‘పొడుగు టైటిల్’ తో ఆ సూపర్ స్టార్ హిట్ కొడతారా?
సీనియర్లు వెంకటేష్, నాగార్జునతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు విడుదల కానున్నాయి.
By: Tupaki Desk | 9 Jan 2024 3:15 AM GMTతెలుగు సినిమాకు సంక్రాతి సీజన్ అతి పెద్దది. పెద్ద హీరోల సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడే సందర్భం ఇది. అందులోనూ తెలుగునాట అతిపెద్ద పండుగ కావడంతో ప్రజలు సినిమా హాళ్లకు పోటెత్తుతారు. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో అయితే ఒకే రోజు రెండు మూడు షోలు చూస్తారు. ఈ సంక్రాతికి కూడా తెలుగు తెర కళకళలాడనుంది. సీనియర్లు వెంకటేష్, నాగార్జునతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు విడుదల కానున్నాయి. అంటే..ముగ్గురు పెద్ద హీరోల చిత్రాలు సందడి చేయనున్నాయి.
పెద్ద టైటిల్ తో మరోసారి..
తెలుగు హీరోల్లో అత్యంత ఫాలోయింగ్ ఉన్నది సూపర్ స్టార్ మహేష్ బాబు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన్ను మహా బాగా ఇష్టపడతారు. అలాంటి మహేష్ నుంచి దాదాపు 20 నెలల తర్వాత సినిమా వస్తోంది. 2022 మేలో ‘సర్కారు వారి పాట’తో థియేటర్లలో కనిపించారు మహేష్ బాబు. ఆ తర్వాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. దీనికి రెండేళ్ల ముందు ‘సరిలేరు నీకెవ్వరూ’తో హిట్ కొట్టారు. సర్కారు వారి పాటకూ హిట్ టాక్ వచ్చింది. ఇక నాలుగేళ్లో మహేష్ రెండే సినిమాలు చేయగా.. ఈ రెండు సినిమాల టైటిల్స్ కూడా పొడుగ్గా ఉండడం గమనార్హం. ఇప్పుడు ‘గుంటూరు కారం’ అంటూ మరో పెద్ద టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
పొట్టి టైటిల్స్ తో గతంలో
మహేష్ బాబు స్క్రీన్ పై కనిపిస్తేనే అందం. ఆయనలాగానే ఆయన సినిమాల టైటిల్స్ కూడా చూడముచ్చటగానే ఉండేవి. తొలి సినిమా రాజకుమారుడు టైటిల్ కాస్త పెద్దదే అయినా.. ఆ తర్వాత దాదాపు అన్నీ రెండు, మూడు అక్షరాలతో ఉన్నవే. బాబీ, నిజం, అర్జున్, వంశీ, మురారి, ఒక్కడు, పోకిరి, అతడు, అతిథి, దూకుడు, ఆగడు, స్పైడర్, ఖలేజా, వన్ (నేనొక్కడినే), మహర్షి, నాని.. ఇలా ఎక్కువ శాతం మూడు అక్షరాల లోపువే. శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట మాత్రమే పెద్ద టైటిల్స్ తో తెరకెక్కాయి. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వెంకటేశ్ తో కలిసి చేసిన మల్టీ స్టారర్. ఇప్పుడు మహేష్.. గుంటూరు కారం అంటూ పెద్ద టైటిల్ తో వస్తున్నారు.
మళ్లీ హిట్ కొడతారా..
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వలో వస్తున్న గుంటూరు కారం టైటిల్ తొలిసారి విన్నప్పుడు కాస్త డిఫరెంట్ గా అనిపించింది. సినిమా విషయంలోనూ కొన్ని కథనాలు వచ్చాయి. అవన్న గట్టెక్కి ఈ నెల 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ట్రైలర్, టీజర్, పాటలకు విశేష స్పందన వస్తోంది. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో 2005లో వచ్చిన అతడు ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. 2010లో వచ్చిన ఖలేజాను ఇప్పటికీ చాలామంది హిట్ సినిమా కాదంటే ఒప్పుకోరు. ఈ రెండూ మూడు అక్షరాల టైటిల్స్. మరి మూడో ప్రయత్నంలో వీరినుంచి పెద్ద టైటిల్ తో వస్తున్న ‘గుంటూరు కారం’ అందరినీ మెప్పిస్తుందని ఆశిద్దాం.