స్పెషల్ స్టోరీ: సుకుమార్ సినిమాలు.. చంద్రబోస్ పాటలు..!
ఇక టాలీవుడ్ లో డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, లిరిసిస్ట్ చంద్రబోస్ లది సూపర్ హిట్ కాంబినేషన్.
By: Tupaki Desk | 10 Dec 2024 6:49 AM GMTతెలుగు సినీ సాహిత్యంలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న గీత రచయిత చంద్రబోస్. గత మూడు దశాబ్దాలుగా ఎన్నో పాటలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన ఆయన, తన లిరిక్స్ తో సంగీత ప్రియులను పరవశింపజేశారు. తెలుగు సాహిత్యాన్ని ఆస్కార్ అవార్డ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వేదికల మీదకు తీసుకెళ్లారు. అలా సందర్భం చెబితే చాలు, ఇలా పాటను పలికించడంలో దిట్ట చంద్రబోస్. నేపథ్యానికి తగ్గట్టుగా, అందరూ పాడుకునేలా అర్థవంతమైన సరళమైన పదాలతో పాట రాయడం ఆయన ప్రత్యేకత. ఇక టాలీవుడ్ లో డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, లిరిసిస్ట్ చంద్రబోస్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో ఇప్పటి వరకూ వచ్చిన సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు ''పుష్ప 2'' వంటి మరో సూపర్ హిట్ ఆల్బమ్ తో వచ్చారు.
సుకుమార్ సినిమాలలో సందర్భాలు ఎంత బలంగా ఉంటాయో, ఆ సందర్భాల్లో వచ్చే పాటలు ఎంత ఉద్వేగభరితంగా ఉంటాయో, ఎంత భావోద్వేగాన్ని కలిగిస్తాయో, ఎంత భావ యుక్తంగా ఉంటాయనేది మనందరికీ తెలిసిందే. ఆయన సినిమాల్లో సందర్భానుసారంగా వచ్చే పాటల్లో వినిపించే చంద్రబోస్ సాహిత్యం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. 'ఆర్య' చిత్రంలో "ఫీల్ మై లవ్" అని రాసినా.. 'ఆర్య 2'లో ''బేబీ హి లవ్స్ యూ'', ''మై లవ్ ఈజ్ గాన్'' అని రాసినా యువ హృదయాలు పులకించిపోయాయి. 'జగడం' మూవీలో ''వైలెన్స్ ఈజ్ ఫ్యాషన్'' అని చెప్పిన చంద్రబోస్.. "ము ము ముద్దంటే చేదా", ''5 ఫీట్ 8 ఇంచెస్'', ''ఎవెరీబడీ రాక్ యూ బాడీ'' లాంటి వేటికవే ప్రత్యేకమైన పాటలు రచించారు. '100 % లవ్' కోసం ఆయన రాసిన ''ఇన్ఫాచ్యుయేషన్'', ''దూరం దూరం'', ''డియాలో డియాలో'' పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో మనం చూశాం.
ఇదే క్రమంలో సుకుమార్ తెరకెక్కించిన '1-నేనొక్కడినే', 'రంగస్థలం', 'పుష్ప: ది రైజ్', 'పుష్ప 2: ది రూల్' వంటి చిత్రాలలోని పాటలన్నీ చంద్రబోస్ సింగిల్ కార్డులో రాసారు. 'రంగస్థలం'లోని పాటలు, పాటల్లోని సాహిత్యం సినిమా విజయానికి మూలస్తంభాలుగా నిలిచాయనడంలో సందేహం లేదు. ''ఎంత సక్కగా ఉన్నవే'', ''రంగా రంగ రంగస్థలాన'', ''ఓరయ్యో నా అయ్యా'', ''ఆ గట్టునుంటావా'', ''రంగమ్మా మంగమ్మా'', ''జిగేల్ రాణి''.. ఇలా అన్ని పాటలూ జనాలకు ఎంతగానో చేరువయ్యాయి. ఈ పాటలు సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటలు అప్పటికి తెలుగు సినిమా సాహిత్యంలో చిన్న కుదుపులాంటిది అని చెప్పాలి.
