Begin typing your search above and press return to search.

సుకుమార్ అలసి సొలసి..

‘పుష్ప-1’ రిలీజప్పుడు ఆయన ఏ ప్రమోషనల్ ఈవెంట్‌కూ రాలేదు. రిలీజ్ ముందు రోజు కూడా ముంబయిలో ఉండి ఎడిటింగ్ పనులను పర్యవేక్షించారు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 7:43 AM GMT
సుకుమార్ అలసి సొలసి..
X

సుకుమార్ సినిమా అంటే చివరి నిమిషంలో హడావుడి మామూలే. మొదట కొంచెం తాపీగా షూటింగ్ చేసి.. చివర్లో ఆయన బాగా హడావుడి పడతాడని పేరుంది. చివరి నెల రోజులు అయితే రేయింబవళ్లు పని చేస్తారు. ఇక రిలీజ్‌కు వారం ముందు అయితే ఆయన నిద్రాహారాలు మానేస్తాడని అంటారు. ఎంత పర్ఫెక్ట్‌గా సినిమా తీసినా.. సంతృప్తి చెందక కరెక్షన్లు చేయడం, ఎడిటింగ్‌లో మార్పులు చేర్పులు చేయడం మామూలే.

‘పుష్ప-1’ రిలీజప్పుడు ఆయన ఏ ప్రమోషనల్ ఈవెంట్‌కూ రాలేదు. రిలీజ్ ముందు రోజు కూడా ముంబయిలో ఉండి ఎడిటింగ్ పనులను పర్యవేక్షించారు. ‘పుష్ప-2’కు సుకుమార్ ఇంకా కష్టపడుతున్నారు. గత మూడు వారాలు ఆయన రేయింబవళ్లు పని చేశారు. ఓ వైపు షూట్, మరోవైపు ఎడిటింగ్ పనులతో మామూలు కష్టం పడలేదు. ఈ పనుల్లో పడే బీహార్, చెన్నై ఈవెంట్లకు ఆయన రాలేదు. ఐతే హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు మాత్రం హాజరయ్యారు.

కానీ ఈ ఈవెంట్లో సుకుమార్ చాలా డల్లుగా కనిపించారు. విపరీతమైన అలసటకు గురైన విషయం ముఖంలో స్పష్టంగా తెలిసిపోయింది. కింద కూర్చున్నపుడు, స్టేజ్ మీదికి వచ్చినపుడు ఆయన్ని చూసిన వాళ్లు ఏమైనా అనారోగ్యంతో బాధ పడుతున్నారా అనుకున్నారు.

నిద్ర లేమి వల్లే ఆయన అలా తయారయ్యారన్నది టీం వర్గాల సమాచారం. ఒక దశలో స్టేజ్ మీద బన్నీ తన గురించి మాట్లాడుతుంటే సుకుమార్ స్పందనలు లేకుండా అయోమయంగా కనిపించారు. దీంతో ఒక అసిస్టెంట్ దగ్గరికి వచ్చి మీ గురించే మాట్లాడుతున్నారు అన్నట్లుగా సైగ చేస్తే బన్నీ దగ్గరికి వెళ్లి నిలబడ్డారు సుక్కు. తన ప్రసంగంలో కూడా సుకుమార్ చాలా ఇబ్బందిగా కనిపించారు.

గట్టిగా మాట్లాడలేకపోయారు. హుషారు ఎంతమాత్రం లేదు. శక్తి కూడగట్టుకుని కొన్ని మాటలు మాట్లాడి ప్రసంగం ముగించారు. ఇదంతా సినిమా కోసం ఆయన పడుతున్న కష్టం వల్లే అని.. సినిమా రిలీజై కొన్ని రోజులు గడిస్తే కానీ ఆయన మామూలు మనిషి కాలేరని.. సక్సెస్ మీట్లో సుకుమార్‌ను హుషారుగా చూడొచ్చని టీం వర్గాలు అంటున్నాయి.