Begin typing your search above and press return to search.

'ఆర్య' పై సుకుమార్ ఆశలు కోల్పోయిన వేళ..

బన్నీని చూడగానే ఇతనే తన హీరో అని సుకుమార్ ఫిక్స్ అయ్యాడని.. కథ చెప్పాక బన్నీకి చాలా నచ్చినప్పటికీ, అల్లు అరవింద్ ఈ కథ మీద ఇంకా వర్క్ చేసి మళ్లీ నరేషన్ ఇవ్వడమన్నాడని

By:  Tupaki Desk   |   8 May 2024 5:30 PM GMT
ఆర్య పై సుకుమార్ ఆశలు కోల్పోయిన వేళ..
X

ఆర్య.. తెలుగు సినీ చరిత్రలో ఒక సంచలనం. లవ్ స్టోరీస్‌లో ఒక కొత్త ఒరవడి సృష్టించి అప్పట్లో బ్లాక్‌బస్టర్ అయిందీ చిత్రం. సుకుమార్ లాంటి మేటి దర్శకుడు, అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్‌కు, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతకు.. ఇంకా చాలామందికి ఈ సినిమా గొప్ప కెరీర్ అందించింది.

ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ప్రత్యేక వేడుకలో టీం సభ్యులు అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దిల్ రాజు, సుకుమార్ కలిసి ఈ సినిమా జర్నీ గురించి వేదిక మీద కలిసి పంచుకున్న విషయాలు అత్యంత ఆసక్తి రేకెత్తించాయి. 'ఆర్య' లాంటి సెన్సేషనల్ కథ మీద సుకుమార్ ఒక దశలో ఆశలు కోల్పోయి దాన్ని పక్కన పెట్టే పరిస్థితి వచ్చినట్లు రాజు-సుకుమార్ కలిసి గుర్తు చేసుకున్నారు.

'దిల్' సినిమా షూటింగ్ జరుగుతుండగా సుకుమార్ తనకీ కథ చెప్పాడని.. ఎంతో కొత్తగా అనిపించిన ఆ కథ తనకెంతో నచ్చి 'దిల్' హిట్టయితే ఈ మూవీ చేద్దామని సుక్కుకు చెప్పానని.. 'దిల్' రిలీజ్ రోజు మార్నింగ్ షోకు సూపర్ హిట్ టాక్ రాగానే సుకుమార్ ఫోన్ చేశాడని.. దీంతో అతణ్ని ఊరు నుంచి రమ్మని చెప్పి ఈ కథను పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేశామని రాజు గుర్తు చేసుకున్నాడు.

ముందుగా రవితేజకు, ఆ తర్వాత ప్రభాస్‌కు కథ చెప్పామని.. కానీ వర్కవుట్ కాలేదని.. ఆపై బన్నీకి కథ చెప్పామని రాజు తెలిపాడు. బన్నీని చూడగానే ఇతనే తన హీరో అని సుకుమార్ ఫిక్స్ అయ్యాడని.. కథ చెప్పాక బన్నీకి చాలా నచ్చినప్పటికీ, అల్లు అరవింద్ ఈ కథ మీద ఇంకా వర్క్ చేసి మళ్లీ నరేషన్ ఇవ్వడమన్నాడని.. దీంతో సుకుమార్ ఢీలా పడిపోయి చెప్పిన పాఠాలే చెప్పలేక లెక్చరర్ ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చానని.. ఇలా మళ్లీ మళ్లీ కథ చెప్పలేనని అనేశాడని రాజు గుర్తు చేసుకున్నాడు.

ఒక టైంలో ఈ కథ మీద ఆశలు కోల్పోయిన సుక్కు.. వేరే కథ మీద వర్క్ చేయడం మొదలుపెట్టాడట. కానీ బన్నీ మాత్రం ఈ కథే కావాలని, ఇదే తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని భావించి దానికే కట్టుబడ్డాడడట. తనే ఈ కథను పాయింట్ల రూపంలో రాసుకుని దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్‌కు నరేషన్ ఇచ్చి ఆయనతో ఓకే చేయించుకున్నాక ఈ కథ సెట్స్ మీదికి వెళ్లిందని రాజు-సుక్కు గుర్తు చేసుకున్నారు.