'రంగస్థలం' కోసం వాడుక భాషలో జన బాహుళ్యానికి దగ్గరగా ఉండే మాటలతో, జనాలు మాట్లాడునే భాషలో చంద్రబోస్ రాసిన సాహిత్యం పాటలకి కావ్య గౌరవాన్ని కల్పించింది. ఒక రకంగా తెలుగు సినీ సాహిత్యంలో నూతన ఒరవడిని తీసుకొచ్చింది. ఏదో బాణీలకు పదాలు నప్పేలా లిరిక్స్ రాయడం కాకుండా.. ఆ బాణీలకి మరింత అందం తీసుకొచ్చే విధంగా, భావాలకు పెద్ద పీట వేస్తూ గొప్ప సాహిత్యం అందించారు చంద్రబోస్. ఆధునిక కాలంలో తెరకెక్కిన పీరియడ్ సినిమాలకు ఆధునిక భావాలకు అద్దంపట్టేలా లిరిక్స్ రాయడం అనేది.. ఆధునిక సాహిత్యంలో కీలక మలుపు అని చెప్పాలి. అందుకే ఈ పాటలు అశేష జనాదరణ పొంది, సినిమా విజయానికి దోహద పడ్డాయి.
'పుష్ప 1' తీసుకుంటే, ఒక విచిత్రమైన కథాంశంతో తీసిన ఈ సినిమాలోని పాటలకు చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం సమకూర్చారు. 'దాక్కో దాక్కో మేక' అంటూ ఆటవిక అరణ్య రీతిలో ప్రకృతి నియమాన్ని, ప్రకృతి ధర్మాన్ని ఉటంకిస్తూ పాట రాశారు. పుష్పరాజ్ పాత్ర ఎదుగుదలకు అభివృద్ధికి సమన్వయ పరుస్తూ, ఒక ఆహార చక్రానికి ముడిపెడుతూ ఈ లిరిక్స్ రాయడం విశేషం. ''వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకకు తింటది పులి, ఇది కదరా ఆకలి.. పులినే తింటది చావు, చావుని తింటది కాలం, కాలాన్ని తింటది కాళీ, ఇది మహా ఆకలి'' అంటూ ఒకదాని తర్వాత ఒకటి అంచలంచెలుగా ఆహార చక్ర క్రమాన్ని వివరిస్తూ ఎంతో అద్భుతంగా రాశారు.
''వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి.. దొరికిందా ఇది సస్తాది.. దొరక్కపోతే అది సస్తాది.. ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే'' అంటూ గొప్పగా వివరించారు చంద్రబోస్. అలానే ''చేపకు పురుగు ఎరా.. పిట్టకు నూకలు ఎరా.. కుక్కకు మాంసం ముక్క ఎరా.. మనుషులందరికీ బతుకే ఎరా.. దేవతకైనా తప్పదు ఎర.. ఇది లోకం తలరాతరా.. ఏమరపాటుగా ఉన్నావా.. ఎరకే చిక్కేస్తావు, ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు.. కాలే కడుపు సూడదురో నీతి న్యాయం.. బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టారాజ్యం'' అంటూ ప్రకృతి ధర్మాన్ని పుష్పరాజ్ పాత్రకు అనుసంధానిస్తూ ఆయన రాసిన 'దాక్కో దాక్కో మేక' పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జీవితాన్ని నమిలేసిన వాళ్లే ఇలాంటి అంతరార్థం ధ్వనించే లిరిక్స్ రాయగలరు.
అదే విధంగా 'శ్రీవల్లి' పాట విషయానికొస్తే, ఎంతో పౌరుషం ఉన్నా ఎవరికీ తలవంచని వ్యక్తి అయినా సరే ఒక అమ్మాయి ముందు తలవంచుతాడని చంద్రబోస్ లిరిక్స్ రాసారు. అయితే ఆమెకు తలవంచానని, ఆమెను ఆరాధిస్తున్నానని చెప్పకుండానే.. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ప్రియురాలికి తన ప్రేమను వ్యక్త పరచడం అనేది ఈ పాటలో ఉన్న విశిష్టత. ''నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు.. పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు.. ఎర్రచందనం చీర కడితే.. రాయి కూడా రాకుమారే'' అంటూ ఓవైపు అమ్మాయి ఏమంత అందంగా ఉండవని చెబుతూనే.. ''చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే.. నవ్వే నవరత్నమాయెనే'' అంటూ ఆమెను పొగడుతూ సాహిత్యం రాయడం చంద్రబోస్ కే చెల్లింది.
