ఇక్కడ కష్టం, వద్దు అన్నారు : సురేష్ బాబు
ఆ సమయంలోనే చాలా అందంగా ఉన్న సురేష్ బాబు ఎందుకు హీరోగా పరిచయం కాలేదు, ఎందుకు నిర్మాతగానే ఉన్నాడు అంటూ బాలకృష్ణ ఆసక్తికర చర్చకు తెర లేపారు.
By: Tupaki Desk | 28 Dec 2024 4:30 PM GMTసంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సంక్రాంతికి రాబోతున్న వెంకటేష్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో సందడి చేశారు. వెంకటేష్‌తో పాటు కొంత సమయం ఆయన సోదరుడు సురేష్ బాబు సైతం ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో పలు కుటుంబ విషయాలను, ఇండస్ట్రీ విషయాలను, చెన్నై ముచ్చట్లు బాలకృష్ణతో దగ్గుబాటి సోదరులు పంచుకున్నారు. ఆ సమయంలోనే చాలా అందంగా ఉన్న సురేష్ బాబు ఎందుకు హీరోగా పరిచయం కాలేదు, ఎందుకు నిర్మాతగానే ఉన్నాడు అంటూ బాలకృష్ణ ఆసక్తికర చర్చకు తెర లేపారు. సురేష్ బాబు ఎప్పుడూ నటన వైపు అడుగులు వేయలేదు.
తండ్రి బాటలో నడిచి దిగ్గజ నిర్మాతగా మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చారు. వెండి తెరపై కనిపించాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. హీరోగా సినిమాలు చేసేంతటి అందం ఉన్నా ఎందుకు ఇండస్ట్రీలో హీరోగా చేయలేదు అంటూ బాలకృష్ణ ప్రశ్నించిన సమయంలో వెంకటేష్ మధ్యలో కల్పించుకుని అప్పట్లో చెన్నైలో ఉన్నప్పుడు అన్నయ్య సురేష్ బాబును చాలా మంది కమల్ హాసన్ మాదిరిగా ఉంటాడు అనే వారు. అప్పుడు నేను గర్వంగా ఆనందించేవాడిని అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చారు. తనకు మొదటి నుంచి నటన పట్ల ఆసక్తి లేదని, నిర్మాతగానూ ఇండస్ట్రీలో పూర్తి స్థాయి ఇష్టంతో రాలేదు అన్నట్లుగా చెప్పుకొచ్చారు.
ఇంకా సురేష్ బాబు మాట్లాడుతూ... నాన్న చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీలో కష్టం, సినిమాల్లో రాణించడం అంత ఈజీ కాదురా, బాగా చదువుకోండి అంటూ చెప్పేవారు. అందుకే చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాను. పెద్ద అయ్యాక చాలా మంది నన్ను చెన్నైలో చూసి హీరోగా పరిచయం చేద్దాం అన్నారు. కానీ నాకు మాత్రం నటుడిగా ఎంట్రీ ఇవ్వాలని అస్సలు ఆసక్తి లేదు. అదే విషయాన్ని వారితో చెబుతూ ఉండేవాడిని, అందుకే నన్ను నాన్న సైతం హీరోగా చేయాలని అనుకోలేదు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ ఏర్పాటు సమయంలో ఎస్ పై వెంకటేష్‌ను, పీ పై నన్ను నిలబెట్టారు.
ఎస్ అంటే స్టార్‌గా వెంకటేష్ అవుతాడని, పీ అంటే ప్రొడ్యూసర్‌గా నేను అవుతానని అప్పట్లోనే ఆయన అనుకున్నారేమో. అందుకే అలా చేశారేమో అని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. రామా నాయుడు గారు చనిపోయే చివరి రోజుల వరకు ఏదో ఒక స్క్రిప్ట్ చదువుతూనే ఉండేవారు. ఇలాంటి సినిమాలు చేద్దాం, ఇలాంటి సినిమాలు తీద్దాం అనేవారు. ఎంపీగా ఎన్నో మంచి పనులు చేసినా ఓటమి చవి చూసిన సమయంలో నాన్నగారు చాలా బాధ పడ్డారు అంటూ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రామానాయుడు ప్రస్థావన వచ్చిన సమయంలో వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత చాలా ఫన్నీగానే ఎపిసోడ్ సాగింది.