సవతి సోదరి అంటే స్టార్ హీరో కొడుక్కి గిట్టదా?
ఇటీవల బాబీ డియోల్ తన సవతి సోదరి ఈషా డియోల్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమెకు తన ప్రేమను పంపాడు.
By: Tupaki Desk | 6 Nov 2023 12:30 PM GMTపాపులర్ హీరో ఇద్దరు కుమారులకు తండ్రి. ఆ తర్వాత సహచర నటీమణితో ప్రేమలో పడ్డారు. ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని చెబుతారు. సదరు నటీమణికి అతడితో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఆ ఇద్దరు కుమార్తెలతో ప్రముఖ హీరో పెద్ద భార్య కుమారులు (హీరోలు) సఖ్యంగా ఉన్నారా? అంటే రకరకాలుగా ప్రచారం ఉంది. అయితే దీనిపై ఇటీవల ఆ ఇద్దరు కుమారులు పబ్లిక్ వేదికలపైనే వివరణ ఇచ్చారు. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో బ్రదర్స్ ఎవరు? సిస్టర్స్ ఎవరు? ప్రముఖ హీరో ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
పెళ్లయిన హీరో ధర్మేంద్ర. ఆయనకు సన్నీడియోల్, బాబిడియోల్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ ఇద్దరూ బాలీవుడ్ లో హీరోలుగా పాపులర్. ఇక ధర్మేంద్ర రెండో భార్య హేమమాలిని. బాలీవుడ్ డ్రీమ్ గాళ్ గా పాపులరైన హేమమాలిని .. ధర్మేంద్రతో ప్రేమలో పడ్డాక ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఆ ఇద్దరూ ఇషా డియోల్, అహనా డియోల్. ఆ ఇద్దరూ కథానాయికలుగా ప్రయత్నించినా కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో రాణించలేదు. అటుపై పెళ్లితో లైఫ్ లో సెటిలయ్యారు.
అయితే ఆ ఇద్దరు సిస్టర్స్ తో ప్రస్తుతం ధర్మేంద్ర కుమారుల రిలేషన్ షిప్ ఎలా ఉంది? అంటూ ఒక చర్చ చాలా కాలంగా సాగుతూనే ఉంది. ఇటీవల బాబీ డియోల్ తన సవతి సోదరి ఈషా డియోల్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమెకు తన ప్రేమను పంపాడు. 2 నవంబర్ , గురువారం నాటితో ఈషాకు 42 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఈషా తన ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా, దానికి ఆమె తల్లి హాజరయ్యారు. హేమ -ఈషా లతో కలిసి ఇంట్లో హవాన్ (ప్రత్యేక పూజ)తో తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంది. ఈ సందర్భంగా సోదరుడు బాబి డియోల్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. "నాకు వస్తున్న అందమైన పుట్టినరోజు శుభాకాంక్షలు & ఆశీర్వాదాలకు అందరికీ ప్రేమ & కృతజ్ఞతలు" అంటూ ఈషా ప్రతిస్పందించింది.
అలాగే ధర్మేంద్ర పెద్ద కుమారుడు సన్నీడియోల్ ఇటీవల తన సోదరీమణులతో రిలేషన్ షిప్ గురించి ప్రస్థావించారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ 8లో ఈషాతో తన బంధం గురించి సన్నీ ఓపెనయ్యాడు. గదర్ 2 సక్సెస్ నేపథ్యంలో కరణ్ జోహార్ అతడితో ముచ్చటించాడు. సన్నీ మాట్లాడుతూ.. "వారు నా సోదరీమణులు. దీనిని ఏదీ మార్చదు. నా విజయానికి వారు చాలా సంతోషించారు. అన్నింటికంటే చాలా అందమైన విషయం ఏమిటంటే సినిమా విజయం సాధించింది. నేను ఇక్కడ, అక్కడ, ప్రతిచోటికి వెళ్తున్నాను. ఆ తర్వాత సక్సెస్ పార్టీ చేసుకోవాలనుకున్నాను. కానీ 'అందరూ వస్తారా లేదా?' అని నేను సందిగ్ధంలో ఉన్నాను. పరిశ్రమలో అందరికీ తెలిసిన నా స్నేహితుడు కరీం నాతో ఉన్నాడు. అన్నీ చేసాడు. సాయంత్రం వరకు, ఎవరు హాజరు అవుతారో నాకు తెలియదు. కానీ అందరూ వచ్చిన విధానం.. ప్రతి ఒక్కరూ ఇచ్చిన ప్రేమ, ప్రతి ఒక్కరూ ఇంటికి రావడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను... అని తెలిపారు. రెండు వేర్వేరు సందర్భాలలో సన్నీడియోల్, బాబి డియోల్ సోదరులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. సోదరీమణులతో తమ అనుబంధం పైనా ఓపెనయ్యారు. ధర్మేంద్ర కుమారులు ఇటీవల కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. గదర్ 2 విజయంతో సన్నీ హ్యాపీ. ఇటీవల ఓ వెబ్ సిరీస్ లో గొప్ప పేరు రావడంతో బాబి కూడా హ్యాపీగా ఉన్నాడు. ఆ ఇద్దరూ తదుపరి కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయ్యారు.