సుహాస్.. రిస్క్ తీసుకుంటున్నాడా?
నటుడిగా ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుహాస్ తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో యూత్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యాడు
By: Tupaki Desk | 15 Feb 2024 4:54 AM GMTయంగ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ కమెడియన్ గా టాలీవుడ్ లో కెరియర్ స్టార్ట్ చేశాడు. ఒక్కో అడుగు వేసుకుంటూ హీరో ఫ్రెండ్ పాత్రలలో చేస్తూ మెప్పిస్తూ వచ్చాడు. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీని తర్వాత కూడా ఓ వైపు కమెడియన్ గా చేస్తూనే హిట్ 2 లాంటి సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో మెప్పించాడు.
నటుడిగా ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుహాస్ తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో యూత్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. రైటర్ పద్మభూషణ్ సినిమాతో హీరోగా మరో సక్సెస్ ని కూడా అందుకున్నాడు. తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో డీసెంట్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. లో బడ్జెట్ లో రియాలిటీకి దగ్గరగా ఉండే కథలకి సుహాస్ ఇప్పుడు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు.
కొత్త దర్శకులు తమని తాము కొత్తగా రిప్రజెంట్ చేసుకోవడానికి రియలిస్టిక్ కథలని ఎంచుకుంటారు. వీళ్ళకి సుహాస్ ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్ గా ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతం అతను హీరోగా ఓ మూడు సినిమాల వరకు లైన్ లో ఉన్నాయి. వాటిలో దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా ఉండటం విశేషం. హీరోగా వరుస అవకాశాలు వస్తూ ఉండటంతో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కి సుహాస్ ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాడంట.
గతంలో చాలా మంది కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారారు. ఇప్పుడు వారి దారిలోనే సుహాస్ కూడా హీరోగా సక్సెస్ ట్రాక్ ఎక్కే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఒకే తరహాలో క్యారెక్టర్స్ కాకుండా కొత్తగా కథలతో సినిమాలు చేసుకుంటూ వెళ్తే టాలీవుడ్ కి సుహాస్ రూపంలో మరో నేచురల్ స్టార్ దొరికినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.
సక్సెస్ వచ్చింది కదా అని కమర్షియల్ సినిమాలు, యాక్షన్ మూవీస్ అంటూ ట్రై చేస్తే మాత్రం గతంలో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల తరహాలోనే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అతని సినిమాల ఎంపిక ఎలా ఉంటుందనే దానిని బట్టి హీరోగా అతని కెరియర్ ఆధారపడి ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి సుహాస్ ఈ అవకాశాన్నీ ఎలా యూజ్ చేసుకుంటాడో.