Begin typing your search above and press return to search.

కూలీలో.. ఆ మాట మరిచావా సందీప్‌?

కోలీవుడ్‌ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   6 Dec 2024 5:35 AM GMT
కూలీలో.. ఆ మాట మరిచావా సందీప్‌?
X

కోలీవుడ్‌ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. రజనీకాంత్‌ గత చిత్రం వేట్టయాన్‌ తీవ్రంగా నిరాశ పరచింది. దాంతో ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. లోకేష్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ముఖ్యంగా లోకేష్‌ యూనివర్శ్‌ మూవీస్‌ని ఇష్టపడే వారు కూలీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమాలో భారీ స్టార్‌ కాస్ట్‌ ఉండగా మరో తెలుగు హీరోను ఈ సినిమాలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

రజనీకాంత్‌ కూలీ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సోబిన్‌ షాహిర్‌లు నటిస్తున్నారు. వీరు కాకుండా టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ సైతం కూలీలో కనిపించబోతున్నాడు. దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌, సందీప్‌ కిషన్‌లు మంచి స్నేహితులు. ఆ స్నేహంతోనే కూలీ సినిమాలో ముఖ్యమైన చిన్న పాత్ర కోసం లోకేష్‌ అడిగిన వెంటనే సందీప్‌ కిషన్‌ ఓకే చెప్పాడని తమిళ్‌ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఆ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే తమిళ్‌ మూవీ రాయన్‌తో సందీప్‌ కిషన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందించి నటించిన రాయన్‌ సినిమాలో సందీప్‌ కిషన్‌ కీలక పాత్రలో కనిపించాడు. ఆ సినిమా ప్రమోషన్‌ సమయంలో సందీప్‌ కిషన్‌ ఒక ఇంటర్వ్యూలో తాను సపోర్టింగ్‌ రోల్‌ చేయడం రాయన్‌తోనే చివరిసారి అంటూ చెప్పుకొచ్చారు. ఆ సినిమా తర్వాత వరుసగా హీరోగా మాత్రమే సినిమాలు చేస్తాను అంటూ చెప్పిన సందీప్‌ కిషన్ ఆ విషయాన్ని మరచిపోయాడో ఏమో కానీ ఇప్పుడు కూలీ సినిమాలో కీలక పాత్రను చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ ఇన్‌ సైడ్‌ టాక్‌ వినిపిస్తోంది. స్నేహితుడి కోసం సందీప్‌ తన మాటను పక్కన పెట్టి ఉంటాడు, అయినా కూలీ వంటి భారీ చిత్రంలో చిన్న పాత్ర దక్కినా చేయడం చాలా పెద్ద విషయం.

లోకేష్ కనగరాజ్‌ దర్శకుడిగా చేసిన మొదటి సినిమా మానగరంలో సందీప్ కిషన్‌ హీరోగా నటించాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. తనకు తమిళ్‌లో మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన లోకేష్ కనగరాజ్‌ సినిమాలో నటించమని అడిగితే సందీప్ ఎలా కాదు అంటాడు. అందుకే మళ్లీ ఇతర హీరోల సినిమాల్లో నటించకూడదని రాయన్ సినిమా తర్వాత అనుకున్నప్పటికీ కూలీలో నటించేందుకు ఒప్పుకున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న కూలీ సినిమాలో సందీప్‌ కిషన్‌ సైతం జాయిన్‌ కావడంతో అంచనాలు, ఆసక్తి మరింతగా పెరిగాయి అనడంలో సందేహం లేదు.