Begin typing your search above and press return to search.

మజాకా.. ఎక్కడ తేడా కొట్టింది?

ఇక వారితో సందీప్ కిషన్ స్ట్రాంగ్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ ఫలితం ఊహించనట్లు దక్కలేదు.

By:  Tupaki Desk   |   5 March 2025 11:29 AM IST
మజాకా.. ఎక్కడ తేడా కొట్టింది?
X

సందీప్ కిషన్ హీరోగా త్రినాథ్ నక్కిన దర్శకత్వం వహించిన చిత్రం మజాకా. దర్శకుడు త్రినాథ్ ఇంతకుముందు చేసిన సినిమాలు కమర్షియల్ గా మంచి రిజల్ట్ అందుకున్నాయి. టాక్ ఎలా ఉన్నా కూడా కలెక్షన్స్ బాగానే వస్తాయి అని అతని సినిమాలకు ఒక పేరుంది. ముఖ్యంగా రైటర్ ప్రసన్న - త్రినాథ్ కాంబినేషన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇక వారితో సందీప్ కిషన్ స్ట్రాంగ్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ ఫలితం ఊహించనట్లు దక్కలేదు.

సినిమా విజయం కోసం కేవలం కథ బలం ఉండటం సరిపోదు. ప్రేక్షకుల మూడ్, సరైన టైమింగ్ కూడా కీలకమైన అంశాలే. కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలైనా, ప్రేక్షకుల అభిరుచిని పట్టించుకోకపోతే అవి బాక్సాఫీస్ వద్ద నష్టాలు తప్పించుకోలేవు. సందీప్ కిషన్ నటించిన మజాకా పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. ఈ సినిమా సరైన కంటెంట్ లేక కాదు, సరైన సమయంలో విడుదల చేయకపోవడమే సమస్య.

త్రినాథ్ నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం, పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేశారు. దీన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. కానీ అనుకున్నట్టు కాలేదు. ఆలస్యం కావడంతో మళ్లీ మహాశివరాత్రికి రిలీజ్ చేశారు. ఈ సమయానికి ప్రేక్షకుల మూడ్ మారిపోయింది. సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలే కాకుండా, మధ్యలో వచ్చిన కొన్ని చిన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. దాంతో మజాకా కోసం థియేటర్స్‌కు వచ్చే ఆసక్తి ప్రేక్షకుల్లో తగ్గిపోయింది.

ఈ పరిస్థితుల్లో సినిమా ప్రేక్షకులను ఎంతవరకు థియేటర్లకు రప్పించగలదో అన్నదే ప్రశ్న. అంతేకాదు, విడుదలకు సరైన టైమింగ్ ఎంచుకోకపోతే మరో సమస్య ఎదురవుతుంది. ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. యూత్ ఫోకస్ అంతా క్రికెట్‌పైనే ఉంది. వారం రోజులు సినిమాలు చూసేందుకు పెద్దగా ఆసక్తి ఉండదు. ముఖ్యంగా, బుక్ మై షో ట్రెండ్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. క్రికెట్, ఇతర వినోదాలకు ప్రాధాన్యం ఇస్తున్న జనాలు కొత్త సినిమాల వైపు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ఉంటే తండ్రి కొడుకుల కథకు మంచి ఆదరణ దక్కేది. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేయడానికి మంచి అవకాశముండేది. కానీ ఇప్పుడు విడుదల చేసిన సమయానికి ప్రేక్షకుల మూడ్ పూర్తిగా వేరుగా ఉంది. ఇది ఖచ్చితంగా సినిమా ఫలితంపై ప్రభావం చూపించే అంశం. మొత్తానికి మజాకా కంటెంట్ పరంగా ఫర్వాలేదనిపించినా, టైమింగ్‌లో చేసిన పొరపాటు వల్ల మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమాలు విడుదలలో టైమింగ్ ఎంత కీలకమో మరోసారి ఈ ఉదాహరణతో రుజువవుతోంది.