పరువు పోతుందని ఎవరికీ చెప్పలేదు
ఇప్పుడు సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా తనకున్న అనారోగ్య సమస్యల గురించి వెల్లడించింది.
By: Tupaki Desk | 26 March 2025 6:11 AMకష్టాలు, సుఖాలు, బాధలు, ఆరోగ్య సమస్యలు వీటికి ఎవరూ అతీతులు కాదు. మనలాగే సెలబ్రిటీలకు కూడా కష్టాలు, బాధలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాకపోతే కొంతమంది బయటపడి చెప్పరు. కొంతమంది చెప్తారు అంతే తేడా. ఈ డిజిటల్ యుగంలో ఎవరూ తమ సమస్యల్ని దాచాలనుకోవడం లేదు. తమ ఇబ్బందుల్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు.
కొన్నాళ్ల కిందట సమంత తాను మోయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో షేర్ చేసి సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకుని తిరిగి సినిమాల్లోకి వచ్చింది. సమంతనే కాదు, ఎంతోమంది సెలబ్రిటీలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మొన్నటికి మొన్న సీనియర్ నటి లైలా కూడా తను నవ్వుతూ లేకపోతే వెంటనే కళ్లలో నుంచి నీళ్లొచ్చేస్తాయని, అదొక వింత రోగం అని చెప్పి షాకిచ్చింది.
ఇప్పుడు సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా తనకున్న అనారోగ్య సమస్యల గురించి వెల్లడించింది. ఒకప్పుడు సౌత్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన సుహాసిని ఇప్పుడు తల్లి పాత్రలు చేస్తూనే మరోవైపు తన భర్త మణిరత్నం చేస్తున్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంది. రీసెంట్ గా సుహాసిని ఓ ఇంటర్వ్యూలో తాను టీబీ జబ్బుతో బాధపడుతున్నట్టు చెప్పుకొచ్చింది.
ఈ విషయం బయటకు చెప్తే తన పరువు పోతుందేమోననే భయంతో ఎక్కడా రివీల్ చేయలేదని సుహాసిని తెలిపింది. తన సమస్యను సీక్రెట్ గా ఉంచి, ఎవరికీ తెలియకుండానే ఆరు నెలల పాటూ దానికి ట్రీట్‌మెంట్ తీసుకున్నానని చెప్పిన ఆమె, కొన్నాళ్ల తర్వాత విషయం అందరికీ చెప్పి, టీబీ గురించి సమాజానికి అవగాహన కల్పించాలనుకున్నట్టు సుహాసిని చెప్పింది.
సుహాసిని తన ఆరోగ్య సమస్యను బయటపెట్టిన తర్వాత ఆమె అభిమానులు జాగ్రత్తగా ఉండమని కోరుతూ మెసెజ్‌లు పెడుతుంటే, మరికొందరు అందరికీ సమస్యలున్నాయి, ఆ విషయంలో పరువు ఎందుకు పోతుందని కామెంట్ చేస్తున్నారు. 1980లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాసినికి కమల్ హాసన్ బాబాయి అవుతాడు. 1988లో సుహాసిని డైరెక్టర్ మణిరత్నంను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.