Begin typing your search above and press return to search.

రాజమౌళి & సుకుమార్.. ఇద్దరి మధ్య తేడా అదొక్కటే!

పాన్ ఇండియా డైరెక్టర్స్ గా వెలుగొందుతున్న ఎస్.ఎస్. రాజమౌళి, సుకుమార్ బండ్రెడ్డి మధ్య కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి.

By:  Tupaki Desk   |   12 Nov 2024 4:39 AM GMT
రాజమౌళి & సుకుమార్.. ఇద్దరి మధ్య తేడా అదొక్కటే!
X

పాన్ ఇండియా డైరెక్టర్స్ గా వెలుగొందుతున్న ఎస్.ఎస్. రాజమౌళి, సుకుమార్ బండ్రెడ్డి మధ్య కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఇద్దరూ సినిమాల విషయంలో పని రాక్షసులు అనే పేరు తెచ్చుకున్నారు. ఒక సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకొస్తారో.. దాన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారో అనే విషయాలని ఇద్దరూ చెప్పలేరు. ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం ప్రతీ ఫ్రేమ్ నూ చెక్కుతూ ఉంటారనే మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఒక సినిమా చేయడానికే రెండు మూడేళ్ళకు పైగానే సమయం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

సుకుమార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమై రెండు దశాబ్దాలు గడిచిపోయింది. కానీ ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. 20 ఏళ్ల సినీ కెరీర్ లో ఇప్పటి వరకూ కేవలం 9 సినిమాలను మాత్రమే తెరకెక్కించారు. తొమ్మిదో చిత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీన్ని బట్టే దర్శకుడు ఎంత స్లోగా వర్క్ చేస్తారనే సంగతి అర్థమవుతుంది. ప్రారంభం నుంచే సినిమా సినిమాకీ మినిమం రెండేళ్ల టైమ్ తీసుకుంటూ వస్తున్న సుక్కూ.. 'రంగస్థలం' తర్వాత మరీ స్లో అయిపోయారని చెప్పాలి.

'పుష్ప 1' ప్రీ ప్రొడక్షన్ కోసమే దాదాపు ఏడాది సమయం తీసుకున్న సుకుమార్.. సినిమా పూర్తి చేసే సరికి రెండేళ్ల టైమ్ పట్టింది. అయితే ఇక్కడ మధ్యలో కోవిడ్ పాండమిక్ కారణంగా కొన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక 'పుష్ప 2' చిత్రాన్ని దర్శకుడు ఏళ్ళ తరబడి మెల్లగా చెక్కుతూనే ఉన్నారు. ఫస్ట్ పార్ట్ వచ్చిన మూడేళ్ళకు సెకండ్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలా అని ఈపాటికే షూటింగ్ పూర్తి చేసి, సినిమా రెడీగా పెట్టారా అంటే అదీ లేదు.

'పుష్ప 2' రిలీజ్ కు గట్టిగా మూడు వారాల సమయం మాత్రమే వుంది. కానీ ఇంకా ఐటమ్ సాంగ్ అని, ప్యాచ్ వర్క్ అని షూటింగ్ జరుగుతూనే వుంది. ఈ గ్యాప్ లో రిలీజ్ డేట్లు కూడా మారుతూ వచ్చాయి. ముందుగా ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఆ డేట్ కు రావాల్సిన ఇతర సినిమాలను వాయిదా వేసుకున్నారు. అయితే సుక్కు మాత్రం తన చిత్రాన్ని కంప్లీట్ చేయడానికి ఇంకాస్త టైమ్ పడుతోందంటూ, డిసెంబరు 5వ తేదీకి రిలీజ్ డేట్ ను షిఫ్ట్ చేశారు.

'పుష్ప 1' సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి నిమిషం వరకూ జరగడంతో, అనుకున్నట్లుగా అవుట్ పుట్ రాలేదనే మాట వచ్చింది. సౌండ్ మిక్సింగ్ సరిగా చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేయలేకపోయారు. కానీ 'పుష్ప 2' విషయంలో ఈ తప్పులు జరగవని మేకర్స్ హామీ ఇచ్చారు. నెల రోజుల ముందుగానే కంటెంట్ ను లోడ్ చేస్తామని నిర్మాత ధీమాగా చెప్పారు. కానీ అలా జరగలేదు.

పుష్ప విడుదలై మూడేళ్లు కావొస్తోంది కాబట్టి, దానికి సీక్వెల్ మూవీ రూపొందించడానికి సుకుమార్ కు కావాల్సినంత టైమ్ దొరికిందనే చెప్పాలి. దర్శకుడు ఎప్పటిలాగే తన వర్కింగ్ స్టైల్ లో స్లోగా షూట్ చేశారో, మరేదైనా ఇతర కారణాలతో లేట్ అయిందేమో తెలియదు కానీ.. అనుకున్న సమయానికి షూటింగ్ ఫినిష్ అవ్వలేదు. 2025 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ, ఇంత హైప్ ఉన్న సీక్వెల్ ఇంకా షూటింగ్ & పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉండటం ఎవరికైనా విచిత్రంగా అనిపిస్తుంది.

ఇప్పటికి సుకుమార్ ఫస్టాఫ్ ను మాత్రమే లాక్ చేశారు. సినిమా రిలీజ్ దగ్గర పడటంతో ఇప్పుడు హడావిడిగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డెడ్ లైన్ ను రీచ్ అవ్వడానికి రాత్రింబవళ్ళు వర్క్ చేయాలి. మరోవైపు పాన్ ఇండియా ప్రమోషన్స్ చెయ్యాలి. ఇది టీమ్ మొత్తానికి తీవ్ర ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. ఆల్రెడీ బీజీఎం విషయంలో అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ తో కాకుండా మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ తో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతనేది పక్కన పెడితే, సినిమా విడుదలకి కొన్ని రోజుల ముందు ఇలాంటి వార్తలు స్ప్రెడ్ అవడం మంచిది కాదు.

అయితే ఈ విషయంలో రాజమౌళి, సుకుమార్ ల మధ్య చాలా తేడా ఉంది. రాజమౌళి ఒక సినిమా పూర్తి చేయడానికి ఎన్నేళ్ల సమయం తీసుకున్నా.. రిలీజ్ డేట్ కంటే చాలా రోజుల ముందుగానే ప్రొడక్ట్ ను రెడీగా పెట్టుకుంటారు. పోస్ట్ ప్రొడక్షన్ కు తగినంత టైమ్ కేటాయిస్తారు. చివరి నిమిషం వరకూ హడావిడిగా వర్క్ చేసే పరిస్థితి తెచ్చుకోరు. తన సినిమాకి ఎంత బాగా మార్కెటింగ్ చేసుకుంటారో.. తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి అంతే దూకుడుగా ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటారు. తన టీమ్ తో కలిసి దేశమంతా తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కానీ పర్ఫెక్షనిస్ట్ గా పేరుబడిన సుకుమార్ సినిమాలకు ఇలాంటివి చూడలేకపోతున్నాం. ఈ విషయంలో దర్శకుడు కచ్ఛితంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.