Begin typing your search above and press return to search.

అమెరికా పోలీసులు నాకు తుపాకీ గురిపెట్టారు: సునీల్ శెట్టి

ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టికి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ పోలీసుల చేతిలో ఒకసారి చేదు అనుభ‌వం ఎదురైంది.

By:  Tupaki Desk   |   1 March 2025 3:25 AM GMT
అమెరికా పోలీసులు నాకు తుపాకీ గురిపెట్టారు: సునీల్ శెట్టి
X

ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టికి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ పోలీసుల చేతిలో ఒకసారి చేదు అనుభ‌వం ఎదురైంది. ఓ సినిమా షూటింగ్ టైమ్ లో తాను అక్క‌డ షూటింగ్‌లో పాల్గొని తిరిగి హోట‌ల్‌కి వెళ్ల‌గా పోలీసులు పొర‌బ‌డి త‌న‌పై తుపాకీ ఎక్కుపెట్ట‌డ‌మే కాకుండా బేడీలు కూడా వేశార‌ని సునీల్ శెట్టి వాపోయాడు. ఆ సంఘ‌ట‌న త‌లుచుకుంటే ఇప్ప‌టికీ త‌న‌కు గ‌గుర్పాటు క‌ల్గుతుంద‌ని తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో సునీల్ శెట్టి వెల్ల‌డించాడు.

వివ‌రాల్లోకి వెళ్తే 2001లో కాంటే చిత్ర షూటింగ్ సంద‌ర్భంగా సినిమా యూనిట్‌తో క‌లిసి సునీల్ శెట్టి లాస్ ఏంజెల్స్ వెళ్లాడు. అదే స‌మ‌యంలో 2001, సెప్టెంబ‌రు 11వ తేదీన అల్‌ఖైదా ఉగ్ర‌వాదులు అమెరికాలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 2900 మందికి పైగా చ‌నిపోయారు. ఆ స‌మ‌యంలో అక్క‌డ కాంటే షూటింగ్ జ‌రుగుతుంది.

ఆ స‌మ‌యంలో దాడికి సంబంధించిన విజువ‌ల్స్‌ను టీవీలో చూసి త‌న‌కెంతో బాధ అనిపించింద‌ని, ఆ సంఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత కొన్ని రోజులు తాము షూటింగ్ కూడా నిలిపివేశామ‌ని సునీల్ శెట్టి చెప్పాడు. 'స్వ‌ల్ప విరామం అనంత‌రం షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాం. చిత్రీక‌ర‌ణ‌ పున‌ర్ ప్రారంభం అనంత‌రం ఒక రోజు షూటింగ్ పూర్త‌య్యాక సెట్‌లో తాళం మ‌ర్చిపోయాను. హోటల్‌కి వ‌చ్చాక తాళాలు మ‌ర్చిపోయాన‌ని గ‌మ‌నించి రిస్పెష‌న్‌కి వెళ్లి డూప్లికెట్ తాళాలు అడిగా. రిస్పెష‌న్‌లోని వ్య‌క్తి త‌న గెట‌ప్‌ను చూసి పెద్దగా కేక‌లు వేసి అక్క‌డ నుంచి పారిపోయాడు. కొద్ది క్ష‌ణాల్లోనే అక్క‌డికి పోలీసులు చేరుకుని న‌న్ను చుట్టుముట్టారని' సునీల్ చెప్పాడు.

పోలీసులు వ‌చ్చీ రాగానే నాకు తుపాకీ గురిపెట్ట‌డంతో భ‌యాందోళ‌న‌కు లోన‌య్యాన‌ని సునీల్ శెట్టి చెప్పాడు. 'తుపాకీ ఎక్కిపెట్టి, మోకాలపై కూర్చోమ‌ని వాళ్లు భ‌య‌పెట్టారు. దాంతో నేను వాళ్ల‌కి స‌రెండ‌ర్ అయ్యాను. నా చేతుల‌కు వాళ్లు బేడీలు వేసి తీసుకెళ్తుండ‌గా ఆ హోట‌ల్ మేనేజ‌ర్ వ‌చ్చి పోలీసుల‌కు అడ్డుప‌డ్డాడు. అత‌డు భార‌తీయ న‌టుడ‌ని, సినిమా షూటింగ్ కోసం వ‌చ్చాడ‌ని ఆధారాలు చూపించ‌డంతో వాళ్లు న‌న్ను విడిచిపెట్టి క్ష‌మాప‌ణ‌లు చెప్పి అక్క‌డ నుంచి వెళ్లిపోయార‌ని' సునీల్ శెట్టి తెలిపాడు. స‌ద‌రు రిసెప్ష‌నిస్ట్ త‌న గెట‌ప్ చూసి అపార్థం చేసుకోవ‌డంతో ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని రెండు ద‌శాబ్దాల కింద‌టి సంఘ‌ట‌న‌ను సునీల్ శెట్టి గుర్తు చేసుకున్నాడు.