ల్యాండ్ కబ్జా చేసి బార్ & రెస్టారెంట్ నిర్మించిన నటి?
స్టార్ స్టక్ కాస్మోటిక్ బ్రాండ్ సహా రెస్టారెంట్ చైన్ వ్యాపారంలోను సన్నీలియోన్ దూసుకుపోతోంది.
By: Tupaki Desk | 31 Jan 2025 12:27 PM GMTమాజీ శృంగార తార సన్నీలియోన్ సొంత వ్యాపారాలతో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నటిగా అవకాశాలు తగ్గిన క్రమంలోనే సన్నీలియోన్ పూర్తిగా వ్యాపారాలపై దృష్టి సారించింది. ఇప్పటికే సౌందర్య ఉత్పత్తుల రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. స్టార్ స్టక్ కాస్మోటిక్ బ్రాండ్ సహా రెస్టారెంట్ చైన్ వ్యాపారంలోను సన్నీలియోన్ దూసుకుపోతోంది.
అయితే సన్నీలియోన్ ల్యాండ్ కబ్జా కేసులో బుక్కయిందని జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. లక్నోలోని విభూతిఖండ్లో బాలీవుడ్ నటి సన్నీలియోన్ `చికా లోకా బై సన్నీలియోన్` పేరుతో రెస్టారెంట్ & బార్ నిర్మిస్తోంది. అయితే ఈ భవంతి నిర్మాణం ప్రస్తుతం నిలిపేశారని తెలుస్తోంది. దీనికి కారణం లక్నోలోని ఎక్స్పీరియన్ క్యాపిటల్ నివాసి ప్రేమ సిన్హా ఫిర్యాదు మేరకు కన్స్యూమర్ కోర్టు ఈ నిర్మాణంపై స్టే ఆర్డర్ జారీ చేసింది.
పిల్లల ఆట స్థలం, కమ్యూనిటీ హాల్, సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం నియోగించిన స్థలాన్ని సన్నీలియోన్ ఆక్రమించిందని ఆరోపిస్తూ హైకోర్టుకు ఫిర్యాదు చేసారు. రెస్టారెంట్ & బార్ నిర్మాణం కారణంగా ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్ గోప్యత, భద్రతకు ముప్పు వాటిల్లవచ్చని ఫిర్యాదుదారు ఆందోళన వ్యక్తం చేసారు. కోర్టు విచారణలో లక్నో డెవలప్మెంట్ అథారిటీ (ఎల్.డి.ఏ) నిర్లక్ష్యంపై జస్టిస్ అశోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డర్ కాపీని ఎల్.డి.ఏకి పంపాలని ఫిర్యాదుదారుని ఆదేశించారు. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 19కి జరగనుంది. ఈ నిర్మాణం హైకోర్టుకు సమీపంగా, ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్ కి చేరువగా ఉండటంతో చిక్కులు మరింత పెరిగాయని తెలిసింది.
డెవలపర్ ఆమోదించబడిన సైట్ ప్లాన్ ని వదిలేసి పొరుగున ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసారనేది పిటీషన్లో ప్రధాన ఆరోపణ. ఈ నిర్మాణం ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్ గోప్యత, భద్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంటూ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సన్నీలియోన్ తదుపరి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతానికి బార్ అండ్ రెస్టారెంట్ చైన్ విస్తరణకు అంతరాయం ఏర్పడింది.