రాజమౌళి- సుకుమార్ లా నిరూపించాలి
రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు బాలీవుడ్ లో నిరూపించారు. ఇప్పుడు గోపిచంద్ మలినేని లాంటి న్యూవేవ్ దర్శకులు సత్తా చాటాల్సి ఉంది.
By: Tupaki Desk | 21 Jan 2025 5:05 AM GMT'గదర్ 2' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సన్నీడియోల్ హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ఒకటి కావాలి. సీక్వెల్ సినిమాలతోనే ఇది సాధ్యమని డియోల్ భావిస్తున్నాడు. తన క్లాసిక్ హిట్ చిత్రం బోర్డర్ సీక్వెల్ బార్డర్ 2లో ప్రస్తుతం నటిస్తున్నాడు. అమీర్ ఖాన్ సహకారంతో 'లాహోర్ 1947' చిత్రీకరణ దశలో ఉంది.
ఇంతలోనే అతడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 'జాత్' అనే యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియన్ కేటగిరీలో ఐదు భాషల్లో విడుదల కానుంది. దానికి తగ్గట్టే విజువల్ ట్రీట్ ని అందించేందుకు గోపిచంద్ మలినేని ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. అటు హిందీ ఆడియెన్ తో పాటు దక్షిణాది నాలుగు భాషల్లోను ఈ సినిమాని బంపర్ హిట్ చేయడమే ధ్యేయంగా అతడు శ్రమిస్తున్నాడు. చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.
సన్నీడియోల్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ యాక్షన్ చిత్రమిదని కూడా టీమ్ చెబుతోంది. ముఖ్యంగా యాక్షన్ పార్ట్ ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ని ఆడియెన్ కి కనెక్ట్ చేస్తే పెద్ద హిట్టు ఖాయమని గోపిచంద్ మలినేని నమ్ముతున్నాడు. దీంతో ఆరుగురు విలన్లను ఢీకొట్టే హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నాడు. విలన్లతో నువ్వా నేనా? అంటూ సాగే పోరాటాలు ఉండనున్నాయని తెలిసింది. ఈ సినిమాకి నలుగురు యాక్షన్ కొరియోగ్రాఫర్లు పని చేస్తున్నారు. పీటర్ హెయిన్ భారీ కార్ ఛేజ్ సన్నివేశాన్ని హాలీవుడ్ రేంజులో తెరకెక్కించగా, నాగ వెంకట్ పోలీస్ స్టేషన్ లోపల పోరాటాల్ని తెరకెక్కించారు. రామ్ లక్ష్మణ్ షిప్ బోర్డ్ ఫైట్ ని, అడవిలో మరొక పోరాటాన్ని చిత్రీకరించారని తెలిసింది.
రవితేజ, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్లకు బ్లాక్ బస్టర్లు అందించిన గోపిచంద్ మలినేని బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సన్నీడియోల్ కి అదిరిపోయే హిట్టిస్తాడని భావిస్తున్నారు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు బాలీవుడ్ లో నిరూపించారు. ఇప్పుడు గోపిచంద్ మలినేని లాంటి న్యూవేవ్ దర్శకులు సత్తా చాటాల్సి ఉంది.