రామాయణంలోకి ప్రవేశించిన చింపాంజీలు?
కోతి(వానరం)కి, చింపాంజీకి తేడా తెలియకుండా పురాణాలపై సినిమా తీస్తే ఎలా ఉంటుందో `ఆదిపురుష్`లో చూశాం.
By: Tupaki Desk | 10 Dec 2024 10:30 PM GMTకోతి(వానరం)కి, చింపాంజీకి తేడా తెలియకుండా పురాణాలపై సినిమా తీస్తే ఎలా ఉంటుందో `ఆదిపురుష్`లో చూశాం. దర్శకుడు ఓంరౌత్ భారతీయ పురాణేతిహాసం అయిన రామాయణం కథను, అందులో పాత్రలను ఖూనీ చేసాడని తీవ్రంగా విరుచుకుపడ్డారు సాంప్రదాయ వాదులు. దానికి కారణం హాలీవుడ్ బ్లాక్ బస్టర్ `ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్` స్ఫూర్తితో అతడు రామాయణంలో చింపాంజీ (ఏప్స్)లను ప్రవేశపెట్టి దానినే సృజనాత్మకత అని భ్రమింపజేసాడు. నిజానికి రామాయణం కథలో చింపాంజీలు ఉన్నట్టు ఆధారాలు లేవు. వానరాలు మాత్రమే ఉన్నాయి. ఆ మాత్రం కామన్ సెన్స్ దర్శకుడికి లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన చెందారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా.. రామాయణం ఆధారంగా సినిమాలు నిరంతరం తెరకెక్కుతూనే ఉన్నాయి. ఆదిపురుష్ ఫ్లాపైనా కానీ మళ్లీ రామాయణం కాన్సెప్ట్ తోనే నితీష్ తివారీ లాంటి సీనియర్ దర్శకుడు రామాయణం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈసారి ప్రభాస్ స్థానంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో సీత పాత్రలో సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నటిస్తున్న సన్నీడియోల్ చేసిన తాజా కామెంట్ ఇప్పుడు నెటిజనుల్లో కొత్త సందేహాన్ని లేవనెత్తింది.
సన్నీడియోల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నితీష్ జీ `రామాయణం` రేంజును అవతార్ - ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌తో పోల్చడం ఆందోళనను కలిగించింది. అతడి ప్రకటనతో ఈ సినిమాలో కూడా నితీష్ తివారీ వానరాల బదులుగా ఏప్స్ (చింపాంజీ)ను చూపిస్తున్నాడా? అన్న కొత్త డౌట్ కొచ్చింది. రామాయణంలో వానరాలు మాత్రమే ఉన్నాయని భారతీయ ప్రజలకు తెలుసు. ఇప్పుడు చింపాంజీలు ప్రవేశిస్తే దాని ఫలితం మరో ఆదిపురుష్ అవుతుందనే అంతా ఆందోళన మొదలైంది. రణబీర్ కపూర్ లాంటి ట్యాలెంటెడ్ స్టార్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారతీయ పురాణేతిహాస కథను కానీ, అందులో పాత్రలను కానీ తప్పు దారి పట్టిస్తే దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రామాణికత లేకుండా దర్శకులు పురాణేతిహాసాలతో ప్రయోగాలు చేయడం తగదని సూచిస్తున్నారు. ఓం రౌత్ చేసిన తప్పును రిపీట్ చేయకుండా వానరాలను అధునాతన సాంకేతికతలో అద్భుతంగా ఆవిష్కరించేందుకు ఆస్కారం ఉంది.