'సామీ సామీ' పాటలో అమ్మాయి తనలోని ప్రేమను అభిమానాన్ని ఆరాధనా భావాన్ని ఎంతో అందంగా తన సాహిత్యరూపంలో వినిపించారు చంద్రబోస్. ''నీ యెనకే యెనకే అడుగేస్తాంటే ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామీ.. నీ పక్కా పక్కనే కూసుంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిర సామీ.. నువ్వెళ్లే దారే సూత్తా ఉంటే ఏరే ఎండినట్టుందిరా సామీ నా సామీ'' అంటూ ఒక యువతి తన ప్రేమ భావాన్ని చెప్పిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ''ఊ అంటావా.. ఊఊ అంటావా'' పాట ప్రతీ మగవాడిలోని చీకటి కోణాన్ని, మగవారి తత్వాన్ని వివరిస్తుంది. మగవారి నిజ స్వరూపాన్ని చెబుతూ, వారిలోని చెడు బుద్ధిని తన సాహిత్యంతో ఎండగట్టారు చంద్రబోస్. అందుకే ఈ పాట పాన్ ఇండియాని ఊపేసింది. గ్లోబల్ యూట్యూబ్ చార్ట్ లో 8 నెలలు మొదటి స్థానంలో ఉందంటే ఈ సాంగ్ ఎంత గొప్ప స్థాయికి వెళ్లిందో అర్థమవుతుంది. ఒక తెలుగు పాట ప్రపంచ వ్యాప్తంగా అన్ని నెలల పాటు ట్రెండింగ్ లో ఉండటం అంటే మామూలు విషయం కాదు.
ఇలా 'పుష్ప: ది రైజ్' కోసం చంద్రబోస్ రాసిన పాటలన్నీ ఎంత పెద్ద హిట్టయ్యాయో, సినిమా విజయానికి ఎంతగా దోహదం చేశాయో మనం చూసాం. ఇప్పుడు ''పుష్ప 2: ది రూల్'' చిత్రంలోని అన్ని పాటలకూ ఆయనే లిరిక్స్ రాసారు. ''పుష్ప పుష్ప'' టైటిల్ సాంగ్ లో పుష్పరాజ్ ఎదిగిన తర్వాత అతని నైజాన్ని, తనలోని ధైర్యాన్ని గాంభీర్యాన్ని తెలియజేసేలా.. పుష్పరాజ్ ఎదిగిన క్రమాన్ని తనకు తానే స్వగతంలో చెప్పుకునేట్లుగా సాహిత్యం అందించారు. ''గువ్వపిట్ట లాగ వానకు తడిసి, బిక్కుమంటు రెక్కలు ముడిసి, వణుకుతు వుంటే నీదే తప్పవదా.. పెద్ద గద్దలాగమబ్బులపైన, హద్దు దాటి ఎగిరావంటే, వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురిసెయ్‍దా.. నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే.. నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే'' అంటూ పుష్పరాజ్ పాత్ర ఔనత్యాన్ని కవిత్వం రూపంలో ఎంతో అందంగా చెప్పారు.
''తల దించినావా బానిసవి, ఎత్తినావా బాద్‍షావి, తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా'' అంటూ ప్రపంచానికి పుష్పరాజ్ తత్వాన్ని ఈ పాట ద్వారా చాటిచెప్పారు చంద్రబోస్. ''ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే బండరాయి కూడా బంగారు సింహాసనమంటా.. వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా.. ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే తుపాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే, ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే'' అంటూ సినిమాలో ఆ పాత్ర గురించి ఈ ఒక్క పాటతోనే తెలియజెప్పారు. ''పీలింగ్స్'' సాంగ్ విషయానికొస్తే, అంత సహజత్వంతో కూడిన కవిత్వం ఈమధ్య కాలంలో రాలేదనే చెప్పాలి.
''రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు.. పైటతోటి సెమట నువ్వు తుడుసుకున్నప్పుడు.. దండాన నీ సొక్క ఆరేస్తున్నప్పుడు.. నీ వొంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు.. రెండు సేతుల నీ జుట్టు ముడిసినప్పుడు.. దిండుకత్తుకొని పడుకున్నప్పుడు.. అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు.. వచుండాయ్ పీలింగ్స్.. తువ్వాలుతో నా తలను తుడిసినప్పుడు.. నడుమ నడుమ నువ్వు నా నడుము తురిమినప్పుడు.. అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు.. ఎంగిలి మూతి తో నువ్వు ముద్దు పెట్టినప్పుడు.. సీర సెంగుని నువ్వు సవరించినప్పుడు.. సాయం సేత్తో సెయ్యేసినప్పుడు.. సొంత మొగుడు సెంత సిగ్గు పడినప్పుడు.. వచుండాయ్ పీలింగ్స్''.. ఇంత నేచురల్ గా రాసిన ఒక రొమాంటిక్ సాంగ్ ను మనం ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో చూడగలమా?
అలానే సినిమాలో సందర్భోచితంగా వచ్చే 'సూసేకి' పాటకి కూడా చంద్రబోస్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. భర్తతో ఉన్న అనుబంధాన్ని భార్య ఒక పాట రూపంలో పాడుకునేలా ఎంతో చక్కగా లిరిక్స్ రాశారు. ''రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా.. కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు.. మీసమెనక ముసురుకున్నముసినవ్వు నాకు తెలుసు.. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే మీకు తెలుసు.. కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు.. పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు.. వాడి చొక్కా ఎక్కడుందో వెతకమంటాడు సూడు.. బయటికి వెళ్లి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు.. నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు'' అంటూ ఒక భార్య తన భర్త గొప్పదనాన్ని, భర్త హృదయంలోని తడి తనకు మాత్రమే తెలుసు అంటూ వివరించే సందర్భాన్ని చంద్రబోస్ చాలా చక్కగా సహజంగా, గమ్మత్తైన పదాలతో తెలియజేసారు. ఈ పాట సినిమాలో ఏవిధంగా ఓ వెలుగు వెలిగిందో తెలిసిందే.
చంద్రబోస్ రాసిన 'కిస్సిక్' సాంగ్.. 'ఊ అంటావా మావా' రేంజ్ లో ఊపేస్తోంది. ''భుజం పైన సెయ్యేసి తీసుకో.. సేతులు తిన్నగా వుండకపోతే దెబ్బలు పడతయిరో.. సింగల్ ఫోటో పర్లేదు, రంగుల ఫోటో పర్లేదు, గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమి లేదు.. కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ సేసారో.. దెబ్బలు పడతయి రాజా.. తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా సూసుకో.. కళ్ళకు పండగ సేసుకో కాదనేది లేదు.. కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి పిచ్చి పిచ్చి వేషాలు ఏసారో దెబ్బలు పడతాయ్'' అంటూ ఆధునిక భావాలు కలిగిన ఓ యువతి తనతో ఫోటో దిగితే అభ్యంతరం లేదు కానీ, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకోను అని చెబుతున్నట్లుగా లిరిక్స్ రాశారు.
ఇలా 'పుష్ప 2' చిత్రంలోని ప్రతీ పాటకు చంద్రబోస్ తన సాహిత్యంతో ప్రాణం పోసారు. ఇప్పుడు ''పుష్ప: ది రూల్'' సినిమా బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి పాటలు, పాటల్లోని సాహిత్యం కూడా ప్రధాన కారణమయ్యాయి. ఈ సినిమా అనే కాదు, ఇటీవల కాలంలో ఎన్నో సినిమాల విజయాలలో ఆయన సాహిత్యం కీలక భూమిక పోషించింది. ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ కలం నుంచి జనం మెచ్చే మరిన్ని అద్భుతమైన పాటలు రావాలని, తన లిరిక్స్ తో సంగీత సాహిత్య ప్రియులను రంజిపజేయాలని, దర్శకుడు సుకుమార్ తో ఆయన ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుందాం..!