Begin typing your search above and press return to search.

PR లేకుంటే మమ్మల్ని గుర్తు పెట్టుకోరు

తాజాగా యువ హీరో సందీప్‌ కిషన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పీఆర్‌ గురించి కుండ బద్దలు కొట్టేశాడు. సాధారణంగా హీరోలు పీఆర్‌ గురించి పెద్దగా మాట్లాడరు.

By:  Tupaki Desk   |   21 Feb 2025 2:30 PM GMT
PR లేకుంటే మమ్మల్ని గుర్తు పెట్టుకోరు
X

తెలుగు, హిందీ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లోనూ ప్రస్తుతం పీఆర్‌ అనేది అత్యంత కీలకం అయింది. ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కోసం పీఆర్‌ టీం చేస్తున్న పని అంతా ఇంతా కాదు. స్టార్‌ హీరోలు నెలకు లక్షలు ఖర్చు చేసి పీఆర్‌ చేయించుకుంటున్నారు అనే టాక్ ఉంది. పెద్ద నిర్మాణ సంస్థలు తమ సినిమాలను ప్రమోట్‌ చేయడం కోసం కోట్ల రూపాయలను పీఆర్‌లకు వినియోగిస్తున్నారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. సినిమాను ఎంత గొప్పగా తీసినా సరైన పీఆర్‌ టీం వర్క్ లేకుంటే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది నోట వింటున్న మాట.

తాజాగా యువ హీరో సందీప్‌ కిషన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పీఆర్‌ గురించి కుండ బద్దలు కొట్టేశాడు. సాధారణంగా హీరోలు పీఆర్‌ గురించి పెద్దగా మాట్లాడరు. కానీ సందీప్ కిషన్ మాట్లాడుతూ పీఆర్‌ లేకుంటే జనాలు మమ్మల్ని గుర్తు పెట్టుకోరు. పీఆర్‌ లేకుంటే ఇండస్ట్రీ వారు సైతం హీరోలను పట్టించుకోదు అనే అభిప్రాయంను సందీప్ వ్యక్తం చేశారు. పీఆర్‌ లేకుంటే ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో గుర్తింపు ఉండదు. మనం చేసినవి, మన గురించి ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటే జనాలకు తెలుస్తూ ఉంటుంది. కనుక పీఆర్‌ అనేది తప్పనిసరి అన్నట్లుగా సందీప్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సందీప్ కిషన్ పీఆర్‌ గురించి ఇంకా మాట్లాడుతూ.. మన గురించి ఎప్పుడూ ఎవరో ఒకరు మాట్లాడితూ, టైమ్ టు టైమ్‌ చెబుతూ ఉంటేనే మనం ఒకరం ఉన్నాం అని ఇండస్ట్రీకి గుర్తు ఉంటుంది, ప్రేక్షకులు గుర్తిస్తారు. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా మాట్లాడుకునేలా చేయాలని అన్నారు. ఫ్యాన్‌ వార్‌ 50 శాతం నిజంగా జరిగితే మరో 50 శాతం క్రియేట్‌ చేస్తున్నారు అనే అభిప్రాయంను సందీప్ కిషన్ వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఇది కచ్చితంగా అవసరం అన్నారు. అప్పట్లో బాలీవుడ్‌లో ఇది ఉండేది. ఇలా చేస్తారా అనుకునేవాడిని. ముంబైలో పీఆర్ చేస్తుంటే చూసి షాక్ అయ్యాను. ఇంత చేస్తారా అని ఆశ్చర్యపోయాను. కానీ ఇప్పుడు అదే ఇక్కడ జరుగుతుంది అన్నాడు.

ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే అలా చేయాల్సిందే అన్నారు. సినిమా వసూళ్ల పోస్టర్‌ను 40 శాతం ఇది ఫేక్ అయి ఉంటుందని అనుకున్నా మిగిలిన 60 శాతం మంది నిజమే అని నమ్ముతారు. తద్వారా సినిమాకు వెళ్తారు. కొంత మందిని అయినా నమ్మించడం కోసం పీఆర్‌ టీం అలాంటివి చేస్తుంది. సినిమా ఒక మోస్తరుగా ఉంటే పీఆర్‌ చేసి కాపాడుకోవచ్చు.. అందులో తప్పేం లేదు అనేది సందీప్ కిషన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే వారం ఆయన నటించిన 'మజాకా' సినిమా విడుదల కాబోతుంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన మజాకా సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. రావు రమేష్, అన్షు ముఖ్య పాత్రల్లో నటించారు.