Begin typing your search above and press return to search.

కేసీఆర్ చిరస్థాయిలో నిలిచిపోతారు.. సుమన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

యాదాద్రికి వెళ్లిన ఆయన కేసీఆర్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 10:17 AM GMT
కేసీఆర్ చిరస్థాయిలో నిలిచిపోతారు.. సుమన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
X

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సినీనటుడు సుమన్ ప్రశంసల జల్లు కురిపించారు. యాదాద్రికి వెళ్లిన ఆయన కేసీఆర్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకన్న ఆయన.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొగిడారు. ఆలయ వైభవాన్ని ఫిదా అయిపోయారు.

ఈ రోజు యాదాద్రి గుట్టపైకి చేరుకున్న సుమన్.. ఆ వెంటనే గుట్టపై స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం చరిత్రలో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారని.. ఏనాడూ యాదాద్రి దేవుడిని పట్టించుకోలేదని అన్నారు. యాదాద్రిని ఇంత అద్భుతంగా తీర్చదిద్దాలన్న ఆలోచన ఎవరికీ రాలేదని పేర్కొన్నారు. ఒక కేసీఆర్‌కు మాత్రమే అలాంటి ఆలోచన రావడం.. దేవుడిచ్చిన వరమని వ్యాఖ్యానించారు.

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంలో స్వామి వారిని దర్శించుకున్నానని సుమన్ చెప్పారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక దర్శించుకోవడం ఇదే మొదటిసారి.. ఆలయం అద్భుతంగా తీర్చిద్దారని కొనియాడారు. యాదాద్రి ఆలయాన్ని హిందువులకు గొప్ప వరంగా ఇచ్చారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆలయ పరిసరాల్లోనూ సినిమా షూటింగులు జరుగుతాయని , పర్యాటకంగానూ మంచి అభివృద్ధి సాధిస్తుందని చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు యాదగిరిగుట్టపై అరెకరంలో ఉన్న దేవాలయాన్ని కేసీఆర్ 4.03 ఎకరాలకు విస్తరించారు. ఉద్యమం సమయంలోనే 2007లో కేసీఆర్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించారు. స్వామి వారిని దర్శించుకొని.. ఆలయాన్ని విశ్వఖ్యాతి గాంచేలా పునర్నిర్మించాలని అప్పుడే సంకల్పించారు. ఆ ఆలోచనలో భాగంగానే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి హోదాలో 2014 అక్టోబర్ 17న తన సంకల్పాన్ని కేసీఆర్ ప్రకటించారు. ఆలయ అభివృద్ధికి రూ.509 కోట్లు, టెంపుల్ సిటీ అభివృద్ధికి రూ.1,325 కోట్లు ఖర్చు చేశారు. యావత్ దేశం అబ్బురపడేలా చివరకు ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఆలయ నిర్మాణంతోపాటు టెంపుల్ సిటీ అభివృద్ధి, మంచినీటి వసతి, కాటేజీల నిర్మాణం, రహదారులు, సరస్సులు, ఉద్యానవనాలు, అభయారణ్యాలు, నిత్యాన్నదాన సత్రాలు, కల్యాణ మండపాలు, వేద పాఠశాల, శిల్పనిర్మాణ సంస్థ వంటివి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆలయాన్ని చూసిన వారంతా తెలంగాణ తిరుపతిగా పిలుచుకోవడం ప్రారంభించారు.