ఓటీటీ కంటెంట్ నియంత్రణపై సుప్రీం తీర్పు
ప్రతి సినిమా విడుదలకు ముందు సెన్సార్ బోర్డ్ వద్దకు వెళుతుంది. అయితే ఇదే నియమాన్ని ఓటీటీలకు వర్తింపజేయాలనేది ఒక వాదన.
By: Tupaki Desk | 20 Oct 2024 10:48 AM GMTథియేటర్లలో విడుదలయ్యే సినిమాకి సీబీఎఫ్‌సి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తుంది. దీనికోసం ప్రాంతీయ సెన్సార్ బోర్డ్, కేంద్ర సెన్సార్ బోర్డ్ పని చేస్తున్నాయి. అభ్యంతరకరమైన కంటెంట్ ఉంటే దానికి కోతలు తప్పనిసరి. ప్రతి సినిమా విడుదలకు ముందు సెన్సార్ బోర్డ్ వద్దకు వెళుతుంది. అయితే ఇదే నియమాన్ని ఓటీటీలకు వర్తింపజేయాలనేది ఒక వాదన.
ఇప్పుడు ప్రముఖ న్యాయవాది సుప్రీంలో వినిపించిన వాదన ఆసక్తిని కలిగించింది. సినిమాలకు సెన్సార్ నిబంధనలు, సర్టిఫికేషన్ అనేవి ఉన్నప్పుడు..ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఎలాంటి పర్యవేక్షణ సంస్థ లేకుండానే పనిచేస్తాయని ఆయన కోర్టులో వాదించారు. నియంత్రణ లేకపోవడం భారత రాజ్యాంగం క్రింద రక్షించబడిన భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడానికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసారు. భారతదేశంలో ముప్పైకి పైగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లు బాధ్యతాయుతమైన కంటెంట్ ని అందించాలంటే, దానికి మార్గదర్శకాల అవసరాన్ని గుర్తు చేస్తూ తాజా కోర్టు పిటిషన్ చర్చనీయాంశంగా మారింది. నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోని కంటెంట్‌ను పర్యవేక్షించడానికి ఒక స్వతంత్ర సంస్థ కోసం పిలుపునిచ్చిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్) భారత సుప్రీంకోర్టు తిరస్కరించడం కీలక మలుపు.
అయితే కోర్టు ఈ సమస్యను ప్రయివేటు చేతికి చిక్కకుండా ప్రభుత్వమే మేనేజ్ చేయాల్సి ఉందని.. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు వివిధ వాటాదారులను సంప్రదించాలని సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి చంద్రచూడ్ తీర్పును వెలువరించారు. కంటెంట్ నియంత్రణ అనేది న్యాయవ్యవస్థ కంటే ప్రభుత్వానికి బాగా సరిపోతుంది. ఇది సంక్లిష్ట విధాన నిర్ణయాలను కలిగి ఉంటుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. సృజనాత్మక స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణకు అనుమతిస్తూనే OTT కంటెంట్‌ని నియంత్రించే మార్గాన్ని కనుగొనే బాధ్యత ప్రభుత్వంపై ఉందని తీర్పునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది శశాంక్ శేఖర్ మాట్లాడుతూ.. కాందహార్ హైజాకింగ్ గురించిన వెబ్ సిరీస్ లో కొన్ని సంఘటనలను ఎలా తప్పుగా చూపించారో కూడా ఆందోళన చెందారు.