Begin typing your search above and press return to search.

హ‌రోంహ‌ర ప్రీరిలీజ్‌: ప‌వ‌న్-బాల‌య్య‌పై నిర్మాత హోప్

ఏపీ సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి కోసం ప్ర‌త్యేకించి బాబు- ప‌వ‌న్ దృష్టి పెట్టాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Jun 2024 6:56 PM GMT
హ‌రోంహ‌ర ప్రీరిలీజ్‌: ప‌వ‌న్-బాల‌య్య‌పై నిర్మాత హోప్
X

ఈ బుధ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త పాల‌కులు ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో టాలీవుడ్ లో మునుపెన్న‌డూ లేనంత ఉత్సాహం క‌నిపిస్తోంది. ఏపీ సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి కోసం ప్ర‌త్యేకించి బాబు- ప‌వ‌న్ దృష్టి పెట్టాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

ఈ కీల‌క త‌రుణంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సినిమా ప్ర‌మోష‌న్స్ లో ప్ర‌త్యేకించి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, అతిథులు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, బాల‌కృష్ణ వంటి విజేత‌ల‌కు శుభాకాంక్ష‌లు తెల‌ప‌డ‌మే గాక‌, ఇండ‌స్ట్రీలో నూత‌నోత్సాహం వెల్లివిరిసింద‌ని ప‌రోక్షంగా సూచిస్తున్నారు.

మంగ‌ళ‌వారం సాయంత్రం జ‌రిగిన 'హ‌రోంహ‌ర' ప్రీరిలీజ్ వేదిక ఇందుకు మిన‌హాయింపు కాదు. ఈ వేదిక‌పై హ‌రోంహ‌ర నిర్మాత‌లు మాట్లాడుతూ .. ముఖ్య‌మంత్రి కాబోతున్న‌ చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ, న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జ‌న‌సేనానిగా 100/100 మార్కులు (21సీట్లు గెలిచినందున‌) ప‌డ్డాయంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఇంత‌వ‌ర‌కూ ఏ ఇత‌ర నాయ‌కుడికి ఇది సాధ్యం కాలేద‌ని కూడా గుర్తు చేసారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన‌ 'హ‌రోంహ‌ర' ప్రీ ఈవెంట్లో చిత్ర‌క‌థానాయ‌కుడు సుధీర్ బాబు స‌హా హీరోలు అడివి శేష్‌, విశ్వ‌క్ సేన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సుధీర్ బాబు - మాళవిక శర్మ జంట‌గా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా `హరోంహర` 14 జూన్ 2024న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. యాక్ష‌న్ ప్యాక్డ్ ట్రైల‌ర్ ఇప్ప‌టికే బజ్‌ని సృష్టించింది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. హింసాత్మ‌క స‌న్నివేశాల‌ కారణంగా ఈ చిత్రానికి A సర్టిఫికేట్ లభించింది. ఈ సినిమాలో యాక్ష‌న్ దృశ్యాలు అద్భుతంగా కుదిరాయ‌ని ప్రీరిలీజ్ వేడుక‌లో నిర్మాత‌లు వెల్ల‌డించారు. ఇందులో నాలుగు ఫైట్స్ లో సుధీర్ బాబు పెర్ఫామెన్స్ క‌ట్టి ప‌డేస్తుంద‌ని ప్ర‌శంసించారు. ఈ సినిమాకి అన్ని విధాలా స‌హ‌క‌రించి అద్భుతంగా తెర‌కెక్కించేందుకు స‌హ‌క‌రించిన త‌న నిర్మాత‌లు, టెక్నీషియ‌న్ల‌కు ద‌ర్శ‌కుడు జ్ఞాన‌సాగ‌ర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించిన హరోంహరలో సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే త‌దిత‌రులు న‌టించారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సుబ్ర‌మ‌ణ్యం, సుమంత్ నాయుడు జి ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నైజాంలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తోంది. ప్రీరిలీజ్ వేడుక‌లో ప‌లువురు పంపిణీదారులు పాల్గొన్నారు.