్రారంభమైంది. న‌టి కం నిర్మాత వాణీ త్రిపాఠి టికూ సార‌థ్యంలోని ఈ సెషన్‌లో బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత ఇంతియాజ్ అలీ స‌హా సుహాసిని మణిరత్నం, కుష్బూ సుందర్, భూమి పెడ్నేకర్ త‌దిత‌రులు చిత్ర పరిశ్రమలో మహిళల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించారు.

చ‌ర్చా స‌మావేశంలో ఇతర చిత్ర పరిశ్రమలతో పోల్చితే మలయాళ చిత్ర పరిశ్రమ అంత‌గా సురక్షితం కాదని సుహాసిని మ‌ణిర‌త్నం నొక్కి చెప్పార‌ని ప్ర‌ఖ్యాత మ‌ల‌యాళ మ‌నోర‌మ త‌న క‌థ‌నంలో ప్ర‌చురించింది. మలయాళ చిత్రాలను ఎక్కువగా ఒరిజిన‌ల్ లైవ్ లొకేషన్‌లో చిత్రీకరిస్తారు కాబట్టి న‌టీమ‌ణులు ఎక్కువ కాలం ఇళ్లకు దూరంగా ఉంటారని సుహాసిని అన్నారు. సీనియ‌ర్ న‌టీమ‌ణి సుహాసిని మాట్లాడుతూ ``ఇతర పరిశ్రమలకు, సినిమా పరిశ్రమకు తేడా ఉంది. ఇతర పరిశ్రమలలో మీరు పనికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తారు. కానీ సినిమాల విషయంలో జరిగేది వేరు. దాదాపు 200-300 మంది ఒక ప్రదేశానికి వెళ్లి అక్కడ కుటుంబ సమేతంగా జీవిస్తున్నారు. కొన్నిసార్లు ఇష్టపూర్వకంగా లేదా ఇష్టం లేకుండా లైన్ దాటేవాళ్లు ఉంటారు. సాధారణ యూనిట్‌లో అక్కడ ఉన్న ఈ 200 మంది వ్యక్తులు ఎవరు? వారు కుటుంబానికి దూరంగా ఉన్నారనే వాస్తవాన్ని సద్వినియోగం చేసుకునే వారు కొంద‌రు వ్యక్తులు ఉంటారు. దుర్వినియోగ‌ప‌రిచే వారు ఉంటారు. పరిశ్రమలో యువకులు ఉన్నారు.. పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దాని గురించి అనుభవం లేదు.. కాబట్టి వారు ప్రయోజనం పొందాల‌ని చూస్తారు! అని సుహాసిని అన్నారు.

సుహాసిని తన భర్త, దర్శకుడు మణిరత్నంను `లైన్ దాటే వ్య‌క్తులను ఎలా హ్యాండిల్ చేస్తారు?` అని అడిగినప్పుడు, అతడు త‌న సినిమా నుంచి అలాంటి వ్యక్తులను తొలగిస్తాన‌ని చెప్పారు. ``అలాంటి వారిని చాలా మందిని బయటకు విసిరేయాలి`` అన్నారు. నిబంధనలు లేకుండా ఒక గ్రామంలో 200 మంది ఉంటే అక్కడ లైన్ దాటుతారు. ఇదే అస‌లు సమస్య. మలయాళ పరిశ్రమలో కూడా ఇదే పరిస్థితి ఉంది! అని సుహాసిని మ‌ణిర‌త్నం తెలిపారు.

చాలా తమిళ సినిమాలు చెన్నైలో, కన్నడ సినిమాలు బెంగళూరులో, తెలుగు సినిమాలు హైదరాబాద్‌లో, హిందీ చిత్రాలను ముంబైలో చిత్రీకరిస్తున్నార‌ని సుహాసిని తెలిపారు. అదే సమయంలో మలయాళ చిత్రాలను నిర్దిష్ట ప్రదేశంలో చిత్రీకరించడం లేదని, కాబట్టి సిబ్బంది ఇంటికి వెళ్లడం లేదని సుహాసిని వ్యాఖ్యానించారు. మ‌ల‌యాళ న‌టులు ఎక్కువ సేపు అవుట్‌డోర్ షూట్‌లలో ఉండాల్సి వస్తుంది. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో న‌టీన‌టులు షూటింగ్ పూర్త‌య్యాక త‌మ ఇండ్ల‌కు వెళ్లిపోతార‌ని . కానీ మలయాళ ప‌రిశ్ర‌మ‌లో వారు ఇంటికి తిరిగి వెళ్లే అవ‌కాశం లేద‌ని సుహాసిని మ‌ణిర‌త్నం తెలిపారు. బ‌హుశా ఒకే చోట అంత‌మంది ఉండి ప‌ని చేస్తారు కాబ‌ట్టి స‌రిహ‌ద్దు రేఖ‌ను దాటార‌ని కూడా సుహాసిని మ‌ణిర‌త్నం వ్యాఖ్యానించిన‌ట్టు `మ‌ల‌యాల మ‌నోర‌మ` త‌న క‌థ‌నంలో ప్ర‌చురించింది.