రజనీ.. ఈ సినిమాకి సీక్వెల్ తీస్తే సంచలనాలే
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ `బాషా` చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుందా? అంటే.. అవుననే సమాచారం.
By: Tupaki Desk | 14 Jan 2025 5:30 PM GMTసూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ `బాషా` చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుందా? అంటే.. అవుననే సమాచారం. విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం 4K ఫార్మాట్ లో పెద్ద తెరపైకి తిరిగి రానుంది.
భారతీయ సినీ పరిశ్రమలో యాక్షన్ శైలిని విప్లవాత్మకంగా మార్చిన `బాషా` చిత్రాన్ని విక్రమ్ కృష్ణ దర్శకత్వంలో సత్య మూవీస్ బ్యానర్ పై ఆర్.ఎం వీరప్పన్ నిర్మించారు. 1995లో ఈ చిత్రం విడుదలైంది. సత్య మూవీస్ 60వ వార్షికోత్సవ వేడుక, అదే సమయంలో రజనీకాంత్ 50 ఏళ్ల సినీప్రయాణాన్ని గుర్తుచేసుకోవడానికి కూడా 30 ఏళ్ల వేడుక వేదిక కానుంది.
రీరిలీజ్ కోసం 4K రిజల్యూషన్‌లో రీమాస్టర్ చేసి, డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్‌తో పాటు ప్రేక్షకులకు అసమానమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నారు. 90లలో రజనీ మాయాజాలాన్ని చూసిన అభిమానులు ఇప్పుడు మరింత విజువల్ బ్యూటీతో థియేటర్లలో ఆస్వాధించవచ్చు. కొత్తతరం ప్రేక్షకులకు `బాషా` చిత్రం ఒక ప్రత్యేక అనుభవంగా మారుతుందనడంలో సందేహం లేదు.
బాషా .. ఆటో డ్రైవర్ మాణిక్కం కథ. అతడు భయంకరమైన అండర్ వరల్డ్ డాన్‌గా చీకటి గతాన్ని దాచిపెట్టాక ఏం జరిగిందనేదే సినిమా కథాంశం. బాషా ఆకర్షణీయమైన కథనం, శక్తివంతమైన యాక్షన్ సన్నివేశాలు, రజనీకాంత్ శైలితో, ఈ చిత్రం కమర్షియల్ సినిమాను రీడిఫైన్ చేసింది. ఈ సినిమాలోని డైలాగ్స్ అప్పట్లో ఒక సంచలనం. ``బాషా ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లే ! నేటికీ ఫ్యాన్స్ గుర్తుంచుకున్న డైలాగ్ ఇది.
ఈ చిత్రంలో నగ్మా కథానాయికగా నటించింది. రఘువరన్, చరణ్‌రాజ్, ఆనంద్‌రాజ్, జనగరాజ్, విజయకుమార్ , యువరాణి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పలు భాషలలో రీమేక్ చేసి థియేటర్లలో రికార్డు స్థాయిలో 15 నెలలు ప్రదర్శించడం అప్పట్లో సంచలనం.
ఆర్.ఎం వీరప్పన్ కుమారుడు తంగరాజ్ వీరప్పన్ సత్య మూవీస్ ఆధ్వర్యంలో రీరిలీజ్ ను ప్లాన్ చేసారు. అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించకపోయినా.. ఇది త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. 4కే వెర్షన్ ట్రీట్ కోసం ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో బాషా లాంటి క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ తీస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.