సుకుమార్.. ది ఆర్కిటెక్ట్ ఆఫ్ బ్లాక్ బస్టర్ యాక్షన్..!
సుకుమార్ కెరీర్ ప్రారంభం నుండి సరికొత్త స్టోరీలను, డిఫెరెంట్ స్క్రీన్ ప్లేతో తెర మీద ఆవిష్కరిస్తూ తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 11 Jan 2025 12:27 PM GMTలెక్కల మాస్టర్ సుకుమార్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తున్నాడు. ఆయన తెరకెక్కించిన ''పుష్ప 2: ది రూల్" మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1,850 కోట్ల వసూళ్లతో ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటున్న సుక్కూ.. నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జీనియస్ డైరెక్టర్ సినీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.
సుకుమార్ కెరీర్ ప్రారంభం నుండి సరికొత్త స్టోరీలను, డిఫెరెంట్ స్క్రీన్ ప్లేతో తెర మీద ఆవిష్కరిస్తూ తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. 2004లో 'ఆర్య' చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైనప్పుడు, మంచి యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాలు తీయగల సామర్థ్యమున్న అర్బన్ ఫిల్మ్ మేకర్ అని అంతా భావించారు. కానీ ఆ వెంటనే 'జగడం' వంటి సబ్టిల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం అల్లు అర్జున్ తో 'ఆర్య 2' వంటి స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించారు.
నాగ చైతన్యతో తీసిన '100% లవ్' సినిమాతో స్టోరీ టెల్లింగ్‌లో మాస్టర్ అనిపించుకున్నారు సుకుమార్. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా '1- నేనొక్కడినే' వంటి టిపికల్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీతో మెస్మరైజ్ చేసాడు. జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందించిన 'నాన్నకు ప్రేమతో' సినిమా మరోసారి అతనిలోని జీనియస్ ఫిలిం మేకర్ ను ఆవిష్కరించింది. 2018లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన 'రంగస్థలం' సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, ఒక క్లాసిక్ స్టేటస్ అందుకుంది.
ఇక మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమా సుకుమార్‌ను మరింత ఎత్తుకు చేర్చింది. ఇది దర్శకుడికి ఫస్ట్ పాన్-ఇండియన్ మూవీ. హిందీ బెల్ట్‌లో వంద కోట్లకు పైగా సాధించిన సంచలన విజయం సాధించింది. ఆయన క్రియేట్ చేసిన పుష్పరాజ్ పాత్ర అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయింది. దీంతో సెకండ్ పార్ట్ మీద నెలకొన్న అంచనాలను దృష్టిలో ఉంచుకొని, 'పుష్ప 2: ది రూల్' తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని భాషల్లోనూ అల్లకల్లోలం సృష్టించింది.
ఆడియన్స్ పల్స్ తెలుసుకొని సినిమాలు తీసే అతికొద్ది మంది దర్శకులలో సుకుమార్ ఒకరని చెప్పాలి. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే సినిమాలు తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. లార్జర్ దెన్ లైఫ్ క్యారక్టర్స్ తో, అన్ని రకాల అంశాలను ఒకే సినిమాలో చూపించి మెప్పించగల దర్శకుడు సుక్కు. 'పుష్ప 2' తర్వాత రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆయన ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరెన్నో అధ్బుతమైన విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.