కూతురిని అలా చూసి షాకైన సుకుమార్
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ బ్యానర్స్‌పై రూపొందిన గాంధీ తాత చెట్టు జనవరి 24న థియేటర్స్‌లో విడుదల కానుంది.
By: Tupaki Desk | 16 Jan 2025 4:43 PM GMTమైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ బ్యానర్స్‌పై రూపొందిన గాంధీ తాత చెట్టు జనవరి 24న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాలో దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేని ప్రధాన పాత్రలో నటించగా, పద్మావతి మల్లాడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సుకృతికి తల్లిదండ్రులుగా లావణ్య, ఆనంద్ చక్రపాణి వంటి నటి, నటులు నటించారు.
సుకృతి తన నటనలో అద్భుతంగా ప్రదర్శించిందని తండ్రిగా, దర్శకుడిగా సుకుమార్ గర్వంగా చెప్పుకొచ్చారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన రచ్చబండ ఈవెంట్ నిర్వహించారు. ఇక వేడుకలో మాట్లాడిన సుకుమార్, మొదట సుకృతి నటనా ప్రతిభపై తనకు అనుమానాలున్నాయని వెల్లడించారు. "ఇంట్లో అల్లరిగా ఉండే సుకృతి సినిమాలో నటించగలదా అని సందేహపడ్డాను. కానీ, దర్శకురాలు పద్మావతి మల్లాడి కథను వినిపించిన తర్వాత, సుకృతి నిజంగా ఈ పాత్రను చేయగలదని నమ్మకం కలిగింది. మొదటి క్లిప్ చూసినప్పుడు నేను షాక్ అయ్యాను," అని చెప్పారు.
గాంధీ తాత చెట్టు ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. ఈ సినిమాకు అనేక అవార్డులు లభించాయి. సుకృతి వేని బాలనటి విభాగంలో ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుటుంబ నేపథ్య కథతో పాటు ప్రకృతి ప్రేమను ప్రతిబింబించే ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగాలతో ఆకట్టుకుంటుందని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు.
సుకుమార్ భార్య తబితా సుకుమార్ మాట్లాడుతూ, "సుకృతి నటనపై మొదట నాకూ నమ్మకం లేదు. కానీ దర్శకురాలు పద్మావతి వర్క్ తో నమ్మకం కలిగింది. మైత్రీ మూవీ మేకర్స్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ సినిమా విజయవంతమవుతుందని అనిపించింది. అంతర్జాతీయ అవార్డులతో గుర్తింపు పొందిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం మా జీవితంలో గొప్ప అనుభూతి," అని భావోద్వేగంగా చెప్పారు.
సినిమా కథా రచన నుండి ప్రతి సన్నివేశం వరకు పద్మావతి చేసిన కృషిని సుకుమార్ ప్రశంసించారు. సినిమాలో సుకృతి వేని సరసన ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాష్, నేహల్ ఆనంద్ కుంకుమ తదితరులు నటించారు. సంగీతాన్ని రే అందించగా, ఛాయాగ్రహణం శ్రీజిత్ చెరువుపల్లి, విశ్వ దేవబత్తులలు నిర్వహించారు. సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, విశ్వ లిరిక్స్ అందించారు. ఇక జనవరి 24న విడుదల కానున్న గాంధీ తాత చెట్టు సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి తారాస్థాయికి చేరింది. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.