సుమంత్ ఆ రెండు హిట్ సినిమాలు చేసుంటే
అయితే నటుడిగా సుమంత్ కి ప్రేమ కథ చిత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
By: Tupaki Desk | 27 July 2024 5:05 AM GMTకింగ్ నాగార్జున తర్వాత అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వంతో ఆయన మనవడు సుమంత్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ కథ సినిమాతో సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అయితే నటుడిగా సుమంత్ కి ప్రేమ కథ చిత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
సుమంత్ కి కమర్షియల్ గా ఫస్ట్ సక్సెస్ వచ్చింది మాత్రం సత్యం సినిమాతోనే. ఆ మూవీ లవ్ స్టోరీతో తెరకెక్కి మంచి హిట్ సొంతం చేసుకుంది. తర్వాత గౌరీ సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అక్కడ నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల స్థాయిలో మరో సక్సెస్ అతనికి లభించలేదు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన మళ్లీ రావా సినిమా చాలా కాలం తర్వాత ఆయనకి సక్సెస్ అందించింది.
ప్రస్తుతం సుమంత్ ఓవైపు ఇతర స్టార్స్ సినిమాలలో కీలక పాత్రలు చేస్తూనే హీరోగా కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేతిలో అనగనగా ఒక రౌడీ, వారాహి అనే రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు కూడా భిన్నమైన కథలతోనే తెరకెక్కుతూ ఉండడం విశేషం. తాజాగా సుమంత్ అహం రీబూట్ అనే మూవీతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించారు. కేవలం ఒకే క్యారెక్టర్ తో ఈ చిత్రం తెరకెక్కింది.
ఇదిలా ఉంటే సుమంత్ తన కెరీర్ లో రెండు బ్లాక్ బాస్టర్ హిట్స్ ని మిస్ చేసుకున్నాడు. తరుణ్ హీరోగా వచ్చిన మొదటి చిత్రం నువ్వే కావాలి ఫస్ట్ సుమంత్ హీరోగా చేయాలని అనుకున్నారంట. అయితే ఎందుకనో అది సెట్ కాలేదు తర్వాత పవన్ కళ్యాణ్ తొలిప్రేమ స్టోరీ కూడా ముందుగా సుమంత్ దగ్గరికే వెళ్ళిందంట. కానీ ఈ సినిమా కూడా ఆయన చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదంట. మరోసారి పూరి జగన్నాథ్ దేశముదురు కథని సుమంత్ కి వినిపించారంట.
అయితే ఈ కథ తనకి సెట్ కాదని ఆయన వదిలేసారు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని కూడా చెప్పారు. దేశముదురు సినిమాలో క్యారెక్టర్ కి అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని, ఆ సినిమా మిస్ చేసుకోవడం వల్ల తనకి ఎలాంటి బాధ లేదని పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. తొలిప్రేమ, నువ్వే కావాలి సినిమా ఎందుకు మిస్ చేసుకున్నారనేది తెలియదు.
ఒకవేళ ఈ రెండు సినిమాలు చేసి ఉంటే హీరోగా సుమంత్ స్టార్ ఇమేజ్ అందుకునేవాడనే మాట వినిపిస్తుంది. ఏది ఏమైనా మంచి టాలెంటెడ్ హీరో అయ్యుండి కూడా సుమంత్ ఆశించిన స్థాయిలో టాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయారు. చాలా రోజుల నుంచి మంచి కమ్ బ్యాక్ సినిమా కోసం సుమంత్ వెయిట్ చేస్తున్నారు. మరి ఆయనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే చిత్రం ఏమవుతుందనేది వేచి చూడాలి.