Begin typing your search above and press return to search.

హాస్య న‌టుడి కిడ్నాప్ డ్రామాలో ఊహించ‌ని ట్విస్టు

ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ ఇద్ద‌రు హాస్య న‌టుల కిడ్నాప్ క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Dec 2024 1:07 PM GMT
హాస్య న‌టుడి కిడ్నాప్ డ్రామాలో ఊహించ‌ని ట్విస్టు
X

ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ ఇద్ద‌రు హాస్య న‌టుల కిడ్నాప్ క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రినీ సినీప‌క్కీలో కిడ్నాప‌ర్లు దారి మ‌ళ్లించారు. ఈవెంట్ కి పికప్ కోసం కార్ పంపించి అటుపై అదే కార్ లో కిడ్నాప్ చేసి డ‌బ్బు డిమాండ్ చేసారు. తాము అడిగిన డ‌బ్బు చెల్లించ‌క‌పోతే చంపేస్తామ‌ని బెదిరించారు.

హాస్యనటుడు సునీల్ పాల్ ఇటీవల డిసెంబర్ 2న కిడ్నాప్‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఒక ఈవెంట్ సాకుతో తనను హరిద్వార్‌కు పిలిపించారని, అయితే దుండ‌గులు తనను కిడ్నాప్ చేశారని రూ. 20 లక్షలు చెల్లిస్తేనే విడిచిపెడ‌తామ‌ని డిమాండ్ చేశారని చెప్పాడు. సునీల్ వారికి రూ. 8 లక్షలు చెల్లించి తనను తాను రక్షించుకోగలిగాడు. వాస్తవానికి కిడ్నాపర్లు అతడికి విమాన టికెట్ల‌ను బుక్ చేసుకోవడానికి రూ. 20 వేలు కూడా ఇచ్చారు.

అయితే ఇటీవల కిడ్నాపర్లు మీరట్‌లోని ఒక దుకాణం నుండి ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు కనిపించే సీసీటీవీ ఫుటేజ్ సోష‌ల్ మీడియాల్లో జోరుగా వైర‌ల్ అయింది. తాజా స‌మాచారం మేర‌కు.. ఉత్తరప్రదేశ్ పోలీసులు నిందితులను గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి యూపీ- బిజ్నోర్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు బిజ్నోర్‌లోని దాదాపు 24 చోట్ల దాడులు నిర్వ‌హించిన కనీసం డజను మందిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలో నగలు కొనుక్కోవడానికి బాధితుడి సొమ్మును వినియోగించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇద్దరు అనుమానితులను లవీ పాల్, అర్జున్ కమావాల్‌గా గుర్తించారు.

కిడ్నాపర్లు దోపిడీ సొమ్మును ఉపయోగించి ఆభరణాలు కొన్నారనే ఆరోప‌ణ‌ల‌తో మీరట్‌కు చెందిన ఇద్దరు నగల వ్యాపారుల ఖాతాలను మహారాష్ట్ర పోలీసులు స్తంభింపజేసిన తర్వాత‌ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. నగల దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. దుండ‌గులు మీర‌ట్ లోని ఓ బజార్‌లోని దుకాణంలో రూ.4 లక్షల నగలు కొనుగోలు చేశారు. అనంతరం లాల్ కుర్తి ప్రాంతంలోని మరో దుకాణంలో రూ.2.25 లక్షలు ఖర్చు చేశారు. పల్ పేరుతోనే బిల్లులు చేయాలని కూడా నగల వ్యాపారులను కోరారు. కొనుగోళ్ల‌లో బంగారు నాణేలు, బంగారు గొలుసులు ఉన్నాయి. వారు రూ. 2,25,500 ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు. ఇది చట్టబద్ధమైనదిగా అనిపించింది.. అనుమానం క‌లిగింద‌ని దుకాణ దారు పోలీసుల‌కు తెలిపారు. ఇలాంటి కొనుగోలు వేరొక చోట కూడా చేసార‌ని ముంబై పోలీసుల ద్వారా తెలిసింద‌ని స‌ద‌రు న‌గ‌ల దుకాణ‌దారు వ్యాఖ్యానించారు. ఆ త‌ర్వాత తాము ముంబై పోలీసుల‌కు సీసీ ఫుటేజ్ అందించి ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించామ‌ని అన్నారు. త‌మ ఖాతాల‌ను పోలీసులు స్థంబింపజేసారని కూడా న‌గ‌ల దుకాణ‌దారులు వెల్ల‌డించారు.

అస‌లేం జ‌రిగింది?

కిడ్నాప్ త‌రవాత ఏం జ‌రిగిందో న‌టుడు సునీల్ పాల్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఈ కిడ్నాపర్లు నా మొబైల్ ఫోన్ లాక్కుని 24 గంటలు తమ వద్ద ఉంచుకున్నారు. వారు నా డేటా మొత్తాన్ని వారి ఫోన్‌లోకి బదిలీ చేసుకున్నారు. నా భార్య .. ఇతర కుటుంబ సభ్యుల నంబర్లు .. కొంద‌రు ప్రముఖుల నంబర్లను కూడా తీసుకున్నారు. అప్పుడు నా వ్యక్తిగత వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని బెదిరించారు. వారు తెలివిగా ట్రాప్ చేసార‌ని సునీల్ పాల్ తెలిపారు.

డ‌బ్బు ఇవ్వకుంటే పాయిజ‌న్ ఇంజెక్షన్ ఇస్తామ‌ని బెదిరించారు. వాళ్ళు నా కళ్లకు గంతలు కట్టారు. కానీ నా ముందు ఐదారుగురు బల‌మైన వ్యక్తులు ఉన్నారని నేను గ్రహించగలిగానని కూడా పాల్ తెలిపారు.